తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆయన సినిమా తీస్తే అది కచ్చితంగా కళాఖండమే' - cinema latest news

తీసిన 10 సినిమాలు కళా ఖండాలే... అదుపు తప్పిన సినిమాలకు "కాపు" కాసిన నిర్మాత. ఉత్త‌మాభిరుచితో సినిమాకు సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 1934, గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు. నేడు ఆయన 86వ జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీప్రయాణంపై ఓ లుక్కేద్దాం.

The Greeat producer Adida Nageswarao Birthday Special
ఆయన తీసిన 10 సినిమాలు కళా ఖండాలే

By

Published : Apr 24, 2020, 7:34 AM IST

ఆయన తీసిన సినిమాల్లో జాతీయ అవార్డులు అందుకున్నవి, విదేశీ చిత్రోత్సవాల్లో ప్రశంసలకు నోచుకున్నవీ ఉన్నాయి. కళను, కాసును కలగలిపి కళావ్యాపారాత్మక చిత్రాలను అందించిన నిర్మాత ఆయన. కాసుల కోసం అభిరుచిని తాకట్టు పెట్టక్కర్లేదని నిరూపించిన ఆయనే ఏడిద నాగేశ్వరరావు. 'శంకరాభరణం', 'సాగరసంగమం', 'స్వయంకృషి', 'స్వాతిముత్యం'లాంటి చక్కని చిత్రాలను అందించిన ఆయన కీర్తి చిరస్మరణీయం. నాటకాల సరదాతో మొదలైన ఏడిద నాగేశ్వరరావు జీవన ప్రస్థానం నాణ్యమైన చిత్రాల నిర్మాతగా మారడం వెనుక ఎన్నో ఉత్థానపతనాలు ఉన్నాయి. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

శంకరాభరణం

రంగస్థలంతో మొదలై

పాఠశాలలో ప్రదర్శించిన ఓ నాటకంలో ఆడవేషం రంగస్థలం రుచేమిటో చూపించింది. ఆ నటనకు రజతపతకం సాధించిన ఉత్సాహంతో 'విశ్వభారతి', 'పరివర్తన', 'ఓటు నీకే' వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. కాకినాడలో డిగ్రీ చదువుతున్నప్పుడు వి.బి.రాజేంద్రప్రసాద్, నటులు హరనాథ్, మాడా, కె.కె.శర్మలతో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థను ప్రారంభించారు. పలు నాటకాలు ప్రదర్శించి నటించారు. మేనమామ కూతురైన జయలక్ష్మితో 1954 ఏప్రిల్‌ 24న వివాహం జరిగింది. పుట్టిన (ఏప్రిల్‌ 24, 1934) రోజునాడే పెళ్లి జరగడం యాదృచ్ఛికం అనేవారు నాగేశ్వరరావు. అదే రోజున 'శంకరాభరణం'కు జాతీయ పురస్కారం స్వీకరించడం విశేషం. తన స్నేహితుడు, నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ నుంచి 'అన్నపూర్ణ'లో నటించాలని పిలుపు రావడం వల్ల మద్రాసు వెళ్లినా ఆ వేషం దక్కలేదు. తిరిగి ఊరెళితే అవమానంగా ఉంటుందని భావించిన ఆయన చిత్ర పరిశ్రమలో ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకొని డబ్బింగ్‌ కళాకారుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు.

తొలి సంపాదన

'పార్వతీ కల్యాణం'లోని శివుడు పాత్రకి డబ్బింగ్‌ చెప్పి తొలి సంపాదనగా రూ.500 పొందారు. ఆ తరువాత నటుడిగా కూడా అవకాశాలు సొంతం చేసుకున్నారు. 1962 నుంచి 1974 మధ్యకాలంలో సుమారు 30 సినిమాలలో నటించారు. వంద చిత్రాలకిపైగా డబ్బింగ్‌ చెప్పారు. ఆ తరువాత కాకినాడకి చెందిన భాస్కరరెడ్డి, రామకృష్ణారెడ్డి, లచ్చిరెడ్డి, వీర్రాజులతో కలిసి 'వెంకటేశ్వర కల్యాణం' అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ సినిమాకి లాభాలు రావడంతో ఆ నలుగురూ కలిసి గీతా కంబైన్స్‌ అనే సంస్థని ప్రారంభించి నిర్మాణ సారథ్య బాధ్యతల్ని ఏడిద నాగేశ్వరరావుకి అప్పగించారు. అప్పటికే 'నేరము శిక్ష'లో ఓ కీలకమైన పాత్ర పోషించడంతో ఆ చిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన్ని ఒప్పించి ‘సిరిసిరిమువ్వ’ సినిమాని నిర్మించారు. అది విజయం సాధించింది. తరువాత తన బంధువులతో కలిసి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ స్థాపించారు.

సిరిసిరిమువ్వ

మూడు పదుల సినీ జీవితం

నిర్మాణ సారథిగా తన మిత్రులతో కలిసి'సిరి సిరి మువ్వ'తో మొదలై, 1979లో పూర్ణోద‌య సంస్థ‌ను స్థాపించి పదే పది సినిమాలను నిర్మించారు. ఈ పది చిత్రాలు కూడా కళాత్మక చిత్రాలుగా, తెలుగువాడి ఆత్మ‌గౌర‌వానికి సింబాలిక్‌గా ఓ అరుదైన సంత‌కంలాగా నిలిచిపోయాయి. ‌మొదటి సినిమా 'తాయారమ్మ బంగారయ్య' ఆరోగ్యకరమైన హాస్య భరిత చిత్రంగా అల‌రించింది. రెండవ సినిమా శంకరాభరణం(1980). ఈ సినిమా,తెలుగు జాతికి, ఏడిదకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అలాగే అరుదైన 'స్వర్ణ కమలం' జాతీయ పుర‌స్కారాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మ‌ళ్లీ ఇంత‌కాలానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'బాహుబలి' చిత్రానికి మాత్ర‌మే స్వ‌ర్ణ‌క‌మ‌లం ద‌క్కింది.

కమర్షియల్ సినిమా హవా నడుస్తోన్న సమయంలో ఈ సినిమా అప్పట్లో విడుదలై పెద్ద సంచలనం సృష్టించింది. తర్వాత దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. చిరంజీవి ఏడాదికి ఎనిమిది సినిమాలు చేస్తున్న రోజులవి. ఆ సమయంలో 'స్వయం కృషి'లో న‌టించారు. చిరంజీవి ఏమిటి! చెప్పులు కుట్టేవాడి పాత్రా? అనలేదు. ఈ కథ చిరంజీవిని ఆకట్టుకోవడమే కాదు.. తెలుగోడు త‌లెత్తుకునేలా గొప్ప‌ విజయం సాధించింది. ఈ సినిమా రష్యన్ ‌ భాషలోకి అనువాదమైంది. అంతకు ముందు ఆయన చిత్రాలన్నీ రష్యన్ భాషలోకి అనువదించి గొప్ప విజయాన్ని సాధించాయి. ఏడిద వారి మరో చిత్రం 'ఆపద్భాంధవుడు' , చిరంజీవి నట జీవితంలో ఓ మైలు రాయి , మెగాస్టార్ చేస్తున్న ఎన్నో సాంఘిక కార్యక్రమాల మూలంగా , ఇప్పుడు కరోనా మహమ్మారి వలన ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు అండగా సీసీసీ ప్రారంభించి మరోసారి ఆపత్బాంధవుడు అనే పేరును సార్థకం చేసుకున్నారు. ఆ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా చిరంజీవి రెండవ సారి ఎంపికయ్యారు.

చిరంజీవిaస్వయంకృషి

ఆస్కార్​ నామినేషన్​కు వెళ్లిన ఏకైక చిత్రం

కమల్‌హాస‌న్‌ నటించిన 'సాగరసంగమం' 'స్వాతి ముత్యం' చిత్రాలకు ఎన్నో అంతర్జాతీయ ,జాతీయ ,రాష్ట్ర బహుమతులు వరించాయి . అలాగే ఇప్పటివరకూ ఆస్కార్ నామినేషన్​కు వెళ్లిన ఏకైక తెలుగు చిత్రం స్వాతిముత్యం. తెలుగు సినిమాకు తొలి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన నిర్మాత ఆయన. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కు నామినేట్ అయ్యారు, కానీ అవార్డు రాలేదు. కళా సాగర్ వారు దశాబ్దపు ఉత్తమ నిర్మాతగా అవార్డునిచ్చి గౌర‌వించారు. సంగం అకాడమీ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్‌, 'సంతోషం' లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో స‌త్క‌రించి గౌర‌వించాయి. పద్మశ్రీ , రఘుపతి వెంకయ్య అవార్డులు , ఆ వ్యక్తి మరణాంతరం ఇచ్చిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి . ఎవరైనా పెద్ద మనుషులు జోక్యం చేసుకొని కనీసం ఇప్పటికైనా ఏడిద నాగేశ్వరరావు గారికి ఆ గౌరవం దక్కేలా చూస్తే , మంచి తెలుగు సినిమాలకు వారు ఇచ్చే గౌరవం అవుతుంది.

స్వాతిముత్యం

ఆయన నిర్మించిన ఆణిముత్యాలు - అవి సాధించిన అవార్డులు

  • సిరి సిరి మువ్వ - రెండు జాతీయ అవార్డులు
  • తాయారమ్మ బంగారయ్య
  • శంకరాభరణం - ఒక అంతర్జాతీయ, నాలుగు జాతీయ ( స్వర్ణ కమలం ) ఎనిమిది రాష్ట్ర నంది అవార్డులు ( బంగారు నంది ) ఇంకా ఎన్నో ..
  • సీతాకోకచిలక - ఒక జాతీయ అవార్డు , నాలుగు రాష్ట్ర నంది అవార్డులు ( బంగారు నంది )
  • సాగర సంగమం - రెండు జాతీయ అవార్డులు, మూడు రాష్ట్ర నంది అవార్డులు
  • స్వాతిముత్యం - ఆస్కార్ కి నామినేషన్, ఒక జాతీయ అవార్డు
  • సితార - మూడు జాతీయ అవార్డులు
  • స్వయంకృషి - రాష్ట్ర నంది అవార్డు - చిరంజీవి కి తొలి సారి ఉత్తమ నటుడు స్వరకల్పన
  • ఆపత్బాంధవుడు - నాలుగు రాష్ట్ర నంది అవార్డులు- చిరంజీవి కి రెండవ సారి ఉత్తమ నటుడు

ఇదీ చూడండి : లోకనాయకుడు కమల్​ పాట కోసం వచ్చిన తారలోకం

ABOUT THE AUTHOR

...view details