క్రికెట్‌కు భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్‌ను ఓ మతంలా.. సచిన్ తెందూల్కర్‌ను క్రికెట్ దేవుడిగా భావించే మన దేశంలో ఇతర క్రీడలకు అదే స్థాయిలో ప్రాముఖ్యం ఉంది. అంతటి ప్రేమ వల్లనే కాబోలు.. క్రీడానేపథ్యంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రతి చిత్రం బ్లాక్బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన అప్పటి 'విజేత' చిత్రం నుంచి నిన్నమొన్నటి 'జెర్సీ' వరకు టాలీవుడ్లో క్రీడాసినిమాలకు మంచి గిరాకీ ఉంది. సగటు ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకులూ.. స్పోర్ట్స్ కథతో, పక్కా డ్రామాతో, కచ్చితమైన స్క్రీన్‌ప్లేతో సూపర్‌హిట్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు వచ్చిన క్రీడానేపథ్య చిత్రాలేవో చూద్దాం.
క్రికెట్ నేపథ్యంతో..
టాలీవుడ్లో క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, అందులో యువ కథానాయకుడు నాని నటించిన 'జెర్సీ' చిత్రం ప్రత్యేకమనే చెప్పాలి. అప్పటివరకు ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో క్రికెట్ గురించి ప్రధానంగా తెరపై చూపించలేదు. కానీ, జాతీయజట్టులో స్థానం దక్కించుకోవాలనే లక్ష్యంతో క్రికెటర్‌గా మారిన కుర్రాడు.. అనుకోని కారణాల వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. పెళ్లి తర్వాత తన కుమారుడి కోరిక మేరకు మళ్లీ బ్యాట్ పడతాడు. అలా తన లక్ష్యం కోసం పరుగెత్తుతూ గెలిచాడా? ఓడాడా? అనేది కథాంశం. ఈ సినిమాను కేంద్రప్రభుత్వం గుర్తించి.. జాతీయ అవార్డుకు ఎంపికచేసింది. ఇందులో నాని, శ్రద్ధాశ్రీనాథ్ ప్రధానపాత్రలు పోషించారు.
ఈ సినిమాతో పాటు తెలుగులో విడుదలైన 'మజిలీ' చిత్రం నాగచైతన్య, సమంత కెరీర్లో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. క్రికెట్‌తో పాటు ప్రేమ అంశంతో దర్శకుడు రాసుకున్న కథ ప్రేక్షకుల మనసును తట్టిలేపింది. ఐశ్వర్యారాజేశ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేశ్ నటించిన 'వసంతం', సుమంత్ ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గోల్కొండ హైస్కూల్', ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధోనీ', నారా రోహిత్, శ్రీవిష్ణు హీరోలుగా నటించిన 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలూ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.
కబడ్డీ..
సూపర్‌స్టార్ మహేశ్ బాబును మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'ఒక్కడు'. ఫ్యాక్షన్‌తో పాటు కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహేశ్ కెరీర్లో బంపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో మహేశ్‌తో పాటు భూమిక, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. దీంతో పాటు తెలుగులో కబడ్డీ నేపథ్యంతో అనేక చిత్రాలొచ్చాయి. అందులో నాని నటించిన 'భీమిలి కబడ్డీ జట్టు', జగపతిబాబు హీరోగా నటించిన 'కబడ్డీ..కబడ్డీ' చిత్రాలు తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి.
బాక్సింగ్ కథాంశంతో..
సుబ్రహ్మణ్యం(సుబ్బు)(పవన్‌కల్యాణ్) అల్లరిచిల్లరిగా తిరిగే ఓ కుర్రాడు. కాలేజీ పరీక్షల్లో కాపీ కొట్టడం, స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటుపడ్డ కుర్రాడు. సుబ్బు చేసే చేష్టలతో విసిగిపోయిన తండ్రి అతడిపై కోపం ఎక్కువ. సుబ్బు అన్న చక్రి(అచ్యుత్) బాక్సర్‌గా ఓ టోర్నమెంట్లో గెలవాలన్నది అతడి కల. అయితే అనుకోని ప్రమాదం వల్ల చక్రి చేతులు, కాళ్లు విరిగి ఆస్పత్రి పాలవుతాడు. అయితే తన అన్న ఆస్పత్రి పాలవ్వడానికి కారణమైన వాళ్లపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు సుబ్బు. తన అన్నయ్యకు ఇష్టమైన బాక్సింగ్ నేర్చుకొని ఇంటర్ కాలేజీ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి తన అన్న కల నెరవేరస్తాడు. అలా బాక్సింగ్‌లో ట్రోఫీ నెగ్గిన సుబ్బు అందరి హృదయాలను గెలుచుకుంటాడు. ఇదీ పవన్ హీరోగా నటించిన 'తమ్ముడు' కథ. పవర్‌స్టార్ కెరీర్లో సూపర్‌హిట్‌గా నిలిచింది.
అయితే బాక్సింగ్ నేపథ్యంతో టాలీవుడ్లో అనేక చిత్రాలొచ్చాయి, వస్తున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించి చిత్రం 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'. ఈ సినిమా అటు రవితేజ, ఇటు పూరీ జగన్నాథ్ కెరీర్లో బ్లాక్బాస్టర్ హిట్‌గా నిలిచింది. వీటితో పాటు విక్టరీ వెంకటేశ్ ప్రధానపాత్రలో నటించిన 'గురు', 'తుంటరి', '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే బాక్సింగ్ నేపథ్యం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. బాక్సింగ్ నేపథ్యంతో ప్రస్తుతం తెలుగులో 'గని', 'లైగర్' చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నాయి.