రివ్యూ: సందీప్నాయుడి కష్టం ఫలించిందా? - సందీప్ కిషన్ వార్తలు
యువ కథానాయకుడు సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. హాకీ క్రీడా నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హాకీ కథాంశంతో రూపొందిన సినిమా ప్రేక్షకులను అలరించిందా? సందీప్, లావణ్య నటన ఎలా ఉంది? తెలుసుకోవాలంటే ఈ సమీక్షను చదవాల్సిందే!
ఏ1 ఎక్స్‌ప్రెస్
By
Published : Mar 5, 2021, 4:25 PM IST
|
Updated : Mar 5, 2021, 4:42 PM IST
చిత్రం: ఏ1 ఎక్స్‌ప్రెస్
నటీనటులు: సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, రావు రమేశ్, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి తదితరులు
బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్
విడుదల: 05-03-2021
'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమా పోస్టర్
క్రీడా నేపథ్యంలో తరచూ సినిమాలొస్తుంటాయి. అయితే మన జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో మాత్రం తెలుగులో సినిమాలు రాలేదు. హిందీలో అయితే 'చక్‌దే' లాంటి సంచలన చిత్రాలు గుర్తుకొస్తాయి. సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించిన 25వ చిత్రంగా.. తొలి తెలుగు హాకీ నేపథ్య చిత్రంగా 'ఏ1 ఎక్స్‌ప్రెస్' తెరకెక్కింది. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. సందీప్‌కిషన్ ఈ చిత్రం కోసం సిక్స్‌ప్యాక్ చేయడం సహా.. హాకీలోనూ శిక్షణ తీసుకుని నటించాడు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?
కథేంటంటే?
యానాంలో చిట్టిబాబు హాకీ గ్రౌండ్ ఎంతో చరిత్రాత్మకమైనది. సముద్రం పక్కనే ఉన్న ఆ గ్రౌండ్‌పై ఓ విదేశీ కంపెనీ కన్ను పడుతుంది. స్థానిక రాజకీయ నాయకుడు, క్రీడాశాఖ మంత్రి అయిన రావు రమేశ్ (రావు రమేశ్) అండతో ఆ గ్రౌండ్‌ను సొంతం చేసుకునేందుకు విదేశీ కంపెనీ పావులు కదుపుతుంది. ఇంతలో తన మేనమామ ఇంటికి వచ్చిన సందీప్‌నాయుడు అలియాస్ సంజు(సందీప్ కిషన్) తను మనసుపడిన అమ్మాయి లావణ్య (లావణ్య త్రిపాఠి) కోసం తరచూ ఆ గ్రౌండ్‌కి వెళ్తుంటాడు. లావణ్య కోసం తప్పని పరిస్థితుల్లో హాకీ స్టిక్ పట్టుకోవాల్సి వస్తుంది. ఆమె కోసం ఆట ఆడిన క్రమంలో సందీప్ నాయుడు గురించి ఎలాంటి విషయాలు తెలిశాయి? చిట్టిబాబు గ్రౌండ్‌ను కాపాడటం కోసం సందీప్ ఏం చేశాడు? అతని గతం ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
క్రీడా నేపథ్యంలో సాగే సగటు సినిమాల్లో కనిపించే వ్యవహారాలే ఇందులోనూ కనిపిస్తాయి. ఆట ఏదైనా రాజకీయాలు మాత్రం అవే. అండదండలు ఉన్నవాడిదే ఆట అన్నట్టుగా అసలైన ప్రతిభను తొక్కేయడం, క్రీడల్ని వ్యాపారం చేయడం వంటివే ఈ కథకీ ముడిసరకులు. ఎటొచ్చీ హాకీ నేపథ్యమే మనకు కాస్త కొత్తదనాన్ని పంచుతుంది. తెలుగులో ఈ క్రీడను స్పృశిస్తూ సాగిన సినిమాలు ఇప్పటిదాకా రాలేదు.
సహజంగానే ఆటలోనే బోలెడంత డ్రామా ఉంటుంది. గెలుపోటములు, ఎత్తులు పైఎత్తులతో సాగే ఆట నుంచి బోలెడన్ని భావోద్వేగాలు పండుతుంటాయి. ఆ భావోద్వేగాల్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడమే అసలు సిసలు సవాల్. ఆ విషయంలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' పర్వాలేదనిపించింది. అసలు కథలోకి వెళ్లడానికే చాలా సమయం పడుతుంది. ప్రథమార్ధం అంతా నాయకానాయికల మధ్య ప్రేమాయణం, కుటుంబ నేపథ్యంలోని కామెడీ సన్నివేశాలతోనే సాగుతుంది.
కథానాయకుడు హాకీ స్టిక్ పట్టుకున్నాక అసలు కథ మొదలవుతుంది. అభిమన్యుడి పాటతో సాగే విరామానికి ముందు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధంలో కథానాయకుడి ఫ్లాష్ బ్యాక్, ఆటల్లో రాజకీయాల నేపథ్యంలో సాగే ఆ సన్నివేశాలు సినిమాకి కీలకమైనా.. క్రీడల నేపథ్యంలో సాగే చాలా సినిమాల్లో చూసినవే కావడం వల్ల అవి ప్రేక్షకులకు కొత్తగా అనిపించవు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కూడిన ఆ సన్నివేశాలతో భావోద్వేగాల్ని రాబట్టేందుకు దర్శకుడు ఇంకాస్త బలమైన సన్నివేశాలు రాసుకోవాల్సింది.
పతాక సన్నివేశాల్ని ఆట నేపథ్యంలోనే తీర్చిదిద్దారు. సినిమాటిక్‌గా అనిపించినా ఆట మాత్రం ఆకట్టుకుంటుంది. తమిళ సినిమా ఆధారంగా తీసిన సినిమా ఇది. కథ, కథనాల విషయంలో మరింత పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు ఆస్కారమున్నా ఈ చిత్రబృందం తగిన స్థాయిలో ప్రయత్నాలు చేయలేదనిపిస్తుంది. చాలా సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుంటాయి.
'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమా పోస్టర్
ఎవరెలా చేశారంటే?
సందీప్‌కిషన్ నటన ఆకట్టుకుంటుంది. సిక్స్‌ప్యాక్ దేహంతో స్లిమ్‌గా తయారై ఈ సినిమాలో నటించాడు. హాకీలోనూ శిక్షణ తీసుకున్నాడు. ఆ ప్రభావం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. లావణ్య త్రిపాఠి సందడి ప్రథమార్ధంలోనే. ద్వితీయార్ధంలో ఆమె పాత్రను పూర్తిగా పక్కన పెట్టేసినట్టు అనిపిస్తుంది. రాజకీయ నాయకుడిగా రావు రమేశ్ బలమైన పాత్రలో కనిపించారు. ప్రథమార్ధంలో ఫార్మా కంపెనీతో డీలింగ్ కుదుర్చుకునే సన్నివేశాల్లోనూ, ద్వితీయార్ధంలో లోకల్ మీడియాకు వార్నింగ్ ఇవ్వడం, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తుంది.
ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాసేపే కనిపించినా సినిమాపై ప్రభావం చూపించారు. మురళీశర్మ, అభిజిత్, సత్య, పోసాని తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సంగీతం, కెమెరా విభాగాలు చక్కటి పనితీరును కనబరిచాయి. దర్శకుడు డెన్నిస్‌కి తొలి చిత్రం ఇది. ప్రథమార్ధంలో వచ్చే సన్నివేశాలపైనా, భావోద్వేగాలపైనా ఆయన మరింతగా దృష్టి పెట్టి ఉంటే ఇంకాస్త బాగుండేది.
బలాలు
బలహీనతలు
+ హాకీ నేపథ్యం
- ప్రథమార్ధం
+ద్వితీయార్ధం
- కథనం
+సందీప్ కిషన్ నటన
చివరిగా: ఎక్స్‌ప్రెస్ కాదు.. ఆర్డినరీనే!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!