సినిమా తర్వాత సినిమా అనే రోజులు పోయాయి. ఇప్పుడు వేగం పెరిగింది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు రంగం సిద్ధం కావల్సిందే. లేదంటే వెనకబడిపోతాం అంటున్నారు మన హీరోలు. తప్పదనిపిస్తే తప్ప... ఒకే సినిమాతో ప్రయాణం చేయడానికి ఇప్పుడెవ్వరూ ఇష్టపడటం లేదు. యువ కథానాయకులైతే ఆ విషయంలో మరింత పక్కాగా ఉంటున్నారు. వాళ్ల కోసం విరివిగా తయారవుతున్న కథలు కూడా వాళ్లను మరింత ఉత్సాహంగా ముందడుగు వేయిస్తున్నాయి. దాంతో చాలామంది డైరీలు ఏడాది ఆరంభంలోనే నిండి పోయాయి.
హీరోయిన్ల తరహాలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయడం హీరోలకు సాధ్యమయ్యే విషయం కాదు. కథలు, అంచనాలు, సీజన్, విడుదల తేదీలు... ఇలా చాలా లెక్కలుంటాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగేయాల్సిందే. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా... మన హీరోలు పక్కా ప్రణాళికలతో సినిమాల్ని చేస్తున్నారు. విడుదల తేదీలు కాస్త అటూ ఇటూ అయినా... అనుకున్నట్టుగా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. పోటీ వాతావరణంలో ఈ మాత్రం వేగంతో దూసుకెళ్లడం అవసరమే అనేది వాళ్ల అభిప్రాయం. అగ్ర హీరోల నుంచి, యువతరం వరకు అందరిదీ అదే పంథానే. చాలామంది కథానాయకులు ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒక సినిమా సెట్స్‌పైన, మరొకటి స్క్రిప్ట్ దశలో, ఇంకో రెండు చర్చల దశలో!
మెరుపు వేగం
యువ హీరోలకు తగ్గ కథలకు కొరత ఎప్పుడూ ఉండదు. అగ్రహీరోలకు కథలు కుదరడమే కష్టమైన పని. అలాంటి పరిస్థితుల నుంచి చిత్ర పరిశ్రమ క్రమంగా బయట పడుతున్నట్టు స్పష్టమవుతోంది. అగ్ర కథానాయకులు.. గేరు మార్చి వేగం పెంచుతుండడమే అందుకు కారణం. పొరుగున ఆడిన కథలపై కన్నేస్తూ రీమేక్‌లకు ప్రయత్నించడం, ఇక్కడి దర్శకులతో ప్రత్యేకంగా కథలు సిద్ధం చేయించడం... ఇలా ఏదో రకంగా సినిమాల్ని మాత్రం పట్టాలెక్కిస్తున్నారు. అగ్ర హీరోల్లో ప్రస్తుతం పవన్ కల్యాణ్ మెరుపు వేగం ప్రదర్శిస్తున్నాడు. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే, మరోపక్క మూడు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి 'వకీల్‌సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకుడు. హిందీ హిట్ 'పింక్'కు రీమేక్ ఇది. రెండోది క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆ తర్వాత హరీశ్ శంకర్‌తో కలిసి పనిచేయనున్నాడు. 'గబ్బర్ సింగ్' తర్వాత ఆ కాంబినేషన్లో రాబోతున్న చిత్రమిది. ఇవే కాకుండా దర్శకుడు కిశోర్ పార్థసాని, పవన్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. రవితేజ, పవన్ తరహాలోనే ఓ సినిమా చేస్తూ, కొత్తగా మూడు కథల్ని ఖాయం చేశాడు.