కర్ణాటక సహా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మండ్య లోక్‌సభ ఎన్నికల్లో... మాజీ మంత్రి, దివంగత నటుడు అంబరీష్ సతీమణి సుమలత గెలిచారు. జాతీయ పార్టీలు పోటీకి దూరంగా నిలిచిన ఈ ఎన్నికల్లో.. జేడీఎస్ అభ్యర్థి, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌తో హోరాహోరీగా తలపడిన ఆమె గెలుపుబావుట ఎగరేశారు. భాజపా, సినీ ప్రముఖుల మద్దతు సహా ఓటర్ల ఆశీర్వాదం ఆమెను విజేతగా నిలిపింది.
కన్నడ చిత్రసీమలో.. దివంగత నటుడు అంబరీష్‌కు ఉన్న ప్రజాదరణ, ఆయన హయాంలో అభివృద్ధి పనులకు తోడు ఆయన మరణానంతరం సానుభూతి సుమలతకు కలసొచ్చింది.
అంబరీష్.. 1998,1999, 2004లో మండ్య నుంచి కాంగ్రెస్ తరఫున 3సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రి పదవి చేపట్టారు. 2014తోపాటు... 2018 ఉప ఎన్నికల్లో అక్కడ జేడీఎస్ విజయ ఢంకా మోగించింది. కానీ ఈసారి కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన సుమలత.. యాభై ఏళ్లలో అక్కడ గెలిచిన తొలి స్వతంత్ర అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.
సుమలతకు మద్దతు ప్రకటించిన భాజపా...అభ్యర్థిని నిలపలేదు. ప్రధాని మోదీ ఆమెకే ఓటేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రత్యర్థుల విమర్శలను సుమలత దీటుగా తిప్పికొట్టడం..., కొందరు కాంగ్రెస్ నేతలు, రైతు సంఘాల నేతలు, సినీ తారలు మద్దతు ఇవ్వడం.. ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టాయి. వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ అండదండలు నియోజకవర్గంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న ఆ వర్గం ఓట్లను ఆకర్షించేందుకు తోడ్పడిందని చెబుతున్నారు విశ్లేషకులు.
కాంగ్రెస్-జేడీఎస్ కార్యకర్తల మధ్య సమన్వయ లేమి సుమలతకు లాభించింది. కాంగ్రెస్, జేడీఎస్ అధిష్ఠానం ఆదేశాలు ధిక్కరించి మరీ కార్యకర్తలు సుమలత విజయానికి కృషి చేశారు. సుమలత స్థానికత, కులానికి సంబంధించి ప్రత్యర్థి చేసిన ఆరోపణలూ ఓటర్లలో ఆమెపై సానుభూతి పెంపొందించాయి.