బాలీవుడ్‌లో 'యే రిస్తా క్యా కెహ్లాతా హై'( తెలుగు డబ్బింగ్ 'పెళ్లంటే నూరేళ్ల పంట') ధారావాహికతో అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకుంది నటి హీనా ఖాన్. ఇటీవలే ఆత్మహత్య చేసుకుని మరణించిన సుశాంత్ సింగ్ విషయమై స్పందించింది. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం అనేవి ప్రతిరంగంలోనూ ఉంటాయని తెలిపింది. ప్రతిభ ఉన్నాసరే బుల్లితెర నటులు, వెండితెరపై అవకాశాలు దక్కించుకోవడం అంతా సులువుకాదని వెల్లడించింది. ప్రతిభ చాటుకోవాలనుకునే వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేసింది.
"ఎక్కడా సమానత్వం లేదు. సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ బంధుప్రీతి ఉంది. మీరు ఓ స్టార్ అయితే మీ కొడుకు లేదా కూతురిని సినిమాల్లోకి తీసుకువస్తారు. అలానే ఏ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టే వ్యక్తులకూ సమానంగా అవకాశాలు ఇవ్వాలి. టీవీ నటులు బాలీవుడ్‌లో అడుగుపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. మమ్మల్ని మేం నిరూపించుకోవడానికి కనీసం ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వొచ్చు కదా"
-హీనా ఖాన్, నటి
మనోళ్లు వివక్ష చూపారు.. కానీ
సినిమాల్లోకి రాకముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న హీనా ఖాన్.. అక్కడ జరిగిన చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనే సమయంలో తాను బుల్లితెర నటి కావడం వల్ల భారతీయ ఫ్యాషన్ ప్రముఖులు, తన పట్ల వివక్ష చూపారని చెప్పింది. కానీ అదే సమయంలో అంతర్జాతీయ డిజైనర్లు తనకు అండగా నిలబడ్డారని వెల్లడించింది.