'అర్జున్‌రెడ్డి' సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన పాపులరిటీని సొంతం చేసుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయనకు దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అయితే 'అర్జున్‌రెడ్డి' సినిమా కంటే ముందు విజయ్‌కి దుస్తులు డిజైన్ చేసి ఇచ్చేందుకు పెద్ద డిజైనర్లు ముందుకు రాలేదట.
'విజయ్ దేవరకొండకు డ్రస్ డిజైన్ చేయమన్నారు!' - విజయ్ దేవరకొండ వార్తలు
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు పాపులారిటీ రాకముందు అతనికి డ్రస్ డిజైనింగ్ చేయడానికి పెద్ద డిజైనర్లు ఎవరూ ముందు రాలేదట. కానీ, 'అర్జున్‌రెడ్డి' చిత్రం హిట్‌తో దేశవ్యాప్తంగా విజయ్‌కు క్రేజ్ రావడం వల్ల గతంలో అతనికి డిజైనింగ్ చేయని వాళ్లే వచ్చి ఇప్పుడు డిజైన్ చేస్తామని చెప్పారని విజయ్ దేవరకొండ స్టైలిస్ట్ శ్రావ్య తెలిపింది.
"ఒకప్పుడు దక్షిణాది నటులకు దుస్తులు డిజైన్ చేసి ఇచ్చేందుకు పేరుపొందిన కొంతమంది ఫ్యాషన్ డిజైనర్లు ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారాయి. దక్షిణాది తారలకు దుస్తులివ్వడానికి అప్పుడు ఎవరైతే ఆసక్తి కనబరచలేదో ఇప్పుడు వాళ్లే ఇక్కడ స్టోర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. 'అర్జున్ రెడ్డి' చిత్రం కంటే ముందు విజయ్ దేవరకొండ ఎవరికీ అంతగా తెలియదు కాబట్టి ఆయనకు దుస్తులు రూపొందించి ఇచ్చేందుకు ఓ డిజైనర్ తిరస్కరించాడు. ఇప్పుడు అదే వ్యక్తి నా దగ్గరకు వచ్చి.. 'మేము ఆయనకి దుస్తులు డిజైన్ చేసి ఇవ్వాలనుకుంటున్నాం' అని చెప్పాడు" అని విజయ్ స్టైలిస్ట్ శ్రావ్య పేర్కొంది.
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో విజయ్ నటించారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో విజయ్ కథానాయకుడిగా కనిపించనున్నారు. పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్ సరసన అనన్యాపాండే సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి 'ఫైటర్' అనే పేరు ప్రచారంలో ఉంది. మరోవైపు ఆయన 'రౌడీ' బ్రాండ్‌తో వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.