తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చిరంజీవి సార్ ఫోన్​ చేసి అలా అన్నారు' - క్రాక్

విలక్షణ నటనతో అటు తమిళం, ఇటు తెలుగులో దూసుకుపోతోంది వరలక్ష్మి శరత్‌ కుమార్‌. హీరోయిన్​ పాత్రలే కాక నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మెప్పిస్తోంది. ఇటీవల 'క్రాక్' సినిమాతో అలరించిన వరలక్ష్మి.. త్వరలోనే 'నాంది'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.

varalaxmi sarath kumar about her role in new movie naandi
'చిరంజీవి సార్ ఫోన్​ చేసి అలా అన్నారు'

By

Published : Feb 13, 2021, 8:42 PM IST

వరలక్ష్మి శరత్‌కుమార్

కోలీవుడ్‌ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కెరీర్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌. కథానాయికగా, ప్రతినాయకురాలిగా, సహాయనటిగా.. ఇలా ప్రతి సినిమాలోనూ పాత్రల ఎంపిక విషయంలో వైవిధ్యాన్ని చూపిస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ఇటీవల 'క్రాక్‌'లో జయమ్మగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించి తెలుగువారిని మెప్పించిన వరలక్ష్మి తాజాగా 'నాంది'తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ‘నాంది’ విశేషాలు ఆమె మాటల్లోనే..

ఫస్ట్‌టైమ్‌ లాయర్‌..

వరలక్ష్మి

" 'నాంది'లో సాధారణమైన అమ్మాయిగా కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు ఆద్య. అలాగే నేను ఒక లాయర్‌. ఇది నా కెరీర్‌లోనే విభిన్నమైన చిత్రం. ఎందుకంటే ఇప్పటివరకూ నేను లాయర్‌ పాత్రలో నటించలేదు. 'నాంది'లో నా పాత్ర ఎంతో కీలకమైనది. హత్య కేసులో జైలుకు వెళ్లిన నరేష్‌కు ఓ లాయర్‌గా నేను ఎలా సాయం చేయగలిగాను అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 'క్రాక్‌'లో నేను పోషించిన జయమ్మకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది."

రాత్రుళ్లు బట్టిపట్టి..

వరూ

"లాయర్‌ పాత్ర కోసం హోమ్‌వర్క్‌ చేయలేదు. కానీ, ఈ సినిమాలో నాకు పెద్ద పెద్ద డైలాగులున్నాయి. కొన్ని సీన్లలో నాలుగు, ఐదు పేజీల డైలాగులు చెప్పాలి. దానివల్ల ప్రతిరోజూ రాత్రి కూర్చొని డైలాగులన్నీ బట్టి పట్టేదాన్ని. మా సినిమా అవుట్‌పుట్‌ చూశాక.. నా పాత్ర చూసి నాకే గర్వంగా అనిపిస్తోంది. నా కెరీర్‌లోనే ఇది ఒక క్లిష్టమైన పాత్రగా చెప్పొచ్చు. మామూలుగా తెలుగు మాట్లాడతాను కానీ, భాషాపరమైన ఇబ్బందుల వల్ల కోర్టు రూమ్‌లో ఓ న్యాయవాదిగా మాట్లాడినప్పుడు కొంచెం ఇబ్బందిపడ్డా."

మూడున్నర రోజులు డబ్బింగ్‌..

వరలక్ష్మి

"ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నింటికీ నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నా. మామూలుగా కోలీవుడ్‌ చిత్రాలకు ఆరు గంటల్లో డబ్బింగ్‌ చెప్పేదాన్ని. కానీ ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడానికి మూడున్నర రోజులు పట్టింది."

ఒకేలా ఉంటే నచ్చదు..

వరూ

"నటి, నటుడు అంటే ఏదో ఒక్క జోనర్‌, ఒకే తరహా పాత్రలే పరిమితం కాకూడదు. నా ఉద్దేశంలో నటన అంటే అన్నిరకాల పాత్రలు చేయాలి. ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకూడదని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటిరోజే ఫిక్స్‌ అయ్యాను. అందుకే 'క్రాక్‌'లో జయమ్మలాంటి మాస్‌ క్యారెక్టర్‌ చేసి ఇప్పుడు ఇలా సాఫ్ట్‌ పాత్రకు ఓకే చేశాను."

ఇదొక ఉద్యోగం..

వరలక్ష్మి శరత్ కుమార్

"ప్రతి ఒక్కరూ అంటుంటారు సినిమా సినిమాకు మధ్య వ్యత్యాసం చూపించాలి. పాత్రలో ఒదిగిపోవాలని అని. కానీ నా దృష్టిలో నటన అనేది ఒక ఉద్యోగం లాంటిది. మన ఉద్యోగం మనం సక్రమంగా చేస్తే దాని ఫలితం కూడా బాగానే ఉంటుంది."

దాదాపు 30వ సినిమా..

"దాదాపు ఇది నా 30 సినిమా. తెలుగులో మూడో చిత్రం. 'నాంది'లో కమర్షియల్‌ చిత్రానికి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి. అందరూ చూడాల్సిన మంచి కథా చిత్రమిది. నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు."

నాన్న గర్వపడ్డారు..

కుటుంబంతో

"జయమ్మ తర్వాత నా విషయంలో నాన్న ఎంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నారు. 'క్రాక్‌' విడుదలయ్యాక చాలామంది నా నటన గురించి నాన్నకు ఫోన్‌ చేసి చెప్పారు. ఇటీవల చిరంజీవి సర్‌ని నాన్న ఓ సినిమా సెట్‌లో కలిశారు. అనంతరం నాన్న నాకు ఫోన్‌ చేసి.. 'వరూ.. నీతో ఒకరు మాట్లాడతారంట' అని చెప్పారు. వెంటనే చిరు అంకుల్‌ ఫోన్‌ తీసుకుని.. 'జయమ్మ పాత్ర అంత బాగా చేశావమ్మా. డబ్బింగ్‌ కూడా బాగా చెప్పావు' అంటూ ప్రశంసించారు."

నరేష్‌ మంచి వ్యక్తి..

"నరేష్‌ చాలా మంచి వ్యక్తి. సినిమాపరంగా ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. షూట్‌ సమయంలో నాకు బాగా అండగా నిలిచారు."

ఇదీ చూడండి:విలన్​ అవతారంలో దీపిక.. నిజమేనా?

ABOUT THE AUTHOR

...view details