హాస్యనటుడు వడివేలు బాలాజీ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. కోలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడివేలు బాలాజీ భౌతికకాయానికి విజయ్ సేతుపతి, రోబో శంకర్, దివ్య దర్శిణి తదితరులు నివాళులర్పించారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు కొంత ఆర్థిక సాయం చేసినట్లు తెలిసింది.
వడివేలు బాలాజీ ఇద్దరు పిల్లల్ని చదివించేందుకు కథానాయకుడు శివ కార్తికేయన్ ముందుకొచ్చారు. ఆయన ఇద్దరు పిల్లల చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని మాటిచ్చారు. దీంతో హీరో మంచితనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
మదురైకి చెందిన బాలాజీ మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. ప్రముఖ హాస్యనటుడు వడివేలు ముఖ ఛాయలతో ఉండటం వల్ల.. ఆయనను అనుకరిస్తూ బుల్లితెరలో పలు కార్యక్రమాలు చేశారు. తద్వారా మంచి గుర్తింపు సాధించారు. అలా 'వడివేలు బాలాజీ'గా మారారు. పలు సినిమాల్లోనూ నటించి, అలరించారు.
15 రోజుల క్రితం వడివేలు బాలాజీకి గుండెపోటు రావడం వల్ల పక్షవాతానికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు. ఆపై ఆర్థిక సమస్య వల్ల ఆయన్ను పలు ఆసుపత్రులకు తిప్పారు. చివరికి ఒమండురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు.
ఇదీ చూడండి నాగ్ చిరునవ్వుల కల.. అమల