బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar) ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'తూఫాన్'(Toofaan). ఒక గ్యాంగ్‌స్టర్ బాక్సింగ్ ఛాంపియన్ ఎలా అయ్యాడు.. ఆ తర్వాత బాక్సింగ్‌కు ఎందుకు దూరమయ్యాడు అనే కథాంశంతో డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా(Rakeysh Omprakash Mehra) ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో పరేశ్‌రావల్ కీలకపాత్ర పోషించారు. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సగటు సినీ ప్రేక్షకుడ్ని మెప్పించిందా? ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
స్పోర్ట్స్ - సినిమా.. ఈ కాంబినేషన్ ఎప్పుడూ ఆసక్తికరమే. గతంలో ఈ కాన్సెప్ట్‌లో వచ్చిన చాలా సినిమాలు విజయాలు సాధించాయి. అందులో బాక్సింగ్ నేపథ్యం అంటే ఇంకొంచెం కిక్ ఉంటుంది. కారణం.. ఇలాంటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ పెట్టడానికి దర్శకుడు, రచయిత కొత్తగా ఆలోచించక్కర్లేదు. అలా యాక్షన్ ప్యాక్డ్‌తో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'తూఫాన్'(Toofaan). ఫరాన్ అక్తర్(Farhan Akhtar), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్(Toofaan On Amazon Prime) ద్వారా విడుదలైంది. మరి 'తూఫాన్' ఎలా ఉందో చూద్దామా!
కథేంటంటే?
అజ్జు భాయ్ అలియాస్ అజీజ్ అలీ (ఫరాన్ అక్తర్) ముంబయిలోని డోంగ్రీలో స్ట్రీట్ ఫైటర్. జాఫర్ భాయ్ (విజయ్ రియాజ్) అనే పెద్ద రౌడీ దగ్గర స్ట్రీట్ ఫైటర్‌గా పని చేస్తుంటాడు. తత్వం చూస్తే.. చాలా మొండివాడు. ఏదైనా అనుకుంటే జరిగిపోవాల్సిందే అంటాడు. అలాంటి అజ్జు.. బాక్సింగ్ బరిలోకి దిగి, తన సత్తా చాటాలని అనుకుంటాడు. అదే సమయంలో అనన్య ప్రభు (మృణాల్ ఠాకూర్) పరిచయం అవుతుంది. మొండితనంతో నేర్చుకున్న బాక్సింగ్ కంటే.. టెక్నిక్‌తో నేర్చుకున్న బాక్సింగ్ గొప్పతనం తెలుసుకొని.. బాక్సింగ్ గురువు నానా ప్రభు (పరేశ్ రావల్) దగ్గర చేరి శిష్యరికం చేసి మెరికలా తయారవుతాడు.
'తూఫాన్' సినిమాలో ఫర్హాన్ అక్తర్
ఆ తర్వాత వరుసగా ప్రత్యర్థులను ఓడిస్తూ స్టేట్ ఛాంపియన్‌గా నిలుస్తాడు. ఈలోపు గురువు నారాయణ్ ప్రభుకు అజీజ్-అనన్య ప్రేమ వ్యవహారం తెలిసిపోతుంది. దీంతో అజీజ్‌ను తిట్టి పంపించేస్తాడు. మరోవైపు అనన్య కూడా ఇదే కారణంతో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈలోగా జాతీయస్థాయి పోటీలు ప్రారంభం కావడం వల్ల అజీజ్ దిల్లీ వెళ్తాడు. అక్కడ ఓ బుకీ వచ్చి అజీజ్‌తో బేరం కుదుర్చుకుంటాడు. అజీజ్ ఆ డబ్బు తీసుకొని ఓడిపోతాడు. ఆ తర్వాత విషయం బయటికొచ్చి.. బాక్సింగ్ ఫెడరేషన్ అజీజ్‌ను సస్పెండ్ చేస్తుంది. అజీజ్‌కు డబ్బులు ఎందుకు అవసరమయ్యాయి? అజీజ్ తిరిగి బాక్సింగ్ రింగ్‌లోకి వచ్చాడా? నారాయణ్ ప్రభు కూతురు, అల్లుడిని ఇంటికి తీసుకొచ్చాడా? అనేదే 'తూఫాన్' కథ.
ఎలా ఉందంటే?
బాలీవుడ్‌లో బయోపిక్స్ కాకుండా బాక్సింగ్ నేపథ్య సినిమాలు అంటే.. ఠక్కున గుర్తొచ్చేది 'ముక్కాబాజ్', 'సుల్తాన్', 'బ్రదర్స్'. ఈ సినిమాల్లో కామన్‌గా ఉండే అంశం లక్ష్యం అంటూ లేకుండా తిరిగే హీరోకు.. హీరోయిన్ వచ్చి లక్ష్యాన్ని గుర్తు చేయడం, ఆ తర్వాత హీరో దానికి తగ్గట్టుగా మారి విజయం సాధించడం. 'తూఫాన్'ను కూడా అదే పంథాలో తీసుకెళ్లారు దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మోహ్రా. దాంతోపాటు ఇదే నిర్మాణ సంస్థల నుంచి గతంలో వచ్చిన 'గల్లీ బాయ్' స్ఫూర్తి ఈ సినిమాలో కనిపిస్తుంది. చాలా వరకు సీన్స్ ఆ సినిమాను గుర్తుకు తెస్తుంది. కారణం సినిమా స్టోరీని చెప్పడానికి ఆ సినిమా టెక్నిక్‌ను వాడుకోవడమే. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా అంటే హీరో గెలుపు జోరులో ఉన్నప్పుడు ఏదో అనుకోని ఘటన జరిగో.. లేక అతనే తప్పుడు పని చేసి అమాంతం కిందకు పడతాడు. ఈ సినిమాలోనూ అదే చేశారు. దీంతో ప్రేక్షకులకు పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించదు. అయితే పైన చెప్పిన మూడు బాక్సింగ్ సినిమాలు చూడనివారికి ఈ సినిమా కొత్తగా అనిపించొచ్చు.
'తూఫాన్' సినిమా పోస్టర్
సినిమా రెండు గంటల 41 నిమిషాల నిడివి ఉంటుంది. ఓటీటీల్లో చూసేవాళ్లకు అంత నిడివి అంటే కష్టమే అని చెప్పొచ్చు. ఇంత పెద్ద సినిమా అయినప్పటికీ.. ముఖ్యమైన, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలను మాంటేజ్ సాంగ్స్ రూపంలో లాగించేశారు. తొలిసారి అజీజ్ అలీ బాక్సింగ్ నేర్చుకోవడం, రెండోసారి బాక్సింగ్ కోసం సిద్ధమవ్వడం, ప్రేమ-పెళ్లి కష్టాలు ఇలా కనెక్టింగ్ సెగ్మెంట్స్, సీన్స్ పాటల్లో కలిపేశారు. దీంతో హీరోహీరోయిన్లకు ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేడు. కొన్ని సీన్స్ అయితే.. అర్థం కాకుండా ముందుకెళ్లిపోతాయి. తొలుత అజీజ్ అలీకి శిక్షణ ఇవ్వడానికి ఇష్టపడని నారాయణ్ ప్రభు.. ఆ తర్వాత అతనిలో ఏం గమనించి శిక్షణ ఇచ్చాడనేది ప్రేక్షకులకు రిజిస్టర్ అవ్వదు. తన కూతురినే అజీజ్ ప్రేమిస్తున్నాడు అని తెలిశాక.. వచ్చే ఎమోషనల్ సీన్స్ పాసింగ్ క్లౌడ్‌లా వచ్చి వెళ్లిపోతాయి తప్ప.. ఫీల్‌ను కలిగించేలా ఉండవు.
సినిమా మెయిన్ స్టోరీ అజీజ్ అలీ 'తూఫాన్'గా ఎలా మారాడు.. తర్వాత ఏం చేశాడు? అయితే.. సమాంతరంగా దర్శకుడు మరో విషయం చెప్పే ప్రయత్నం చేశారు. అదే దేశంలో రెండు వర్గాల మధ్య ఉన్న స్పర్థలు. ఎక్కడో ఎవరో చేసిన పనికి.. ఆ వర్గం వారంతా అలాంటివారే అనుకుంటూ ఉంటాడు నానా ప్రభు. దానిని ఖండిస్తూ ఉంటాడు బాలా. ఆ విషయంలో ఈ రెండు పాత్రల మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఫైనల్‌గా దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా పూర్తి చేయలేకపోయారు అనిపిస్తుంది. ఇద్దరి వాదనలు వినిపించి.. ప్రేక్షకులు మీరే నిర్ణయించుకోండి అని వదిలేసినట్లు ఉంటుంది. ఒక బర్నింగ్ టాపిక్ ఎత్తుకున్నప్పుడు దానికి ఏదో ఒక సమాధానం కూడా ఇవ్వాల్సింది.
'తూఫాన్' సినిమా పోస్టర్
ఎవరెలా చేశారంటే?
సినిమాలో చాలామంది నటీనటులు కనిపించినా.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముగ్గురి గురించే. మొదటిది ఫరాన్ అక్తర్. అజ్జు భాయ్ నుంచి అజీజ్ అలీ అనే బాక్సర్‌గా మారుతుంది అతని పాత్ర. అజ్జు భాయ్ పాత్రలో ఫరాన్ గొప్పతనం ఏమీ కనిపించదు. ఏదో సాధారణ నటుడిలా కనిపించాడు. కానీ అజీజ్ అలీగా మారుతున్నప్పుడు, మారాక అసలు సిసలు ఫరాన్ కనిపిస్తాడు. బాక్సర్‌కు కావాల్సిన శరీరాకృతిని పొందడానికి అతడు పడ్డ కష్టం, చేసిన శ్రమ తెరపై స్పష్టంగా చూడొచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో తనను కొట్టేవారే లేరని మరోసారి నిరూపించాడు. ఇక రెండోపాత్ర పరేశ్ రావల్. అదేదో సినిమాలో చెప్పినట్లు 'సీనియారిటీ ఎక్కడికి పోతుంది' చెప్పండి. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్ ఇస్తూ.. అవసరమైనప్పుడు గేర్ మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. దాన్నే మరోసారి చేసి చూపించారాయన. మిగిలిన మూడో పాత్ర మృణాల్ ఠాకూర్. కీలక సమయంలో వెన్ను తట్టి హీరోను ముందుకు నడిపంచే పాత్ర. క్యూట్‌గా కనిపించాల్సిన సమయంలో క్యూట్‌గానూ, పెద్దరికం చూపించాల్సిన దగ్గర పెద్దరికంతోనూ ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలు వారి పరిధి మేరకు రాణించాయి.
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడితే.. ముందుగా చెప్పాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించే. 'గల్లీబాయ్' సినిమాలో ఆయన పెట్టిన షాట్స్ ఇప్పటికీ సినిమా అభిమానులకు గుర్తుండే ఉంటాయి. అలాంటి పనితనమే 'తూఫాన్'లోనూ చూపించాడు. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. సినిమాలో అంతగా ఆకట్టుకునే వర్క్ అయితే కనిపించలేదు. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా అంటే ఎన్నో ఆశలు పెట్టుకునే సినిమా అభిమానులు ఉంటారు. అయితే మెహ్రాజీ ఈసారి ఉసూరుమనిపించారు. పాత సినిమాల్ని గుర్తు చేసే ఓ సినిమా తీశారు తప్ప.. ఆయన గత వైభవానికి తగ్గ సినిమా అయితే అందివ్వలేకపోయారు. రెండు గంటల 41 నిమిషాల సినిమా.. అందులోనూ కీలక సన్నివేశాలు మాంటేజ్ సాంగ్స్‌లో వెళ్లిపోయాయి అంటే ఎడిటింగ్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి రెండు డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.
సినిమాలో అన్నీ నెగెటివ్సే ఎందుకుంటుంటాయి.. కొన్ని మంచి అంశాలు కూడా మాట్లాడుకోవచ్చు. వాటిలో కొన్ని ఇవీ. సినిమాలో ప్రముఖ బాక్సర్ మహమూద్ అలీ స్ఫూర్తితో అజీజ్ బాక్సింగ్ నేర్చుకున్నట్లు చూపిస్తారు. ఆఖరున కూడా అలాంటి సన్నివేశమే ఉంటుంది. ఈ రెండూ ఆకట్టుకుంటాయి. బాక్సింగ్ రింగ్‌ను ఇంటితో పోలుస్తూ నానా ప్రభు చెప్పే సీన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముంబయిలో గతంలో జరిగిన వర్గ ఘర్షణలు, బాంబుపేలుళ్లు, ప్రమాదాలను సినిమాలో పొందుపరిచారు దర్శకుడు. బాంబ్‌బ్లాస్ట్‌లో నారాయణ్ తన భార్యను కోల్పోవడం, రైలు వంతెనపై తొక్కిసలాట వంటివి రాసుకున్నారు రచయితలు. అవి మెచ్చుకోదగ్గవే. అద్దె ఇల్లు కోసం వెతికే సమయంలో పేర్లు మార్పు ప్రస్తావన ముంబయిలో ఓ ప్రాంత వాసులు పడుతున్న ఇబ్బందిని కళ్లకు కడుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్, వ్యభిచారాన్ని పోలుస్తూ అనన్య చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. బాక్సింగ్ గురించి నానా ప్రభు.. చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ బాగుంటాయి. నానా ప్రభుతో మనవరాలు మైరా సీన్స్ భలే క్యూట్‌గా ఉంటాయి.
బలాలు
బలహీనతలు
ఫరాన్ అక్తర్ నటన
సినిమాలో కొత్తదనం లేకపోవడం
జే ఓజా కెమెరా పనితనం
నిడివి ఎక్కువ
కథ - కథనంలో లోపం
చివరిగా:'తూఫాన్' గతంలో వచ్చి వెళ్లిన కథే!
గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!