తెలంగాణ

telangana

By

Published : Oct 3, 2021, 5:40 AM IST

ETV Bharat / sitara

వెండితెరపైన ముచ్చటైన జంట చై-సామ్‌!

'ఏ మాయ చేసావె'లో(sam chaitanya film) కార్తీక్‌-జెస్సీ ప్రేమ కథతో మొదలైన నాగచైతన్య, సమంత(sam chaitanya news) రియల్‌ లవ్‌ స్టోరీ తెలుగు సినీ అభిమానుల మనసుల్ని గెలుచుకొంది. అనంతరం వివాహ బంధంతో వారు ఒక్కటయ్యారు. అలా ఒక్కటైన వారి చేసిన సినిమాలపై ఓ లుక్కేద్దామా?

nagachaithanya and samantha movies
వెండితెరపైన ముచ్చటైన జంట చై-సామ్‌!

వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ నాగచైతన్య, సమంతలు ముచ్చటైన జంటగా మన్ననలు అందుకున్నారు. వారిద్దరి మధ్యనున్న పదేళ్ల అనుబంధానికి శనివారం తెరపడింది. చై-సామ్‌ల జీవితంలో సినిమాది కీలకపాత్ర. వీళ్లిద్దరినీ కలిపింది, ఒక్కటి చేసింది సినిమానే. 'ఏమాయ చేసావే'తో మొదలైన వీరి ప్రయాణం 'మనం', 'ఆటో నగర్‌ సూర్య' సినిమాలతో మరింత బలపడింది. పెళ్లైన తర్వాత కూడా జంటగా నటించి హిట్లు కొట్టారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలపై ఓ కథనం.

ఏమాయ చేసావే

ఏమాయ చేసావే

నాగచైతన్య, సమంతలు కలిసి నటించిన మొదటి చిత్రం 'ఏమాయ చేసావే'. ఇద్దరి సినీ జీవితాలను కీలక మలుపు తిప్పిన సినిమా ఇది. వీరి ప్రేమకథకు బీజం పడింది కూడా ఇక్కడే. సమంతకు ఇది తొలి తెలుగు సినిమా అయితే, చైతుకి మొదటి విజయాన్నందించిన చిత్రం. టాలీవుడ్‌ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ప్రేమకావ్యం 2010 ఫిబ్రవరి, 26న విడుదలైంది. తమిళ దర్శకుడు గౌతమ్‌మేనన్‌ తెరకెక్కించారు. ఆయనకిది తెలుగులో తొలి చిత్రం. 'కుందనపు బొమ్మ'గా సామ్‌ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కార్తీక్‌ అనే యువ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కి, తనకన్నా రెండేళ్లు పెద్దదైన జెస్సీ అనే మలయాళీ క్రిస్టియన్‌కి మధ్య నడిచే ఈ ప్రేమాయణానికి ప్రేక్షకులు పెద్ద హిట్‌ ఇచ్చారు. 'ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలుండగా, నేను జెస్సీనే ఎందుకు లవ్‌ చేశాను' లాంటి డైలాగ్స్‌ యువతకు విపరీతంగా నచ్చేసాయి. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మాన్‌ పాటలు ఇప్పటికీ యువతను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలోని పాటలన్నింటికీ అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యమందించారు. 'ఈ హృదయం కరిగించి వెళ్లకే', 'కుందనపు బొమ్మ', 'వింటున్నావా' లాంటి పాటలు ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్‌ గీతాలే. పాటల పరంగానే కాదు, బాక్సాఫీస్‌ వద్ద అంతే విజయాన్ని అందించింది. యువతను వలపు వర్షంలో ముంచెత్తిన ఈ సినిమా, చై-సామ్‌లతో పాటు టాలీవుడ్‌కీ మరుపురానీ ప్రేమకథా చిత్రమే.

మనం

మనం

అక్కినేని కుటుంబ చిత్రంగా 'మనం' ప్రేక్షకుల మన్ననలందుకుంది. నాగచైతన్య, నాగార్జునలతో పాటు సమంత కెరీర్‌లోనూ మైలురాయి లాంటి సినిమా. సొంత బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ మల్టీస్టారర్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పూర్వజన్మల నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో ఏయన్నార్‌ ఓ ముఖ్యపాత్ర పోషిస్తే, అఖిల్ అతిథి పాత్రలో మెరిశాడు. ఇలా కుటుంబంలోని వారందరిని కలిపి 'మనం'తో మరుపురాని విజయాన్ని అందించాడు దర్శకుడు విక్రమ్‌. ఫ్లాష్‌బ్యాక్‌లో రాధామోహన్‌(నాగచైతన్య), కృష్ణవేణి(సమంత)లనే దంపతులుగా నటించారు. తిరిగి పునర్జన్మలో నాగార్జున(నాగచైతన్య), ప్రియ(సమంత)లుగా తారసపడతారు. రాధామోహన్‌, కృష్ణవేణీల కుమారుడైన నాగేశ్వరరావు(నాగార్జున) వీరిద్దరిని కలిపేందుకు చేసే ప్రయత్నాలు మంచి వినోదాన్ని పంచాయి. అనూప్ రూబెన్స్‌ అందించిన పాటలు కూడా సూపర్‌ హిట్టయ్యాయి. భార్యాభర్తలుగా చైతు, సమంతా జీవించారనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య బంధం మరింత బలపడిందని చెప్పుకుంటారు.

ఆటోనగర్ సూర్య

ఆటోనగర్ సూర్య

నాగచైతన్య, సమంతల కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా 'ఆటోనగర్‌ సూర్య'. అప్పటికే వీరిద్దరిది సూపర్‌హిట్‌ జంట. 'ప్రస్థానం' లాంటి సినిమానందించిన దర్శకుడు దేవకట్టా తీయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నాగచైతన్య సూర్య అనే మెకానిక్‌గా మాస్‌ లుక్‌లో కనిపించాడు. ఆయన ప్రేయసి శిరీషగా సమంత నటించింది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించాడు.

మజిలీ

మజిలీ

నాగచైతన్య,సామ్‌ల వివాహనంతరం చేసిన మొట్టమొదటి చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మంచి ఫీల్‌ గుడ్‌ మూవీగా ప్రశంసలు అందుకుంది.ఇందులో నాగచైతన్య క్రికెటర్‌గా ఎదగాలనుకునే పూర్ణ అనే యువకుడిగా నటించాడు. అదే సమయంలోనే ప్రేమలో విఫలమవడంతో కెరీర్‌ను వదిలేసి తాగుబోతులా మారిపోతాడు. అప్పుడే కుటుంబ పరిస్థితుల కారణంగా శ్రావణి(సమంత) పెళ్లి చేసుకుని పూర్ణ జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత పూర్ణలో మార్పు వచ్చి ఇద్దరూ కలవడంతో సినిమా సుఖాంతమౌతుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది.

ఓ బేబీ

ఓ బేబీ

లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చి సూపర్‌ సక్సెస్ సాధించిన సినిమా 'ఓ బేబీ'. సామ్‌ కెరీర్‌లోనే వైవిధ్యమైన చిత్రంగా నిలిచింది. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ సినిమాని నందినీరెడ్డి తెరకెక్కించారు. ఇందులో నాగచైతన్య ఓ అతిథిపాత్రలో మెరిశారు. పాతికేళ్ల వయసుకి మారిపోయిన 70 ఏళ్ల వృద్ధురాలు బేబీగా సమంత చేసిన సందడి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఇందులో యుక్తవయసు చంటిగా నాగచైతన్య ఓ సన్నివేశంలో కనిపిస్తారు.

మొత్తం ఐదు సినిమాల్లో వివిధ పాత్రల్లో చై-సామ్‌ నటించి మెప్పించారు. ప్రేమికులుగా, దంపతులుగా, స్నేహితులుగా అభిమానుల ప్రేమను గెలుచుకున్నారు. మంచి జంటగా ప్రశంసలు అందుకున్నారు. కార్తీక్‌-జెస్సీలాంటి ప్రేమకథ ఉండాలని తపించే యువకులు ఇప్పటికీ ఉన్నారు. రాధామోహన్-క్రిష్ణవేణి, పూర్ణ-శ్రావణి దంపతులుగా ప్రేక్షకులపై అంతే ప్రభావం చూపించారు. వెండితెరపైనా, నిజజీవితంలోనూ చూడ ముచ్చటైన జంటగా ప్రశంసలు పొందిన వీరిద్దరూ విడిపోవడం అభిమానులను బాధిస్తుండనడంలో సందేహం లేదు.

ఇవీ చూడండి:

సమంత గురించి నాగార్జున ఎమోషనల్ పోస్ట్

నాగచైతన్య, సమంత.. వీరి ప్రేమకథ మాయ చేసింది!

ABOUT THE AUTHOR

...view details