ప్రస్తుతం ఏ చిత్రసీమలో చూసినా కొత్తదనం, విభిన్నత ఉండే చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. పాటలు, డ్యాన్సులు, ముద్దులు,ముచ్చట్లే కాకుండా... చరిత్ర, సామాజిక నేపథ్యం, వ్యక్తుల జీవితం గురించి తీస్తోన్న చిత్రాలు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాయి. తాజాగా కార్తీ ప్రధాన పాత్రలో నటించిన 'ఖైదీ' సినిమా ఇదే కోవకు చెందింది.
విభిన్నమైన కథ, ఉత్కంఠ కలిగించే కథాంశం, రొమాన్స్ లేకుండా పూర్తి యాక్షన్ , భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో కోలీవుడ్ నటుడు కార్తీ ప్రధాన పాత్ర పోషించాడు. పాటలు కూడా లేకుండా తీసిన ఈ చిత్రం... నవతరం సినిమాలకు నాంది అని ప్రశంసించాడు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. ఇలాంటి సినిమాలు తెరకెక్కించడం కొత్త మార్పు, ఆహ్వానించదగ్గ విషయమని అన్నాడు.
" ఖైదీ.. కొత్త పద్ధతిలో ఈ సినిమాను తెరకెక్కించారు. థ్రిల్‌కు గురిచేసే యాక్షన్ సన్నివేశాలు, కథకు అనుగుణంగా పాత్రల మధ్య భావోద్వేగం, పాటలు లేకుండా కథనం. ఇవన్నీ కలిపి తీసిన ఈ చిత్రం ఆహ్వానించదగ్గ మార్పు. 'ఖైదీ' బృందానికి నా అభినందలు"
-- మహేశ్‌బాబు, సినీ నటుడు
ఈ సినిమాకు లోకేశ్ కనకరాజు దర్శకుడు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచే కాకుండా సినీప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి.
ప్రస్తుతం మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రిన్స్‌కు జోడీగా.. రష్మికా మందణ్న నటిస్తోంది. ప్రముఖనటి విజయశాంతి ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.