పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశంలో చెలరేగుతున్న నిరసనలపై బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ స్పందించాడు. సామాజిక మాధ్యమాల్లో ఆందోళనలు చేసే సమయం ముగిసిందని అన్నాడు. ఈ గురువారం.. ముంబయిలోని ఆగస్టు క్రాంతి మైదానంలో జరిగే నిరసన కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు ట్వీట్ చేశాడు.
"ముంబయిలోని ఆగస్టు క్రాంతి స్టేడియంలో ఈనెల 19న కలుద్దాం. సోషల్మీడియా వేదికగా నిరసనలు తెలిపేందుకు ఇక సమయం ముగిసింది" -ఫర్హాన్ అక్తర్, బాలీవుడ్ నటుడు
పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం.. జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై దిల్లీ పోలీసులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఈ విషయంపై ఫర్హాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతడితో పాటు ప్రముఖ సినిమా స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్, నటుడు మహ్మద్ జీషన్, పరిణీతి చోప్రా, సిద్ధార్థ్ మల్హోత్రా, నిర్మాతలు విశాల్ భరద్వాజ్, అనురాగ్ కశ్యప్, హాలీవుడ్ నటుడు జాన్ కుసాక్.. యువతపై పోలీసులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు.
మతపరమైన సమస్యలను ఎదుర్కొంటూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన వారికి పౌరసత్వ కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. 2014 డిసెంబరు 31వరకు దేశంలోకి ప్రవేశించిన వారిని ఇకపై అక్రమ వలసదారులగా గుర్తించకుండా వారికి పౌరసత్వం లభించేలా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు.. చట్టంగా మారింది.
ఇది చదవండి: పౌరసత్వ చట్ట సవరణ అమలుపై వెనక్కి తగ్గేది లేదు: కేంద్రమంత్రి అమిత్ షా