చిత్రం:ది కైట్ రన్నర్
భాష:ఇంగ్లీష్, పస్తో, ఉర్దూ, దరి
దర్శకత్వం:మార్క్ ఫోర్‌స్టర్
కథ: ఖలీద్ హుస్సేని
నటీనటులు:ఖలీద్ అబ్దల్లా, జకే రియా ఇబ్రహిమి, మహమ్మద్ జడా అహ్మద్ ఖాన్, తదితరులు
సినిమాటోగ్రఫీ:రాబర్టో స్కీఫర్
సంగీతం:అల్బర్టో ఇగ్లెసియాస్
నిడివి:128 నిమిషాలు
ఎక్కడ చూడొచ్చు:నెట్‌ఫ్లిక్స్
అఫ్గానిస్థాన్ రగులుతున్న యుద్ధనేల. కొన్ని దశాబ్దాలుగా అక్కడ భయానక వాతావరణమే. రష్యన్లు, తాలిబన్లు, అమెరికన్లు ఇలా ఎవరో ఒకరి బూట్ల కింద నలిగిపోతున్న నేలది. అక్కడి యుద్ధం, అణచివేతపై చాలా సినిమాలు తెరకెక్కాయి. అఫ్గాన్ మహిళల దీనస్థితిపై 'కాందహార్', యుద్ధంపై 'ఔట్‌పోస్ట్' లాంటి సినిమాలు అక్కడి పరిస్థితిని ప్రతిబింబించాయి. 'ది కైట్ రన్నర్'(the kite runner) అక్కడి జీవాన్ని, విషాదాన్ని ఒడిసిపట్టుకున్న చిత్రమే. ఖలీద్ హుస్సేని రాసిన 'ది కైట్ రన్నర్' పుస్తకం ఆధారంగానే తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. తాలిబన్లు మరోసారి దేశాన్ని వశం చేసుకున్నారు. దీంతో విమానం చక్రంపైనా కూర్చుని దేశం దాటాలని ప్రయత్నిస్తున్నవారు కొందరు, బిడ్డలను సరిహద్దు కంచెలపై నుంచి విసిరేస్తూ కాపాడుకోవాలనుకునే నిర్భాగ్యులు మరికొందరు.. అంతలా ఎందుకు భయపడుతున్నారు? తాలిబన్ల పాలన అంత క్రూరంగా ఉంటుందా? అనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూసి తీరాల్సిందే.
కథ..
సినిమా కథంతా సోవియట్ సైన్యం జోక్యం చేసుకోకముందు 1970ల్లో అఫ్గానిస్థాన్‌లో మొదలవుతుంది. అమీర్ ఓ సంపన్న కుటుంబానికి చెందిన పదేళ్ల బాలుడు. కాబుల్‌లో విశాలమైన ఇంట్లో తండ్రి ఆగా సాహెబ్‌తో కలిసి ఉంటాడు. అదే ఇంట్లో పనిచేస్తున్న అలీ కుమారుడు హసన్‌తో స్నేహం ఏర్పడుతుంది. అమీర్ పస్తూన్ తెగకు చెందిన వాడు అయితే, హసన్ హజరీ తెగకు చెందినవాడు. అయినా ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ ఏర్పడుతుంది. చిన్నప్పటి నుంచే కథలు రాసే అలవాటున్న అమీర్, తను రాసినవాటిని హసన్‌కి చదివి వినిపిస్తుంటాడు. అమీర్ చెబితే మట్టిని కూడా తినేందుకు వెనకాడనంత అభిమానం ఉంటుంది హసన్‌కి. కాబుల్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే గాలిపటాల పోటీలో ఈ ఇద్దరూ పాల్గొంటారు. పోటీదారుల గాలిపటాలన్నీ తెంపేసి విజేతలుగా నిలుస్తారు. చివరగా తెగిపడిన గాలిపటాన్ని అమీర్‌కు కానుకగా ఇవ్వాలని దాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు హసన్. అలా వెళ్లిన హసన్‌పై ముగ్గురు కుర్రాళ్లు దాడి చేసి అత్యాచారానికి ఒడిగడతారు. ఈ దృశ్యాన్నంతా అమీర్ చూసినా, అడ్డుకునే ప్రయత్నం చేయడు. ఆ అపరాధ భావంతో కొన్నాళ్లు హసన్‌కు దూరంగా ఉంటాడు. ఇదిలా ఉండగా సోవియట్ సైన్యం 1979లో జోక్యం చేసుకున్నాక అమీర్ తండ్రి ఆగా సాహెబ్ తప్పించుకొని పాకిస్థాన్‌కు అక్కడి నుంచి అమెరికా వెళ్తాడు. 20 ఏళ్ల తర్వాత అమీర్ అక్కడే రచయితగా మారి ఒక పుస్తకాన్ని తీసుకొస్తాడు. ఆ సమయంలోనే అమీర్ తండ్రి స్నేహితుడు ఒకాయన ఫోన్ చేసి అత్యవసరంగా రమ్మని కబురు పంపుతాడు. అమెరికాలో ప్రశాంత జీవనం గడుపుతున్న అమీర్‌ను వెనక్కి రమ్మంది ఎవరు? ఇంతకీ అమీర్ స్నేహితుడు హసన్ ఏమయ్యాడు? తాలిబన్లు రాజ్యమేలుతున్న కాలంలో అఫ్గానిస్థాన్‌కు వెళ్లి సురక్షితంగా ఎలా రాగలిగాడు? ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్లేందుకు గల బలమైన కారణమేంటి? అనేది మిగతా కథ.
ఇదీ చదవండి:Movie Review: 'క్షీర సాగరాన్ని' ఇంకా మథిస్తే..!
అణచివేతకు అద్దం..
సినిమా మొత్తం మూడు కాలాల్లో జరుగుతుంది. రష్యన్ సైన్యం జోక్యం చేసుకోకముందు అమీర్ బాల్యంతో మొదటి అర్ధభాగం గడిస్తే, అమెరికాలో వారి జీవితం, తాలిబన్ పాలన సమయంలో అమీర్ అఫ్గానిస్థాన్ ప్రయాణం ద్వితీయార్థంలో సాగుతుంది. హజారీ తెగల పట్ల ఉండే వివక్షతో పాటు, తాలిబన్ల అరాచక పాలనను కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. శరణార్థులుగా మారి పాకిస్థాన్‌కు పారిపోయే క్రమంలో వచ్చే సన్నివేశాలు కంటతడిపెట్టిస్తాయి. సరిహద్దు దాటాలంటే వ్యాన్‌లో ఉన్న ఓ బాలింతను తనతో అరగంట గడపమని కోరతాడు సైనికుడు. మరో సన్నివేశంలో తాలిబన్లు సంప్రదాయన్ని విస్మరించిందని ఒక స్త్రీని బహిరంగంగా రాళ్లతో కొట్టిచంపుతారు. ఈ సన్నివేశాలు అఫ్గాన్ మహిళల హీనస్థితికి అద్దం పడతాయి. అమెరికాకు పారిపోయే క్రమంలో జన్మభూమి నుంచి పిడికెడు మట్టిని గుర్తుగా వెంటతీసుకెళ్తాడు అమీర్ తండ్రి. ఆ నేలన్నా, గాలన్నా వారికి ఎంత మమకారమో తెలియజేసే సన్నివేశమది.
అక్కడ తీవ్ర వ్యతిరేకత..
అఫ్గానిస్థాన్‌లో సినిమా చిత్రీకరణ జరుపుకోవడం ప్రమాదకరమేనని భావించిన చిత్రబృందం.. ఆ సన్నివేశాలను చైనాలోని ఓ ప్రాంతంలో రహస్యంగా చిత్రీకరించింది. విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. 20 మిలియన్ డాలర్లతో తెరకెక్కి, దాదాపు 75 మిలియన్ డాలర్లను ఆర్జించింది. కానీ సొంత దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. చిత్రంలోని వివాదాస్పద, హింసాత్మక ఘటనలు అఫ్గానిస్థాన్ దేశ పరిస్థితులను వక్రీకరించాయని అక్కడ నిషేధించారు. అఫ్గాన్ సమాజం నుంచి తీవ్రమైన బెదిరింపులొచ్చాయి. బాల అమీర్‌గా నటించిన జెకెరియా గృహనిర్బంధంలో ఉండటమే కాదు, మరోసారి సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకోవడం విషాదకరం. ఇక బాల హసన్‌గా చేసిన మహమ్మద్‌జడా మరింత దారుణమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. హజరీ, పస్తూన్ తెగల నుంచి బెదిరింపులు తగ్గకపోవడం వల్ల స్మగ్లర్ల సాయంతో ఆయన స్వీడన్ పారిపోయాడు.
ఇదీ చదవండి: రివ్యూ:'ఒరేయ్ బామ్మర్ది' అలరించాడా?