Dulquer Salmaan movies ban: మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్‌పై కేరళ థియేటర్స్ అసోసియేషన్ బ్యాన్ విధించింది. ఇకపై ఆయన నటించిన సినిమాలను రాష్ట్రంలోని థియేటర్లలో విడుదల చేయకూడదని నిర్ణయించుకుంది. ఆయన నటించిన 'సెల్యూట్'ను నేరుగా ఓటీటీలో విడుదల చేయడమే దానికి కారణం. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'సెల్యూట్'కు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. దుల్కర్‌కు చెందిన నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
కాగా, సంక్రాంతి కానుకగా జనవరి 14న 'సెల్యూట్'ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ అందరితో నిర్మాణ సంస్థ చర్చలు జరిపింది. అదే సమయంలో కొవిడ్ మూడో వేవ్ రావడం వల్ల సినిమా విడుదల వాయిదా వేశారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తామని టీమ్ ప్రకటించింది.