బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ స్టాఫ్, స్నేహితులు, కుటుంబసభ్యులను విచారించిన పోలీసులు పలు విషయాలు తెలుసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి మూడురోజుల ముందు సుశాంత్ తన స్టాఫ్‌కు జీతాలు చెల్లించాడని, కొద్దిరోజుల తర్వాత జీతాలు ఇవ్వడం తనకు కుదరదని ఆయన అన్నాడని కొంతమంది పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ వెబ్‌సిరీస్‌లో నటించమని కోరుతూ ఇటీవల సుశాంత్ తన మాజీ మేనేజర్ దిశాతో చర్చలు జరిపాడని హీరో ప్రస్తుత మేనేజర్ పోలీసులకు వెల్లడించాడు. దీంతో పోలీసులు సుశాంత్ ఫోన్ పరిశీలించగా.. ఆయన మార్చి నెలలో చివరిసారిగా దిశాతో వాట్సాప్ చాట్ చేసినట్లు తెలిసింది.
'అమ్మకోసం' లేఖ రాసిన సుశాంత్
తన తల్లి మృతి అనంతరం ఒకానొక సమయంలో సుశాంత్ ఓ భావోద్వేగభరితమైన లేఖను రాశాడు. 2016లో రాసిన ఆ లేఖ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. "అమ్మా.. నీకు గుర్తుందా?నువ్వెప్పటికీ నాతోనే ఉంటానని మాటిచ్చావు, అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాటిచ్చాను. కానీ ఇప్పుడు, మనిద్దరం తప్పని తెలుస్తోంది" అని సుశాంత్ లేఖలో పేర్కొన్నాడు.