గతేడాది కొవిడ్ కారణంగా లాక్‌డౌన్ పెట్టినపుడు.. చాలామంది ఇళ్లలో ఉంటూ తమ హాబీలకు సమయం కేటాయించారు. ఇంకొందరు కొత్త హాబీలను నేర్చుకున్నారు. నటుడు సోనూసూద్ మాత్రం ఉపాధిలేక, తిరిగి సొంతూళ్లకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న లక్షల మంది వలస కూలీలను క్షేమంగా గూటికి చేర్చారు. కొవిడ్ మరోసారి విజృంభించినపుడు ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటుచేశారు. సినిమాల్లో ఉత్తమ విలన్‌గా పేరొందిన సోనూ.. బయట సిసలైన హీరో అనిపించుకున్నారు. తన సేవా కార్యక్రమాలూ, కుటుంబం, భవిష్యత్తు కార్యక్రమాల గురించి సోనూ ఏం చెబుతున్నారంటే?
"పంజాబ్‌లోని మోగా మా సొంతూరు. అమ్మ ప్రొఫెసర్. నాన్న బట్టల దుకాణాన్ని నడిపేవారు. వారానికోసారి మా దుకాణం ఎదుట అన్నదాన కార్యక్రమం చేపట్టేవారు. దాదాపు 100 మంది ఆరోజు అక్కడ ఆకలి తీర్చుకునేవారు. వాటిలో నేనూ పాల్గొనేవాణ్ని. నలుగురికీ సాయపడటంలో కలిగే ఆనందం అలా నాకు చిన్నపుడే అనుభవమైంది. 'జీవితంలో నువ్వు ఎంత పైస్థాయికి వెళ్లినా, ఎంత డబ్బు సంపాదించినా కూడా.. అవసరంలో ఉన్నవారికి సాయపడినపుడే- అది కూడా వాళ్లు నీనుంచి సాయం అడగకుండానే అందించినపుడే- నువ్వు జీవితంలో విజయవంతమైనట్టు' అని చెబుతుండేది అమ్మ. స్కూల్, కాలేజీ రోజుల్లోనూ అక్కా, చెల్లీ, నేనూ అవసరమైనవారికి చేతనైన సాయం చేసేవాళ్లం. అలా ఇప్పుడు చేస్తున్న పనులన్నింటికీ బీజం నా చిన్నపుడే పడిందని చెప్పాలి.
గతేడాది లాక్‌డౌన్ సమయంలో స్నేహితులతో కలిసి ముందు ఉచిత భోజనం అందించడం మొదలుపెట్టాను. వేల మంది సుదూరాల్లోని తమ ఊళ్లకు నడిచి వెళ్తుంటే వాళ్లనలా చూస్తూ ఊరకే ఉండలేకపోయాను. మొదట కొద్దిమందినైనా బస్సుల్లో పంపాలనుకున్నా. క్రమంగా అది లక్షల మందిని తమ ఇళ్లకు చేర్చే కార్యక్రమం అయింది. ఇదంతా నా కుటుంబం వల్లనే సాధ్యమైంది. కుటుంబం అంటే నా భార్యా పిల్లలే కాదు, స్నేహితులూ, కారు డ్రైవర్, పాలు పోసే అబ్బాయి.. వీళ్లందరూ. క్రమంగా ఆ కుటుంబంలో వేలమంది సభ్యులయ్యారు.
దాదాపు ఎనిమిది లక్షల మందిని తమ సొంతూళ్లకు బస్సులూ, రైళ్లూ, విమానాల్లో పంపించాం. వీరిలో విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులూ ఉన్నారు. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో కొందరు సాయం కోసం నన్ను సంప్రదించినపుడు కాదనలేకపోయాను. చదువులు, ఉపాధి, వైద్యం.. ఇలాంటి విషయాల్లో అడిగినవాళ్లందరికీ సాయం చేస్తూ వచ్చా. ఏడున్నర వేలమందికి వివిధ రకాల సర్జరీలు చేయించాం. కొవిడ్ రెండో దశలో ఆక్సిజన్ సిలిండర్లు, మందులూ కావాల్సినపుడు వాటిని అందించాం. అంబులెన్స్‌లూ, ఎయిర్ అంబులెన్స్‌లూ ఏర్పాటుచేశాం.
ఈసారి నా బృందంలో మా నుంచి సాయం పొందినవాళ్లూ, మా సాయం గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందినవాళ్లూ.. ఇలా ఎందరో భాగమైపోయారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతిచోటా మా బృందాలు ఉన్నాయి. మంచివైపు మనం ఒక అడుగు వేస్తే చాలు మనతో ఎంత దూరమైనా నడిచే వ్యక్తులు ఉంటారనడానికి ఇదే నిదర్శనం. ఇదే సమయంలో నన్ను విమర్శించినవాళ్లూ ఉన్నారు. అయితే వాళ్లకు సంజాయిషీ ఇస్తూ కూర్చునే బదులు ఆ టైమ్‌లో మరికొందరికి సాయపడవచ్చనే ఉద్దేశంతో వాళ్లని పట్టించుకోవడం మానేశాను. తర్వాత వాళ్లలో కొందరు తమ మనసు మార్చుకుని మాతో కలిసి పనిచేసినవాళ్లూ ఉన్నారు.
కోట్ల మందికి ఉపాధి
సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికు మొదటిసారి వచ్చినపుడు రైల్లో అన్‌రిజర్వ్‌డ్ టికెట్‌తో వచ్చా. ఈరోజు నేను ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నా. రెండు దశాబ్దాల కెరీర్‌లో నటుడిగా వివిధ భాషా చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించాను. కానీ, నిజ జీవితంలో.. నిజమైన సమస్యకు స్పందించడమే నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పాత్ర. దీనికోసమే ముంబయి వచ్చానేమో అనిపిస్తుంటుంది. కొవిడ్‌కు ముందు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేశా కానీ ఈ అనుభవం నన్ను పూర్తిగా మార్చేసింది.
ఎందుకంటే మనం చేసిన సాయం ఒక వ్యక్తికే కాదు, వారి కుటుంబానికీ, ఓ తరానికీ మంచి భవిష్యత్తును ఇస్తుంది. అందుకే ఫౌండేషన్ పనులు మరింత చురుగ్గా చేపడుతున్నా. ముఖ్యంగా ఆహారం, ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పన.. ఈ విభాగాల్లో వివిధ కార్యక్రమాల్ని ప్రారంభించాం. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్లకూ, యువతకూ ఉపాధి కల్పించే ఉద్దేశంతో గతేడాది 'ప్రవాసి రోజ్‌గార్' ఆప్ తెచ్చాం. దీనిద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. వచ్చే నాలుగైదేళ్లలో 10 కోట్ల మందికి ఉపాధి చూపాలన్నదే మా లక్ష్యం. వైద్య చికిత్సలకు ఇబ్బంది పడేవాళ్లకు ఆర్థికంగా సాయపడేందుకు 'ఇలాజ్ ఇండియా' కార్యక్రమాన్ని ఈ ఫిబ్రవరిలో మొదలుపెట్టాం. దీనిద్వారా ఇప్పటికే వందల మందికి వైద్యం అందించాం.
యువత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటే సమాజంలో మార్పు తేవచ్చనే ఉద్దేశంతో సివిల్స్‌కు సిద్ధమయ్యేవాళ్లకు 'సంభవం' పేరుతో శిక్షణా స్కాలర్‌షిప్‌లు మొదలుపెడుతున్నాం. ఇప్పటికే వీటికోసం లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ శిక్షణ ద్వారా ఏటా 100 మంది అధికారులుగా వచ్చినా ఎంతో మార్పు తేవచ్చు. ముఖ్యంగా అవినీతిని అంతమొందించేందుకు ఇది సాయపడుతుంది. ఎందుకంటే ఇలాంటివారు నీతినిజాయతీలతో పనిచేస్తారనేది నా నమ్మకం. ఇంతమందికి సాయం చేయడానికి నా దగ్గర వనరులు లేవు. నాకు అలాంటి అనుభవమూ లేదు. కానీ సాయం పొందినవారి ముఖాల్లో నవ్వూ, వారి మాటల్లో ఆనందం చూస్తే- ఇంతకు పదింతల సాయం చేయాలన్నంత ఉత్సాహం కలుగుతుంది. సూద్ ఫౌండేషన్ కార్యక్రమాల్ని నా తర్వాత కూడా మా కుటుంబం కొనసాగించేలా చూస్తా.
తెలుగింటి ఆడపడుచు..