దక్షిణాది గడ్డపై పుట్టి పెరిగిన బాలీవుడ్ నటి దీపికా పదుకొణే.. చిన్నప్పుడు రాకెట్ చేతపట్టి బ్యాడ్మింటన్ మైదానంలో మెరుపులు మెరిపించింది. పెద్దయ్యాక వెండితెరకు మారిపోయింది. అక్కడ మాత్రం అమ్మడి సందడి మామూలుగా లేదు. వరుస విజయాలతో దూసుకెళ్లింది. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' తో రూ.200 కోట్లు వసూళ్ల కథానాయికల క్లబ్‌లోకి చేరిపోయింది. ఆపై హాలీవుడ్‌కి కూడా వెళ్లి అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించింది. ఈ మధ్యనే ఓ ఇంటికి ఇల్లాలు కూడా అయ్యింది. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ను పెళ్లి చేసుకున్న ఈ కన్నడ భామ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
ముద్దుముద్దుగా..
పూర్తి పేరు దీపికా పదుకొణే. ఇంట్లో మాత్రం ముద్దుగా అందరూ దీపి అని పిలుస్తుంటారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో 1986 జనవరి 5న పుట్టింది. దీపిక తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొణే. సొంత రాష్ట్రం కర్ణాటక. తల్లి పేరు ఉజ్వల. ఆమె ఓ ట్రావెల్ ఏజెంట్.
బాల్యం..
బెంగళూరులోని సోఫియా హైస్కూల్‌లో పాఠశాల విద్యని పూర్తి చేసింది దీపిక. చదువుకొనేటప్పుడే టీవీల్లో పలు ప్రకటనలు చేసింది. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ చిన్నప్పుడే రాకెట్ చేతపట్టింది. రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా గుర్తింపును తెచ్చుకొంది. పదో తరగతి పరీక్షలు అయ్యాక మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. బెంగళూరులో మోడలింగ్‌కి సంబంధించిన ఓ కోర్సును కూడా చేసింది.
ర్యాంప్‌పై నడక
మోడలింగ్‌లోకి ప్రవేశించాక దీపికాకి పేరొచ్చింది. 2003లో బెంగళూరులోని ది వోగూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో మొదటి ర్యాంప్ వాక్ చేసింది. అక్కడ నుంచి ఆమె మెరుపులు మొదలయ్యాయి. పలు వ్యాపార ప్రకటనల్లో నటించింది. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకొంది. ర్యాంప్‌పై నడవడం మొదలెట్టిన మూడేళ్లలోపే మోడల్ ఆఫ్ ది ఇయర్‌గా కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ అవార్డును సొంతం చేసుకుంది. కింగ్‌ఫిషర్ స్విమ్‌సూట్ క్యాలెండర్‌పై కూడా మెరిసింది.
సినీ ప్రవేశం..
వ్యాపార ప్రకటనల్లో మెరవడం మొదలవ్వగానే దీపికకు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. హిందీ నుంచి పలువురు దర్శకులు ఆమె వెంటపడ్డారు. అయితే ఈ సొట్టబుగ్గల సుందరి మాత్రం ఆ అవకాశాల్ని తిరస్కరిస్తూ వచ్చింది. కొన్నాళ్లకు హిమేష్ రేషమ్మియా చేసిన 'నామ్ హై తేరా' అనే ఓ మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌లో మెరిసింది. ఆ వీడియో దీపికాకి మరింత పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అనుపమ్ ఖేర్ నట శిక్షణాలయంలోకి వెళ్లి నటన గురించి మెలకువలు తెలుసుకొంది. దీపిక తెర ప్రవేశం మాత్రం నాటకీయంగా జరిగిందని అంటుంటారు. ఆమె నటించిన తొలి చిత్రం 'ఐశ్వర్య'. కన్నడలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో చక్కటి ఆదరణ పొందింది.
షారుఖ్ సరసన..
అవకాశాలను వెదుక్కొనే అవసరమే రాలేదు, ఈ మెరుపుల రాకెట్‌కి. కన్నడ చిత్రం 'ఐశ్వర్య' విడుదలవ్వగానే హిందీ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది. తొలి ప్రయత్నంలోనే షారుఖ్ ఖాన్ సరసన అవకాశాన్ని సంపాదించింది. 'హ్యాపీ న్యూ ఇయర్' పేరుతో తెరకెక్కాల్సిన ఆ చిత్రం ఉన్నట్టుండి వాయిదా పడింది. అంతలోనే ఫరాఖాన్ తన 'ఓం శాంతి ఓం' సినిమా కోసం దీపికని ఎంచుకొంది. రెండో ప్రయత్నంలో కూడా షారుఖ్ ఖాన్‌తోనే కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకొంది. ఇందులో శాంతిప్రియగా దీపికా పదుకొణే కనిపించిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. 'షారుఖ్ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమవుతానని నేను కలలో కూడా అనుకోలేదు' అని చెబుతుంటుంది.