"నా కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు పోషించా. కానీ 'నారప్ప'కి కనెక్ట్ అయినట్టు ఏ పాత్రకీ కాలేదు" అని సినీనటుడు వెంకటేశ్ అన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన చిత్రం 'నారప్ప'. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై, విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది చిత్రబృందం.
'నారప్ప' పాత్రతో బాగా కనెక్ట్ అయ్యా: వెంకీ - వెంకటేశ్ నారప్ప రిలీజ్
వెంకటేశ్ హీరోగా నటించిన 'నారప్ప' చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా కథానాయకుడు వెంకటేశ్ మాట్లాడుతూ.. "నారప్ప'ని ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు పోషించా. ఎప్పుడూ ఏ పాత్రలో ఇంతగా లీనమవని నేను 'నారప్ప'తో బాగా కనెక్ట్ అయ్యా. మాతృక 'అసురన్' హక్కులు ఇచ్చినందుకు దర్శకుడు వెట్రిమారన్, నటుడు ధనుష్‌కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నా. నా సహ నటులు, దర్శకుడు, సాంకేతిక బృందం ఎంతో కష్టపడ్డారు. నాకు ఈ చిత్రం కొత్త అనుభూతిని పంచింది. థియేటర్లలో విడుదల చేయలేదనే బాధలో ఉన్నా అభిమానులు ఆదరించారు. ఈసారి తప్పకుండా మరో చిత్రంతో థియేటర్లలో వినోదం పంచుతా" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రియమణి, శ్రీకాంత్ అడ్డాల, కార్తీక్ రత్నం, రచ్చ రవి తదితరులు పాల్గొని ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. "వెంకటేశ్ మాస్ చిత్రాలు చేయగలరు.. క్లాస్ చిత్రాలూ చేయగలరు" అని అన్నారు.