తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీతో స్టార్​డమ్​ తెచ్చుకున్న నటులు!

లాక్​డౌన్​లో వెబ్​సిరీస్​ల క్రేజ్​ విపరీతంగా పెరిగిపోయింది. థియేటర్లు మూత పడడం వల్ల ప్రజలు క్రమంగా ఓటీటీలకు అలవాడు పడ్డారు. అలా డిజిటల్​ మీడియాలోని వెబ్​సిరీస్​లకు డిమాండ్​ పెరిగి.. అందులో నటించిన కొంతమందికి స్టార్​డమ్ హోదా వచ్చింది. ఆ విధంగా ఓటీటీల ద్వారా స్టార్​డమ్​ తెచ్చుకున్న నటుల గురించి తెలుసుకుందాం.

these Actors got stardom from ott
ఓటీటీనే వీళ్లకు స్టార్​డమ్​ తెచ్చిపెట్టింది!

By

Published : Jan 4, 2021, 11:32 AM IST

Updated : Jan 4, 2021, 4:37 PM IST

కంటెంట్‌ ఉన్న సినిమాను ఓటీటీ అయినా.. థియేటర్‌ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లన్నీ మూతపడ్డాయి. అయితే.. సినిమా పరిశ్రమకు 'ఓటీటీ' ఊరటనిచ్చింది. అటు అభిమానులను అలరిస్తూనే.. ఇటు ఆర్టిస్టులను, సినిమాను నమ్ముకున్న వారిని ఆదుకునే వైదికైంది. ఈక్రమంలో మంచి కంటెంట్‌తో అభిమానులను అలరించి ఊహించని స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నవారు చాలామందే ఉన్నారు. లాక్‌డౌన్‌లో ఓటీటీల ద్వారా వాళ్ల కెరీర్‌ను 'కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత'లా మార్చుకున్నారు. ఇలా, తమ డిమాండ్‌ను పెంచుకున్న వారిలో.. ప్రతీక్ గాంధీ, పంకజ్ త్రిపాఠి, జైదీప్ అహ్లవత్ ముందువరుసలో ఉంటారు. అలా ఊహించని సక్సెస్‌ అందుకొని ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు. వెబ్‌సిరీస్‌లు చూసే ప్రేక్షకులకు వీళ్లను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఓటీటీల ద్వారా కొత్త టాలెంట్‌ వెలుగులోకి..

కరోనా సినిమా రంగం ఆర్థికంగా నష్టపోయేలా చేసింది. సినిమా ప్రేమికులకు థియేటర్‌లో సినిమాను ఆస్వాదించే అవకాశాన్ని దూరం చేసింది. కానీ.. ఇదే సమయంలో ఓటీటీ ద్వారా చాలా మంది కొత్త వాళ్లకు అవకాశం వచ్చింది. 'మీర్జాపూర్', 'క్రిమినల్ జస్టిస్', 'పంచాయత్‌', 'పాతాళ్‌ లోక్', 'ఆర్య', 'స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ', 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వంటి వెబ్‌సిరీస్‌లు ఇందుకు మంచి ఉదాహరణలు. ఓటీటీల ద్వారా కొత్త టాలెంట్‌ వెలుగులోకి వచ్చింది. నటులు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు, రచయితలు, ఇంకా సృజనాత్మకత ఉన్న ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. ఇదిలా ఉండగా.. మరికొన్ని నెలల్లో ప్రజలు మళ్లీ సాధారణ జీవనం గడిపే అవకాశం కనిపిస్తోంది. థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడంతా వెబ్‌సిరీస్‌లలో కనిపించిన నటులదే హావా. అయితే.. ఓటీటీల గురించి వాళ్లు ఇప్పుడేం అంటున్నారో తెలుసా..?

కంటెంట్‌ ఉంటే ఆదరిస్తారు..

పంకజ్‌ త్రిపాఠి.. ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్త గుర్తింపు తెచ్చింది మాత్రం 'మీర్జాపూర్‌' అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సిరీస్‌తో ఆయనకు ఒక్కసారిగా స్టార్‌డమ్‌ వచ్చి పడింది. సోషల్‌ మీడియాలోనూ ఆయన డైలాగ్‌లు, వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

'మీర్జాపూర్​' వెబ్​సిరీస్​లో పంకజ్​ త్రిపాఠి

"ప్రేక్షకులను అలరించాలంటే మంచి కథతో పాటు.. ఆకట్టుకునే నటన, సృజనాత్మకత ఇలా అన్నీ ముఖ్యమే. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఓటీటీల్లో ఓపెనింగ్‌ కలెక్షన్ల గురించి చింతించాల్సిన అవసరం లేదు. మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు అదరిస్తారు".

- పంకజ్​ త్రిపాఠి, బాలీవుడ్​ నటుడు

అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న 'మీర్జాపూర్‌' మంచి విజయం సాధించింది. ఒకటి, రెండు సీజన్లు ప్రేక్షకులను బాగా అలరించడం వల్ల ఇప్పుడు మూడో సీజన్‌తో అలరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇది మంచి అవకాశం

'స్కామ్‌ 1992' అనగానే గుర్తొచ్చే పేరు ప్రతిక్ గాంధీ. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదేమో. హన్సాల్ మెహతా దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్‌ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దీంతో ప్రతీక్‌గాంధీ కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది.

'స్కామ్​ 1992'లో ప్రతిక్​ గాంధీ

"ప్రజలు నన్ను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. 'స్కామ్ 1992' తర్వాత ఫోన్‌ కాల్స్‌ ఎక్కువయ్యాయి. వాటితోనే బిజీగా ఉంటున్నాను. సమయం దొరికినప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నా. కెమెరా ముందు, కెమెరా వెనుక ఉన్న కళాకారులకు ఇది గొప్ప అవకాశం. ఇక్కడ అన్ని రకాల కథలు చెప్పవచ్చు. టాలెంట్‌ ఉన్న కొత్త రచయితలు, నటులు, సంగీత దర్శకులు.. ఇలా ఎంతోమందికి ఇది గొప్ప అవకాశం".

- ప్రతిక్​ గాంధీ, నటుడు

కొంతకాలంగా ఎక్కడ చూసినా 'స్కామ్‌ 1992' గురించే చర్చ జరుగుతోంది. పలు సినిమాల్లో కనిపించినా ఆయనకు రాని గుర్తింపును ఈ సిరీస్‌ తెచ్చిపెట్టింది.

నచ్చకపోతే వెళ్లిపోతారు..

జైదీప్​ అహ్లవత్.. 'పాతాళ్‌లోక్‌'లో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ హతీరామ్ చౌదరిగా కనిపించి ప్రేక్షకులను మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

'పాతాళ్​ లోక్​' వెబ్​సిరీస్​లో జైదీప్​

"నిజానికి ఓటీటీల్లో ప్రజాస్వామ్యానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సినిమా గానీ.. వెబ్‌ సిరీస్‌గానీ చూస్తున్నప్పుడు అది ప్రేక్షకులకు నచ్చకపోతే వెంటనే దాని నుంచి వేరే దాంట్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులకు దగ్గర కావడానికి ఓటీటీలు మంచి వేదికలు. మంచి కథలు, కంటెంట్‌తో ప్రయోగాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే సువర్ణావకాశం"

- జైదీప్​ అహ్లవత్​, నటుడు

బాలీవుడ్​ హీరోయిన్​ అనుష్క శర్మ నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రశంసలు దక్కాయి. ఇందులో ఓ కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారి హాథీరామ్‌ చౌదరీ పాత్ర పోషించిన అహ్లవత్‌కు మంచి పేరొచ్చింది.

ఇదీ చూడండి:కొంటె చూపులతో మనసు లాగేస్తున్న కన్నడ బ్యూటీ!

Last Updated : Jan 4, 2021, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details