తర తమ భేదం లేకుండా.. ప్రేమని పంచుకుంటున్నాం.. సమాజానికి తిరిగి ఇవ్వడం గురించి ఆలోచిస్తున్నాం.. ప్రకృతి గురించి మాట్లాడుకుంటున్నాం.. మన బాధ్యతల్ని గుర్తు చేసుకుంటున్నాం. కరోనా తెచ్చిన కష్ట కాలంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ తన సినిమాల్లో స్పృశించారు అగ్ర దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కొరటాల శివతో ప్రత్యేకంగా ముఖాముఖి.
కొత్త కథలపై దృష్టిపెట్టా. ఇకపైన ఎక్కువ కాలం నిరీక్షించను. నాక్కూడా వయసైపోతోంది కదా. ఎక్కువ సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. మహేశ్తో హ్యాట్రిక్ సినిమా కచ్చితంగా ఉంటుంది. మూడో సినిమా అంటే.. ఈసారి ఎంత పెద్ద కథ రాయాలనే ఒక ఆలోచన ఉంటుంది కదా! అందరి అంచనాలకి తగ్గట్టుగానే ఆ సినిమా ఉంటుంది.
లాక్డౌన్ తర్వాత జీవితం ఎలా ఉంది?
పని మనుషులకి రెండు నెలల జీతాలు ఇచ్చేసి పంపించేశాం. ఇంట్లో పనులన్నీ పంచుకుని చేసుకుంటున్నాం. పుస్తకాలు చదవడం, మిస్ అయిన సినిమాల్ని చూడడం, రాసుకోవడం, సాయంత్రం అపార్ట్మెంట్ కిందకెళ్లి వాకింగ్ చేసుకోవడం. ఇదొక రకమైన జీవితం. కొన్ని రోజులపాటు మన గురించి మనం ఆలోచించుకునే సమయం వచ్చింది. ఇదివరకటిలాగా ఇప్పుడు రేసులు లేవు, పరుగెత్తడాలు లేవు.
ఎప్పుడైనా... ఎందుకోసం ఈ పరుగులు అన్న ఆలోచనలు వచ్చేవా?
మనందరం కూడా ఒక రేసులోకి వెళ్లిపోయాం. పోటీ వాతావరణం అలాంటిది. సమాజంతో పాటే పరిగెత్తడం అలవాటు చేసుకున్నాం. ఈ పోటీతత్వం తగ్గాలి, మరో రకమైన జీవన విధానం అలవాటు కావాలంటే మళ్లీ ఎలిమెంట్రీ స్కూల్ నుంచి మొదలుపెట్టాల్సిందే.
ప్రపంచమంతా ఇలా ఆగిపోయే రోజు వస్తుందని ఎప్పుడైనా ఊహించారా?
ఇది ఊహించనిదేమీ కాదండీ. మనం ఇలాగే ఉంటే, ప్రకృతి ఏదో ఒకటి చేస్తుందని మాట్లాడుకున్నవాళ్లమే. విపరీతానికి వెళితే వినాశనమే అనేది మనందరికీ తెలుసు. కరోనా అనేది ఒక వింతగా, ఎవ్వరూ ఊహించని రీతిలో వచ్చింది. ప్రకృతి అంటే ఒక భయం ఉండాలనేది మనందరికీ తెలిసిందే. మనం రేసులో పడిపోవడం వల్ల దాని ప్రభావం తెలియలేదు.
ఈ విపత్తు నుంచి మనం ఏం నేర్చుకోవాలి?
మొదట ప్రభుత్వాలు, నిపుణులు చెబుతున్నది విని, ఆచరిద్దాం. కరోనాతో ప్రపంచమేమీ అంతం కాదు. కానీ మనం గుణపాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అనేదే ప్రశ్న. ఇకపై రోజుకు 30 సార్లు చేతులు మాత్రమే శుభ్రం చేసుకుంటామనేది వేలం వెర్రి. జీవన శైలిలోనే మార్పు రావాలి. ఒక్కొక్క దేశానికి ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. కానీ మనం విదేశీ ఆహారం అంటూ ప్రకృతికి విరుద్ధంగా తినడం అలవాటు చేసుకున్నాం. స్వచ్ఛభారత్ అని కేంద్రం చెప్పింది. కానీ ప్లాస్టిక్ బాటిల్ని రోడ్డుపై విసిరేసి వెళ్లి పోతున్నాం. గొప్ప సంస్కృతి ఉన్న నేల మనది. ఇక నుంచైనా మనం మనలా ఉందాం. ప్రభుత్వం కఠిన నియమాలు తీసుకురావాలి. ఒక్కో నేలకి ఒక న్యాయం ఉన్నట్టుగా... ఈ నేలకీ ఒక న్యాయం ఉంది. దాన్ని అందరూ పాటించాలి. మనలో మార్పు వస్తుందని గట్టిగా నమ్ముతున్నా.