దేశంలో రెండో దశ కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు సినీ తారలు నడుంబిగించారు. ఆర్థిక సాయం చేస్తూ కొందరు.. వైద్య సహాయాలు అందిస్తూ మరికొందరు అండగా నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాలనే వేదికలుగా చేసుకొని కరోనా బాధితుల అవసరాలూ తీరుస్తున్నారు.
సోనూసూద్ ఆపన్న హస్తం
తొలి దశ కరోనా సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అండగా నిలిచారు నటుడు సోనూసూద్. రియల్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా కొవిడ్ బాధితులకు అందుబాటులో ఉంటూ.. అవసరార్థులకు ఆస్పత్రుల్లో పడకలు సమకూర్చడం సహా ఔషధాలు, ఆక్సిజన్ సిలెండర్లు లాంటివి అందిస్తున్నారు.
ఆయన కొన్ని వారాల క్రితం అత్యవసర చికిత్స కోసం భారతి అనే కరోనా బాధితురాల్ని ఎయిర్ అంబులెన్స్‌లో నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తూ ఆమె కరోనాతో పోరాడుతూ ఇటీవలే కన్నుమూసింది. కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందించాలని సోనూసూద్ ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
బిగ్‌బి రూ.2కోట్ల సాయం
కరోనాపై పోరాటంలో ప్రజలకు అండగా నిలిచేందుకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముందుకొచ్చారు. దిల్లీలోని గురుద్వారా కొవిడ్ కేర్ సెంటర్‌కు రూ.2కోట్లు విరాళం ప్రకటించారు. దిల్లీలోని రాకప్ గంజ్ గురుద్వారాను కరోనా సంరక్షణా కేంద్రంగా మార్చారు. దీన్ని మొత్తం 300 పడకలతో ఏర్పాటు చేశారు. సోమవారం నుంచే ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడీ ఆస్పత్రిలోని ఏర్పాట్ల కోసమే బిగ్‌బీ రూ.2కోట్లు సాయమందించారు. ఈ విషయాన్ని ఆ గురుద్వారా నిర్వాహక అధ్యక్షులు మజిందర్ సింగ్ వెల్లడించారు.
"సరైన సమయంలో అమితాబ్ పెద్ద సాయమందించారు. దిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయన నాకు రోజూ ఫోన్ చేసి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునే వారు. కొవిడ్ కేంద్ర నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకునేవారు. ఆస్పత్రిలో ఏర్పాట్లు, ఆక్సిజన్ కోసం తమ వంతు సాయమందిస్తానని మాటిచ్చారు. ఇప్పుడా మాట ప్రకారం భారీ సాయం అందించార"ని మజిందర్ తెలియజేశారు.
కొవిడ్ పోరులో 'రాధేశ్యామ్' టీం
కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు 'రాధేశ్యామ్' చిత్ర నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమా కోసం వేసిన ఆస్పత్రి సెట్ ప్రాపర్టీని హైదరాబాద్‌లోని ఓ కొవిడ్ సంరక్షణ కేంద్రానికి విరాళంగా అందించారు. ఇందులో మొత్తం 50 పడకలతో పాటు స్ట్రెచర్లు, ఆక్సిజన్ సిలెండర్లు, ఇతర వైద్య పరికరాలు వంటివి ఉన్నాయి. ఈ విషయాన్ని ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ ఆర్.రవీందర్ రెడ్డి వెల్లడించారు.
"ప్రస్తుతం ఆస్పత్రుల్లో బెడ్లు,ఆక్సిజన్ సిలెండర్ల కొరత ఎక్కువగా ఉంది. అందుకే యూవీ క్రియేషన్స్ వారు హాస్పిటల్ సెట్ ప్రాపర్టీని నగరంలోని ఓ కొవిడ్ సంరక్షణ కేంద్రానికి విరాళంగా అందించింది. ఈ కష్టకాలంలో నిర్మాతలు చేసిన సాయం పట్ల ప్రభాస్ సహా.. మొత్తం చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేసింద"ని రవీందర్ రెడ్డి చెప్పారు.