టిక్‌టాక్ అంటే మూడు సినిమా డైలాగ్‌లు, ఆరు పాటలు మాత్రమే కాదు. ఈ యాప్‌లో ఓ ఫ్యాషన్ ప్రపంచమే అవతరించింది. అవును.. టిక్‌టాక్‌లో ఇప్పుడు ఫ్యాషన్ థీమ్ తెగ వైరల్ అవుతోంది. భారత సినీ సెలబ్రిటీలు, ప్రముఖ టిక్‌టాక్ వీడియో సృష్టికర్తలు తమదైన శైలిలో ప్రజలకు ఫ్యాషన్‌ను పరిచయం చేస్తున్నారు. లాక్డౌన్ వేళ ఇంటికే పరిమితమైన తారలు సృజనాత్మకతను జోడించి వీడియోలు చేసి పంచుకుంటుంటే.. దాదాపు రెండు వందల కోట్లమంది వాటిని చూసి స్ఫూర్తి పొందుతున్నారు.
ఫేమస్ ఫ్యాషన్...
విభిన్న లుక్స్, సరికొత్త స్టైల్స్, నయా ట్రెండ్స్, వాటికి సంబంధించిన చిట్కాలను వీడియో తీసి ఫ్యాషన్ అంటే ఏమిటో జనాలకు చాటుతున్నారు కొందరు ఔత్సాహికులు. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు, ఛాలెంజ్‌లు ఇవే...
- #1మినిట్లుక్- ఈ హ్యాష్‌ట్యాగ్ దాదాపు 18 వందల కోట్ల వ్యూస్ సంపాదించుకుంది. ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సైతం ఈ హ్యాష్‌ట్యాగ్‌తో.. ఒక్క నిమిషంలో వినూత్న అలంకరణ ఎలా చేసుకోవచ్చో చూపింది.
- #ఫ్యాషన్‌వీక్- 11 వందల కోట్ల వీక్షణలు పొందిందీ హ్యాష్‌ట్యాగ్. బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్‌ముఖ్.. మన దగ్గరున్న పాత దుస్తులతోనే ట్రెండింగ్ వస్త్రాలను ఎలా సృష్టించాలో టిక్‌టాక్ ఫ్యామిలీకి నేర్పించాడు.
- ఈ మధ్య తెగ వైరల్ అయిన మరో హ్యష్‌ట్యాగ్ #షో-ఎ-ఛాలెంజ్‌తో.. పనికిరాకుండా ఇంట్లో పడి ఉన్న చెప్పుల జతలను వినూత్నంగా ఎలా వాడుకోవచ్చో చూపించే ఎన్నో వీడియోలు వెలువడ్డాయి. షెరీన్ లవ్బగ్, ఆకృతి, నికీ మెహ్రా, కృతిక ఖురానా, రిష్ఎక్స్ప్రెస్ వంటి తారలు ఈ ఛాలెంజ్‌లో భాగస్వాములయ్యారు. అందుకే మరి, ఈ హ్యాష్‌ట్యాగ్‌కు దాదాపు 78 కోట్ల వ్యూస్ దక్కాయి.
- నటాషా శ్రోత్రి, హౌస్ ఆఫ్ మిసు, మాసూమ్ మినావాలా, ఆష్నా ష్రాఫ్ జి వంటి ప్రముఖ తారలు సృష్టించిన మరిన్ని ఫ్యాషన్ వీడియోలు 200 మిలియన్లకు పైగా టిక్‌టాక్ అభిమానులను కనువిందు చేశాయి.
ఇదీ చదవండి:'మందుబాబులు మారేందుకు ఇదే అద్భుత అవకాశం'