తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ హీరోయిన్ల జోరు.. పెళ్లి అయితే మాకేంటి? - సమంత పెళ్లి తర్వాత సినిమాలు

ఒక హీరోయిన్​కు పెళ్లైందంటే చాలు.. పరిశ్రమ ఆ కథానాయికల్ని చూసే విధానమే మారిపోతుంటుంది. క్రమంగా అవకాశాలు తగ్గిపోతుంటాయి. మరికొన్నాళ్ల తర్వాత అక్కగానో, వదినగానో లేక ఇతరత్రా సహాయ పాత్రలతోనే కెమెరా ముందుకు రావాల్సిందే. అలా పెళ్లి తర్వాత తెర మరుగైన కథానాయికలు చాలామందే. కానీ నేటితరం అందుకు భిన్నంగా అడుగులేస్తోంది. పెళ్లైనా మా జోరు తగ్గదనే సంకేతాలు ఇస్తోంది

theses telugu movie heroines are getting opportunities even though they got married
నట ప్రయాణానికి పెళ్లి అడ్డంకి కాదంటున్న నాయికలు

By

Published : Nov 5, 2020, 2:26 PM IST

Updated : Nov 5, 2020, 2:35 PM IST

వయసు, పెళ్లి... ఈ రెండు విషయాలూ కథానాయకులపై పెద్దగా ప్రభావం చూపించవు. ఆరు పదుల వయసులోనూ టీనేజ్‌ కథానాయికలతో ఆడిపాడుతుంటారు మన హీరోలు. కానీ కథానాయికలకి అంత సౌలభ్యం ఉండదు. మూడు పదుల వయసు దాటుతోందంటే చాలు... మరో కొత్త కథానాయిక కోసం అన్వేషణ మొదలు పెడుతుంది చిత్రసీమ. ఇక పెళ్లి అయ్యిందంటే వాళ్ల కెరీర్‌ చరమాంకానికి చేరినట్టే. అలా తెర మరుగైన కథానాయికలు చాలామందే ఉన్నారు. కానీ, నేటి తరం హీరోయిన్లు ఈ సంస్కృతికి భిన్నంగా అడుగులేస్తున్నారు. వివాహం తర్వాత కూడా తమ జోరు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పెళ్లైన కథానాయికల సందడి ఎక్కువగానే కనిపిస్తోంది.

ప్రణాళికలు సిద్ధం చేసుకుంది..

అవకాశాలు తగ్గుముఖం పట్టినప్పుడే పెళ్లి గురించి ఆలోచించేవాళ్లు ఇదివరకటి కథానాయికలు. నేటితరం మాత్రం వృత్తితో సంబంధం లేకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొంటోంది. కాజల్‌ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ కథానాయికగా బిజీ బిజీ. కానీ ఆమె పెళ్లి చేసేసుకుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో ఇటీవలే ఆమె వివాహం జరిగింది. పెళ్లి తర్వాతా ఆమె కథా నాయికగా కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ నెలలోనే ఆమె 'ఆచార్య' సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నట్టు సమాచారం. తమిళంలోనూ ఆమె 'భారతీయుడు2'తోపాటు, మరో చిత్రమూ చేస్తోంది. వృత్తి, వ్యక్తిగత జీవితం... దేనికదే ప్రత్యేకం అంటూ, చేతినిండా సినిమాలు ఉన్నప్పుడే పెళ్లి పీటలెక్కిన కాజల్‌ తోటి కథానాయికలకి స్ఫూర్తిగా నిలుస్తోంది.

కాజల్​
సమంత

బిజీగా ఉన్నప్పుడే...

మరో అగ్ర కథానాయిక సమంత వరుస అవకాశాలతో బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. నాగచైతన్యని వివాహం చేసుకున్న ఆమె, నట ప్రయాణానికి పెళ్లి ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపిస్తూ ఇప్పటికీ అవకాశాలు అందుకొంటోంది. పెళ్లి తర్వాత ఆమె నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తోంది.

వాళ్లే స్ఫూర్తి..

హిందీలో విద్యాబాలన్‌, కరీనా కపూర్‌, దీపికా పదుకొణే, ఐశ్వర్యరాయ్‌, రాణిముఖర్జీ, కాజోల్‌... ఇలా పలువురు కథానాయికలు పెళ్లి తర్వాత విజయవంతంగా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. వీళ్లలో మునుపటిలాగే కుర్రహీరోలతోనూ జోడీ కడుతున్నవాళ్లూ ఉన్నారు. కొద్దిమంది తమ వయసుకు తగిన పాత్రల్లో మెరుస్తున్నారు. వాళ్లే మాకు స్ఫూర్తి అంటుంటారు మన హీరోయిన్లు. ఒకప్పుడు స్టార్‌ కథానాయకులతో కలిసి మెరిసిన శ్రియ, ప్రియమణి కూడా పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు. అయితే వాళ్లు ఇప్పటికీ మునుపటిలాగే అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నారు. శ్రియ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'తో పాటు తెలుగులో రెండు కొత్త చిత్రాల్ని ఒప్పుకొని బిజీగా గడుపుతోంది. ప్రియమణి 'విరాటపర్వం'లో రానాతో, 'నారప్ప' చిత్రంలో వెంకటేష్‌తో కలిసి నటిస్తోంది.

శ్రియ
ప్రియమణి

మార్పు కనిపిస్తోంది..

పరిశ్రమ వర్గాలు ఆలోచించే విధానంలోనూ ఇటీవలే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పాత్రకి తగ్గ నటి అనిపిస్తే చాలు... పెళ్లైతేనేం అంటూ అవకాశాల్ని కట్టబెడుతోంది. అది సీనియర్‌ భామలకి కలిసొస్తోంది. మరి పెళ్లయ్యాక వృత్తిపరంగా ఎలాంటి మార్పులు కనిపించలేదా అంటే? కొన్ని మార్పులు రావడం సహజమే అంటున్నారు సీనియర్‌ హీరోయిన్లు. 'పెళ్లి తర్వాత వెంటనే నాకు అంతకు ముందు వచ్చినన్ని అవకాశాలు రాలేదు. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. నాతో ఎలాంటి పాత్రలు చేయిస్తే బాగుంటుందా? అని దర్శకులు ఆలోచించి ఉండొచ్చు. కొన్నాళ్లకి మళ్లీ మునుపటిలాగే రకరకాల కథలు నా దగ్గరికొచ్చాయి' అని సమంత చెబుతోంది.

ఒత్తిడి లేదు

ఒక పక్క అవకాశాలు వెల్లువెత్తుతుంటాయి. మరోపక్క వయసు మీద పడుతుంటుంది. కెరీరా? లేక పెళ్లా? అనే ప్రశ్నతో సతమతమయ్యేవాళ్లు ఇదివరకటి కథానాయికలు. ఇప్పుడు ఆ రకమైన ఒత్తిడికి పూర్తిగా దూరమయ్యారు కథానాయికలు. మూడు పదుల వయసు దాటిన కథానాయికలు చిత్రసీమలో చాలానే కనిపిస్తున్నారు. సరైన సమయంలో పెళ్లి చేసుకుంటామంటూనే కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు. అనుష్క, నయనతార, త్రిష, శ్రుతిహాసన్‌, తమన్నా, పూజాహెగ్డే, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితర భామలంతా మూడు పదుల వయసులో ఉన్నవాళ్లే. వీళ్లంతా సరైన సమయంలోనే పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు. అనుష్క మాట్లాడుతూ 'ఇరవయ్యేళ్ల వయసు నుంచే నన్ను ఇంట్లో పెళ్లి గురించి అడుగుతున్నారు. బయట కూడా పెళ్లెప్పుడు అని అడుగుతుంటారు. ఆ విషయంలో నాపై ఒత్తిడేమీ లేదు. కుటుంబ వ్యవస్థపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. జీవితంలో అన్నీ సరైన సమయంలోనే జరుగుతాయి' అని చెప్పుకొచ్చింది.

ఇదీ చూడండి:అది నిజంగా నమ్మలేని అనుభూతి: కీర్తి సురేశ్

ఇదీ చూడండి:ఈ జంట చిందేస్తే.. సినిమా సూపర్ హిట్!

Last Updated : Nov 5, 2020, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details