తన భార్య 'దిశ' వారం రోజుల నుంచి కనబడట్లేదని, మీ సాయం కావాలని అంటున్నాడు చదలవాడ లక్ష్. అతడు హీరోగా నటిస్తున్న 'వలయం' సినిమా టీజర్లోనిది ఈ డైలాగ్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆద్యంతం ఆసక్తి రేపుతూ ఆకట్టుకుంటోంది. దిగంగన సూర్యవంశీ.. దిశ పాత్రలో కనిపించనుంది.
ఇటీవలే జరిగిన 'దిశ' ఘటనలోని ఆమె పేరును ఇందులో ఉపయోగించారు. దానికి, ఈ సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? తెలియాలంటే చిత్ర విడుదల వరకు ఆగాల్సిందే.
"నా పేరు అరవింద్. నాకు మీ సాయం కావాలి. తనే నా భార్య దిశ. వారం రోజుల నుచి కనిపించడం లేదు. తన పేరెంట్స్‌కు కాల్ చేస్తే..'దిశ ఇక్కడికి రాలేదు అరవింద్. అసలేమైంది?' అంటున్నారు. తన ఫ్రెండ్స్‌ను అడిగితే..' తను నాతో మాట్లాడి చాలా రోజులైంది' అని చెబుతున్నారు. ఇవి నాకు దొరికిన క్లూస్. వీటిని పరిష్కరిస్తే తను ఎక్కడ ఉందో కనుక్కోవచ్చు" అని లక్ష్ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ సాగుతోంది.
టీజర్ చూస్తుంటే ఇదో క్రైమ్ థ్రిల్లర్‌లా కనిపిస్తోంది. శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నాడు. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. పద్మావతి చదలవాడ నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు.