వెంకటేష్ తన సినీప్రయాణంలో 75వ చిత్ర మైలురాయిని చేరుకోవడానికి ఇంకో రెండడుగుల దూరంలోనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో నుంచి రాబోతున్న 'వెంకీమామ' 73వ చిత్రం కాగా.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేయనున్న కొత్త ప్రాజెక్టు ‘వెంకీ 74’గా రూపొందనుంది. హైదరాబాద్ రేసు క్లబ్, గుర్రపు పందాల నేపథ్యంతో సరికొత్తగా ఈ కథను సిద్ధం చేస్తున్నాడట తరుణ్. ఈ స్క్రిప్ట్‌పై వెంకీ మంచి నమ్మకంతోనే ఉన్నాడు. కానీ, ఇప్పుడు వెంకటేష్‌కు వచ్చిన చిక్కల్లా తన 75వ చిత్రంగా దేన్ని ఎంచుకోవాలన్నది తేల్చుకోలేకపోతున్నాడట.
ప్రస్తుతం వెంకటేష్ చేతిలో తరుణ్ సినిమా కాకుండా 'అసురన్' రీమేక్ ఉంది. దీన్ని తన సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్‌లో చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచీ దీనిపై వెంకీకి కొన్ని అనుమానాలు ఉన్నాయట.
తన 75వ సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. కాబట్టి ఆ అంచనాలను అందుకునే కథను వెంకీ తన 75వ చిత్రానికి ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ, 'అసురన్' ప్రకటించినప్పటి నుంచి దానిపై ఈ హీరోకు ఇతరుల నుంచి భిన్న అభిప్రాయాలే ఎదురయ్యాయట. అణగారిన వర్గాల వారికి ధనికులకు మధ్య జరిగే ఓ ప్రతీకార కథ 'అసురన్'. వెంకీ బాడీ లాంగ్వేజీకి ఈ పాత్రలో అతడిని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనేది ఓ అనుమానం. దీనికి తోడు మాతృకలోని ఆత్మను చెడగొట్టకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి చక్కగా చూపించగలిగే దర్శకుడు కావాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది తేడా కొట్టినా అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
ఒకవేళ వెంకీ తన 75వ చిత్రంగా ఇలాంటి సాహసం ఎందుకులే అనుకుంటే ఆయనకు మరో బంగారు అవకాశం కూడా ఉంది. అదేంటంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘వెంకీ 75’ను పట్టాలెక్కించడం. వీళ్లిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలొస్తూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్లకు వెంకీకి తగ్గట్లుగా ఓ కథను సిద్ధం చేసుకున్నాడట మాటల మాంత్రికుడు. ఈ స్క్రిప్ట్‌ను విక్టరీకి వినిపించగా అతడికి కూడా బాగా నచ్చిందట. గతంలో త్రివిక్రమ్ సంభాషణలు అందించిన వెంకటేష్ 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. కాబట్టి ‘వెంకీ 75’ను త్రివిక్రమ్‌తో చేస్తే దానికి మరింత క్రేజ్ ఏర్పడే అవకాశాలుంటాయి.
ఇవీ చూడండి.. యువ హీరోకు తల్లిగా సీనియర్ నటి..