సాయుధ పోరాటంతో గిరిజనుల బతుకు మారేటి, వెతలు తీరేటి ఉద్యమం చేపట్టిన విప్లవజ్యోతి, తెలుగువారి ఖ్యాతి, తరతరాలకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించి, గుండెల్లో నిద్రించిన సింహస్వప్నం. అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు చరిత్రను వెండితెరపై ఒక మహాద్భుత దృశ్యకావ్యంగా మలిచిన ఘనత హీరో కృష్ణకు దక్కింది. సూపర్ స్టార్ నటించిన 100 చిత్రంగా ఖ్యాతిని అందుకుంది. సోమవారం(మే 31), కృష్ణ పుట్టినరోజు ఆ సందర్భంగా ఆ విశేషాలు మీకోసం.
తెల్లదొరల దుష్పరిపాలను తుదముట్టించాలని పిలుపునిచ్చిన తెలుగువీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. నీతి లేని శాసనాలు, నీతిబాహ్య విధానాలు.. వ్యాపారం పేరుతో వచ్చి, ఈదేశంలో తిష్టవేసి యదేచ్ఛగా దోపిడీలకు, దుర్మార్గాలకు, పాల్పడిన దుండగులు తెల్లవాళ్లు. అలాంటి దుష్పరిపాలనకు, దురంతాలకు వ్యతిరేకంగా మన్యం ప్రజలను కదలించారు. తుదిసమరం మొదలు పెట్టి బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడాలని గిరిజనాన్ని కదలించారు. విప్లవ శంఖారావం పూరించారు అల్లూరి.
ముందుగా ప్రకటించి పోలీసు స్టేషన్ల మీద విల్లంబులతో దాడులు, తుపాకులు ఎత్తుకెళ్లి తెల్లదొరల కంటి మీద కునుకు లేకుండా చేశారు. రగిలిన విప్లవాగ్నిని చల్లార్చాలని, అల్లూరి సీతారామరాజును బంధించాలని ప్రభుత్వం రూ.10 వేల బహుమతి ప్రకటించింది. పైసలకు గడ్డికరవబోమని, తమ ఆరాధ్యుడికి హాని తలపెట్టబోమని మన్యం ప్రజలు తీర్మానించారు. చివరకు నది ఒడ్డున స్నానం చేసి ధ్యానం చేయబోతున్న అల్లూరిని చుట్టుముట్టి కాల్చిచంపిన ఘాతకులు, పాతకులు తెల్లదొరలు. ఈ చరిత్రను తరతరాలకు స్ఫూర్తిగా అందించేందుకు.. సినిమాగా తేవటానికి ఎవరూ ముందుకు రాలేదు. నటరత్న ఎన్టీ రామారావు ఎన్నాళ్లుగానో స్క్రిప్టు సిద్ధం చేసుకున్నట్లు చెబుతుండేవారు.