చిత్రం: ఖిలాడి; నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, అర్జున్, అనసూయ, మురళీ శర్మ, ఉన్ని ముకుందన్, ముఖేష్ రుషి, వెన్నెల కిషోర్, తదితరులు;సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; ఛాయాగ్రహణం: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు; దర్శకత్వం:రమేశ్ వర్మ; నిర్మాత:కోనేరు సత్యనారాయణ; విడుదల తేదీ:11-02-2022
కొవిడ్ మూడో దశ ఉద్ధృతి వల్ల సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి అంతగా కనిపించలేదు. గత మూడు వారాల్లో అడపాదడపా ఒకటి రెండు చిన్న చిత్రాలు థియేటర్ ముందుకొచ్చినా.. వాటిల్లో ఏ ఒక్కటీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ క్రమంగా కుదుటపడుతుండటంతో.. మళ్లీ చిత్రసీమలో వినోదాల సందడి మొదలైంది. అగ్రతారల సినిమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అలా ఈ వారం రవితేజ ‘ఖిలాడి’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘క్రాక్’ వంటి హిట్ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా కావడం, దానికి తోడు ‘రాక్షసుడు’ లాంటి విజయం తర్వాత రమేశ్ వర్మ తెరకెక్కించిన చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే పాటలు, ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? రవితేజ, రమేశ్ వర్మ ఖాతాలో మరో విజయం చేరిందా? ఇంతకీ ఈ కథేంటి? తెలుసుకుందాం పదండి.
కథేంటంటే: పూజా(మీనాక్షి చౌదరి) ఇంటెలిజెన్స్ ఐజీ జయరామ్(సచిన్ ఖేడ్కర్) కుమార్తె. చాలా తెలివైన అమ్మాయి. క్రిమినల్ సైకాలజీ చదువుతుంటుంది. ఓ థీసెస్ కోసం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మోహన్ గాంధీ(రవితేజ)ని కలుస్తుంది. హోం మంత్రి గురుసింగం(ముఖేష్ రుషి) రూ.10వేల కోట్లకు సంబంధించిన లావాదేవి వల్ల తానెలా సమస్యల్లో చిక్కుకున్నది, కుటుంబాన్ని పోగొట్టుకుని చేయని నేరానికి జైలుకు ఎలా రావాల్సి వచ్చింది.. ఓ కట్టుకథలా ఆమెకు చెప్తాడు. ఆ కథ నిజమని నమ్మిన పూజా.. మోహన్‌గాంధీకి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరీ అతనికి బెయిల్ వచ్చేలా చేస్తుంది. సరిగ్గా గాంధీ బయటకు రాగానే అతడి జీవితానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం తెలుస్తుంది. అతడు ఓ అంతర్జాతీయ క్రిమినల్ అని, హోంమంత్రి డబ్బు కొట్టేయడానికే ఇటలీ నుంచి భారత్‌కు వచ్చాడని, ఇందుకోసం తెలివిగా తనని వాడుకున్నాడని పూజాకు అర్థమవుతుంది. మరి ఆ డబ్బు ఎవరిది? అదెక్కడ దాచారు? ఆ డబ్బుతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఆశపడిన గురుసింగం కోరిక తీరిందా?డబ్బును కొట్టేయాలన్న గాంధీ కోరిక నెరవేరిందా? డబ్బుతో పాటు గాంధీని పట్టుకోవాలన్న సీబీఐ అధికారి అర్జున్ భరద్వాజ్ (అర్జున్) లక్ష్యం నెరవేరిందా? ఈ మొత్తం కథలో డింపుల్, అనసూయ, ఉన్ని ముకుందన్, మురళీ శర్మల పాత్రలేంటి?అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా సాగిందంటే: రూ. 10 వేల కోట్ల డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. దీన్ని విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా తెరపై వడ్డించే ప్రయత్నం చేశారు దర్శకుడు రమేశ్ వర్మ. ఓ తెలివిమీరిన దొంగ.. రూ.10 వేల కోట్ల టార్గెట్.. ఆ డబ్బు కోసమే కాచుకు కూర్చొన్న రెండు ముఠాలు.. ఆ డబ్బును, దొంగల్ని పట్టుకు తీరాలనే లక్ష్యంతో తిరిగే సీబీఐ అధికారి.. ఇవన్నీ చూస్తుంటే ఓ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన సరుకంతా ఈ కథలో ఉన్నట్లు అర్థమవుతుంది. నిజానికి ఈ దినుసుల్ని సరిగ్గా సమగ్రంగా ఉపయోగించుకుని ఉంటే.. ఓ పసందైన థ్రిల్లర్ తయారై ఉండేది. కానీ, వీటన్నింటినీ సరైన రీతిలో మేళవించి.. ఆసక్తికరంగా సినిమాని మలచడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ఈ కథను చెప్పడానికి ఆయన ఎంచుకున్న ఎత్తుగడే పేలవంగా అనిపిస్తుంది. భార్యని, అత్తమామల్ని హత్య చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా రవితేజ పాత్రని పరిచయం చేసిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. పూజాకు అతడు తన కథ చెప్పడం ప్రారంభించాక థ్రిల్లర్ సినిమా కాస్తా.. రొటీన్ ఫ్యామిలీ డ్రామాలా మారిపోతుంది. రవితేజ, డింపుల్‌ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా సాదాసీదాగా ఉంటాయి. నిజానికి సినిమా అసలు కథ ఇది కాబట్టి ఈ ఎపిసోడ్‌పై దర్శకుడు అంత దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. అయితే పాటల్లో డింపుల్ ఒలికించిన అందాలు కుర్రకారుకు కాస్త కాలక్షేపాన్నిస్తాయి. గురుసింగానికి సంబంధించిన రూ.10వేల కోట్లను డెవిడ్ ముఠా కొట్టేయడం.. ఈ క్రమంలో వచ్చే ఛేజింగ్ ఎపిసోడ్లతో కథలో కాస్త వేగం పెరుగుతుంది. విరామానికి ముందు మోహన్ గాంధీ పాత్ర అసలు కథను రివీల్ చేయడం.. ఈ సందర్భంగా అర్జున్, గాంధీ పాత్రల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలుస్తాయి.
ద్వితియార్ధం నుంచి సినిమా పూర్తిగా థ్రిల్లర్ ట్రాక్ ఎక్కినట్లు కనిపించినా.. కాసేపటికే కథ మొత్తం రొటీన్ వ్యవహారంలా మారిపోతుంది. రూ.10 వేల కోట్లు కొట్టేయడం కోసం మోహన్‌గాంధీ ముఠా చేసే ప్రయత్నాలు చాలా వరకు సిల్లీగా ఉంటాయి. అయితే మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌లు కాస్త ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. థ్రిల్లర్ కథలకు ముగింపు చాలా కీలకం. కానీ, ఈ సినిమా విషయంలో అదే పెద్ద మైనస్. ఊహకందని మలుపులు.. విపరీతమైన ట్విస్ట్‌లు.. రుచి చూపించాలన్న తాపత్రయంలో దర్శకుడు కథని సాగదీసే ప్రయత్నం చేశారు. వాటిలో చాలా వరకూ ఊహలకు తగ్గట్లుగా సాగడం.. లెంగ్తీగా ఉండటంతో క్లైమాక్స్ విసుగు పుట్టించేలా మారిపోయింది. అయితే పతాక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే: మోహన్ గాంధీ పాత్రలోని రెండు షేడ్స్‌ను రవితేజ అద్భుతంగా పండించారు. ముఖ్యంగా ద్వితియార్ధంలో ఆయన నటన మరోస్థాయిలో ఉంటుంది. డింపుల్ హయాతి అభినయంతో కన్నా.. అందచందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పాటల్లో ఏమాత్రం మొహమాటం లేకుండా అందాలు ఒలికించింది. మీనాక్షి చౌదరి కూడా తన సొగసులతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. నటన పరంగా ప్రతిభ చూపించేందుకు ఆమెకి కూడా పెద్ద అవకాశం రాలేదు. అనసూయ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ పాత్రల్లోనూ రెండు షేడ్స్ కనిపిస్తాయి. కానీ, ప్రతి పాత్ర రొటీన్‌గానే అనిపిస్తుంది. నికితిన్ ధీర్, ఉన్ని ముకుందన్, ముఖేష్, అర్జున్, రావు రమేష్‌ల పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. స్ర్కిప్ట్ విషయంలో రమేశ్ మరింత కసరత్తు చేయాల్సింది. ద్వితియార్ధంలో మలుపులు ఉన్నా.. ప్రతి ఎపిసోడ్ సాగతీత వ్యవహారమైపోయింది. రెండు మూడు పాటల్లో దేవిశ్రీప్రసాద్ మార్క్ కనిపించినా.. నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో ఉండదు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపిస్తుంది.
బలాలు:
+ రవితేజ నటన