కరోనాతో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం.. ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బాలు ఆరోగ్యంపై గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన చెన్నై ఎంజీఎం ఆసుపత్రి.. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగిస్తున్నట్లు అందులో పేర్కొంది. వెంటిలేటర్‌తో ప్రాణవాయువు అందిస్తూనే.. ఎక్మో సాయంతో ఎస్పీ బాలుకు చికిత్స చేస్తున్నట్లు బులెటిన్‌లో స్పష్టం చేశారు. నిరంతరం వైద్య బృందం బాలు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు: ఎస్పీ చరణ్
ఎస్పీ బాలు ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా అంతకుముందు వెల్లడించారు. కష్టసమయంలో ప్రేమ, ఆదరాభిమానాలు చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
"అందరికీ నమస్కారం.. నాన్నగారి ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఎలాంటి పురోభివృద్ధి లేదు. అందుకే నేను తరచూ అప్‌డేట్ ఇవ్వడం లేదు. అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తాయన్న నమ్మకం ఉంది. నాన్న ఆరోగ్యం కుదుటపడాలని సామూహిక ప్రార్థనలు చేస్తున్న చిత్ర పరిశ్రమకు, సంగీత విభాగానికి చెందిన వారికి, దేశ ప్రజలకు ధన్యవాదాలు. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు" అని చరణ్ పేర్కొన్నారు. తమిళంలో మాట్లాడుతూ గద్గత స్వరంతో భావోద్వేగానికి గురయ్యారు.
మరోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని ఆగస్టు 20న చిత్ర పరిశ్రమ వర్గాలు, ఎస్పీబీ అభిమానులు, శ్రేయోభిలాషులు సామూహిక ప్రార్థనలు చేశారు.