బాలు..
ఎక్కడ నువ్వు..? ఏదీ నీ నవ్వు..?
ఏ మనసు తలుపు తెరచినా నీ తలపే..
పాడుతా తీయగా అంటూ పలకరించే నీ పిలుపే..
అప్పుడే ఎలా వెళ్లిపోయావు?
ఈ పాట పూర్తి కాకుండానే..
నిన్నగాక మొన్ననే కదా- పెన్నా తీరాన పండితారాధ్యుల వారి ఇంట కలల పంటలా తొలికేక పెట్టావు..
త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలతో సింహపురిని చిరు తిరువాయూరుగా మార్చిన తండ్రి సాంబమూర్తిగారి భాగ్యమో, తల్లి శకుంతలమ్మ నోము ఫలమో..
మరి ఆ అమ్మ గోరు ముద్దలు తినిపించిందో..నీ నోట తేనెధారలే వంపిందో తెలియదు కానీ..
ఉంగా ఉంగా అంటున్న నీ పసిగొంతులోనూ రమ్యరాగామృతమే పలికిందట..
తెలుగు జాతిది ఎంత పుణ్యం..
'బాల' సుబ్రహ్మణ్యంగా లేలేత గొంతుతో లలితలలితంగా నాదవేదాలు పలకడం ప్రారంభించావు!
1966 డిసెంబరు, 15 శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంలో తొలిసారిగా గీతమాలపించావు..
ఆ రోజే..'బాలు పాట' పేరుతో శకం మళ్లీ పుట్టింది.
ఆ తర్వాత అంతా బాలు యుగమే..
సురాగ యాగమే..!
తెలుగు వారికే కాదు..అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రంలో, అలా..
మలయాళ నేలమీద, మహారాష్ట్ర జనుల మీద..
ఒక భాషా..
ఒక ప్రాంతమా..
నీ పాట మత్తులా, మేఘంలా కమ్మేసింది..
కోట్లాది జన మానసాల్ని సమ్మోహితుల్ని చేసి, ఊహల్లో ఊరించి, ఊగించి, ఉత్తుంగ తరంగమై విశ్వరూపమెత్తి ఉర్రూతలూగించింది..
ఒకటా.. రెండా.. వేలా..పదివేలా..
అర్ధశతాబ్దాన్ని దాటిన మహా ప్రయాణంలో అర లక్షకు మించిన పాటలు..
మంచు కురిసే ఉదయాన నిద్రలేవగానే సుప్రభాతమై వినిపించేది నీ శ్రీకంఠమే..
పొత్తిళ్లలో బిడ్డ ఏడుస్తుంటే జోలపాడి లాలించేది మార్దవమైన నీ గొంతుకే..
వాల్జడ కదలాడుతుంటే వయ్యారాల జలపాతంలా సాగే వెన్నెలమ్మాయిని ప్రేమగా తాకేది నీ ప్రియగీతికే...
గుండె నిండా దిగులు ఆవరిస్తే, విరహపు దీపాన్ని వెలిగించి ఓదార్పు వింజామరలు వీచేది నీ గానమాధుర్యమే..
వేకువ నుంచి నిశిరాతిరి వరకు, ప్రతి క్షణం..!