Women in Cinema: హీరో... హీరోయిజం - సినిమా అంటే ఇంతేనేమో అనుకునే పరిస్థితి ఒకప్పుడు. నాయిక ఆడిపాడటానికే అన్నట్టుగా కనిపించేది. తెరపైన సంగతే కాదు, తెరవెనక కూడా మగువల ప్రాభవం పెద్దగా కనిపించేదే కాదు. మరి ఇప్పుడో! ఏ సినిమా సెట్‌కి వెళ్లినా మహిళల సందడే. మేకప్... కాస్ట్యూమ్ మొదలుకొని... నిర్మాణం, దర్శకత్వం వరకు అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతున్నారు మహిళలు. రంగుల కళ అయిన సినిమాకి మరింత వన్నె తీసుకొస్తున్నారు. వాళ్ల జోరుకి తగ్గట్టే తెరపైన కథలూ, పాత్రల తీరుతెన్నులూ మారుతున్నాయి. హీరోయిజమే కాదు.. హీరోయినిజం కూడా ఉంటుందని చాటుతూ మహిళల కథలు విరివిగా రూపొందుతున్నాయి. అలా నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం చేస్తున్నారు సునీత తాటి. సమంతతో 'ఓ బేబి' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్నారీమె. ప్రస్తుతం రెజీనా, నివేదా థామస్‌తో 'శాకిని ఢాకిని' సినిమాని నిర్మిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న 'శాకుంతలం'తో తన ప్రయాణాన్ని ఆరంభించిన మరో నిర్మాత... నీలిమ గుణ. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరి ప్రయాణం, అంతరంగం 'ఈనాడు సినిమా'కి ప్రత్యేకం...
కొత్త కథలొస్తాయి
"అమ్మాయిలు... అబ్బాయిలు అనే తేడా తొలగిపోతోంది. అన్ని రంగాల్లోనూ ఇప్పుడందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి. సినీ రంగాన్నే తీసుకుంటే ఇదివరకటిలా కాకుండా... ఇప్పుడు సెట్లో ఎక్కువమంది అమ్మాయిలే కనిపిస్తుంటారు. ఆసక్తే ఉంటే దానికి తగ్గట్టుగా సన్నద్ధమై అమ్మాయిలు ధైర్యంగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టొచ్చనేది అభిప్రాయం. ఓ మహిళా నిర్మాతగా నాకైతే అమ్మాయిలు చెప్పే మరిన్ని కథలు వినాలి, వాటిని సినిమాలుగా తెరపై చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రచనా విభాగంలో మరింత మంది మహిళలు వస్తే చాలా మేలు జరుగుతుంది. కొత్త కథలు కచ్చితంగా వెలుగులోకి వస్తాయి".
"ఇద్దరు కూతుళ్లకి తండ్రిగా మా నాన్న దర్శకుడు గుణశేఖర్ మొదట్నుంచీ మహిళల్ని ప్రోత్సహిస్తుంటారు. మహిళా ప్రధానమైన సినిమాలు తరచూ చేస్తుంటారు. 'ఒక్కడు', 'మనోహరం' లాంటి సినిమాల్లోనూ బలమైన మహిళల పాత్రలు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా, నేను నిర్మాతగా రూపొందిస్తున్న 'శాకుంతలం'లోనూ ఎక్కువ మంది అమ్మాయిలే పనిచేస్తున్నారు. అనుభవజ్ఞులైన నీతా లుల్లా మొదలుకొని... కొత్త ప్రతిభావంతుల వరకు ఎంతోమంది మహిళలు మా సినిమాకి పనిచేస్తున్నారు".
"నాన్నని స్ఫూర్తిగా తీసుకునే నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చా. అమ్మాయివి కదా, ఈ రంగంలోకి ఎందుకు అని ఆయన ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నాకు ఆసక్తి ఉందని తెలిశాక... ప్రాక్టికల్‌గా తెలియడమే కాదు, థియరీ పరంగా కూడా చదువుకుని వస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. విదేశాల్లో నేను విజువల్ కల్చర్ చదువుకుని వచ్చాను. 'రుద్రమదేవి' సినిమాకి నేను ఇంటర్న్‌షిప్ చేస్తూ, దానికి సహనిర్మాతగా పనిచేశా. అప్పుడు కథానాయిక అనుష్క పనిపై చూపే శ్రద్ధ, ఆమె నిబద్ధత నన్నెంతగానో ప్రభావితం చేసింది. మళ్లీ అదే తపనని నేను 'శాకుంతలం' సెట్లో సమంతలోనూ చూశా".
"అమ్మాయిని కాబట్టే నిర్మాతగా నా తొలి ప్రయత్నంగా మహిళా ప్రధానమైన సినిమానే చేయాలనేమీ అనుకోలేదు. రోమియో జూలియట్ తరహా ప్రేమకథలు మన పురాణాల్లోనూ ఉన్నాయని లండన్‌లో కొన్ని షోస్ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది. అక్కడ చదువు పూర్తయ్యాక ఇండియాకి వచ్చినప్పుడు మా నాన్న 'శాకుంతలం' స్క్రిప్ట్ రాస్తున్నారు. నిర్మాతగా నేను ప్రయాణం ఆరంభించడానికి తగిన కథ ఇదని ఆ క్షణమే అనుకున్నా. ఇప్పుడు మహిళా ప్రధానమైన కథలే కాదు... వాణిజ్య ప్రధానమైన సినిమాల్లోనూ మహిళలకి ప్రాధాన్యం కనిపిస్తోంది. హీరోతో కలిసి ఆడిపాడటానికి పరిమితమైన దశ నుంచి... వాళ్లపైనే కథలు సాగడం, వాళ్లే మలుపు తిప్పే కథలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. ఇది మంచి పరిణామం".
- నీలిమ గుణ, 'శాకుంతలం' నిర్మాత