ప్రేమ.. పలకడానికి రెండక్షరాలే. కానీ అందులో ఎంతో ఫీల్ ఉంటుంది. ఆ భావాన్ని చెప్పడానికి ప్రేమికులు పడే తపన అంతా ఇంతా కాదు. అయితే అలాంటి ప్రేమను చూపించేందుకు సినిమాలు ప్రయత్నిస్తుంటాయి. కొన్ని చిత్రాల్లోని పాటలు ప్రేమికుడి మనసు భావాలకు అర్థాలవుతాయి. ఆ పాటను వింటూ అతడు లోకాన్ని మైమరిచిపోయేలా చేస్తాయి. అందులోనూ టాలీవుడ్ ఈ ప్రేమ పాటలకు చిరునామాగా మారింది! గత కొన్నేళ్లలో అలా ప్రేక్షకులు, ప్రేమికుల హృదయాల్ని హత్తుకున్న ప్రేమ పాటలపై ఓ లుక్కేద్దాం.
నీ కన్ను నీలి సముద్రం (ఉప్పెన)
వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన చిత్రం 'ఉప్పెన'. ఫిబ్రవరి 12న విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. ఈ సినిమాలో సంగీతం ప్రధానపాత్ర పోషించింది. 'నీ కన్ను నీలి సముద్రం' పాట సినిమా రాకముందే ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకుంది.
నీలి నీలి ఆకాశం (30 రోజుల్లో ప్రేమించడం ఎలా?)
యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయమైన చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. ఇందులోని 'నీలి నీలి ఆకాశం' పాట ఇప్పటికీ అందరినీ అలరిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించగా, సిద్ శ్రీరామ్, సునీత గాత్రం ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించారు.
ఊహలే ఊహలే (జాను)
తమిళంలో ఘనవిజయం సాధించిన '96'కు తెలుగు రీమేక్ 'జాను'. ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలం. గోవింద్ వసంత ఇచ్చిన మ్యూజిక్ అలరించేలా ఉంటుంది. ఇందులో 'ఊహలే ఊహలే' పాట ఈ మూవీకి కీలకంగా నిలిచింది.