చిన్నప్పటి నుంచి సినిమాపై ఉన్న అమితమైన మక్కువతో ఎంతోకాలం క్రితం పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రొడక్షన్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించి ఎంతోమంది దర్శకులు వద్ద వర్క్ చేశారు యుగంధర్. ఆయన దర్శకత్వంలో తొలి ప్రయత్నంగా తెరకెక్కిన చిత్రం 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు'. హస్వంత్ వంగ, నమ్రతా దరేకర్, వశిష్ట చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' దర్శకుడు యుగంధర్.. తన సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..
సినీ ప్రయాణమిలా..:
మాది ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోగల లక్ష్మిపురం అనే చిన్న పల్లెటూరు. చిన్నప్పటి నుంచి నాకు సినిమాపై ఎంతో ఆసక్తి ఉండేది. ఎలాగైనా సరే పరిశ్రమలోకి అడుగుపెట్టాలనే కోరిక ఉండేది. అలాంటి తరుణంలో సుమారు 14 సంవత్సరాల క్రితం పరిశ్రమవైపు అడుగులేశాను. మొదటి ప్రయత్నంలోనే ప్రొడెక్షన్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించే అవకాశం నన్ను వరించింది. అలా, కెరీర్ ప్రారంభించాను.
శ్రీహరి సినిమాలు..:
శ్రీహరి నటించిన ఎన్నో చిత్రాలకు ప్రొడెక్షన్ మేనేజర్‌గా పనిచేశాను. 'దాస్', 'ఒరేయ్ తమ్ముడు', 'పృథ్వీనారాయణ', 'రాధాగోపాలం' 'ఒట్టేసి చెబుతున్నా', 'రామ్' వంటి చిత్రాలకు నేనే ప్రొడక్షన్ మేనేజర్. ఓ సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలపై ప్రొడక్షన్ మేనేజర్‌కు పట్టు ఉంటుంది. అలాంటి పోస్ట్‌లో నేను కూడా కొంతకాలంపాటు భాగమైనందుకు ఎంతో ఆనందిస్తున్నాను.
ఆ సినిమా తర్వాతే..:
ప్రొడక్షన్ మేనేజర్‌గా సుమారు 20 సినిమాలకు పనిచేశాను. 2012లో విడుదలైన 'సోలో' చిత్రానికి చివరిసారిగా ప్రొడక్షన్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించా. ఆ సినిమా తర్వాత దర్శకుడిగా మారాలని గట్టిగా నిర్ణయించుకున్నా. కథలు కూడా రాశా. ఈ క్రమంలోనే సుమారు 3 ఏళ్లు ఇబ్బందులు పడ్డాం.
డైరెక్షన్.. గౌరవం:
డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే నాకు అమితమైన అభిమానం. డైరెక్టర్ అంటే గౌరవం. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. ముఖ్యంగా బాపుగారు, పీ వాసు అంటే అమితమైన గౌరవం ఉంది.