"ఓ రోజు 16 పాటలు ఆలపించి అలసిపోయి ఇంటికి వచ్చా. అప్పుడు నన్ను చూసిన అమ్మ ఆరోగ్యం చూసుకోవాలి.. ఇలా చేయకూడదు ఎప్పుడూ అంటూ నాపై కోప్పడింది" అని ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ గాయని చిత్ర. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి, తన మనసులో మాటని పంచుకున్నారామె. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఆలీ అడిగే ప్రతి ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చారు చిత్ర. అన్ని భాషలు కలిపి సుమారు 20 వేల పాటలు పాడినట్లు తెలిపారు.
చిరు, బాలయ్య డైలాగ్స్‌తో అలరించిన గాయని చిత్ర - గాయని చిత్ర 20వేల పాటలు
దాదాపు 20 వేల పాటలకు పైగా పాడి తన గాత్రంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు గాయని చిత్ర. తాజాగా ఆమె ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న 'ఆలీతో సరదాగా' షోకి విచ్చేసి పలు విషయాలు పంచుకున్నారు.
దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వల్ల తెలుగు నేర్చుకున్నానని చెప్పారు చిత్ర. తన పాప పేరు మీద స్థాపించిన ట్రస్ట్ ద్వారా 60 ఏళ్లకు పైబడిన (చూడటానికి ఎవరూ లేని) వారికి పెన్షన్ అందిస్తున్నట్టు వివరించారు. ఓ అరబిక్ గీతం, 'క్రిమినల్'లోని 'తెలుసా మనసా' గీతాన్ని ఆలపించి సందడి చేశారు. పాటలు మాత్రమే కాదు డైలాగులూ చెప్పి వావ్ అనిపించారు. 'చెయ్యి చూడు ఎంత రఫ్‌గా ఉందో, రఫ్పాడించేస్తా', 'ఫ్లూటు జింక ముందు ఊదు సింహం కాదు' వంటి పవర్‌ఫుల్ సంభాణల్ని తనదైన శైలిలో పలికి అలరించారు.
మీ కెరీర్‌లో.. ఒక్క రోజులో అత్యధికంగా ఎన్ని పాటలు పాడారు? అని ఆలీ అడిగ్గా.. '16 పాటలు పాడాను. ఆ రోజు అమ్మ నాపై కోప్పడింది' అని బుదులిచ్చారు చిత్ర. జాతీయ అవార్డు తీసుకునే సమయంలో తన తండ్రి లేకపోవడం చాలా బాధ కలిగించిందని భావోద్వేగానికి గురయ్యారు. పూర్తి కార్యక్రమం ఆగస్టు 2న ప్రసారమవుతుంది. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి.. అన్నట్టు నేడు (జులై 27) చిత్ర పుట్టిన రోజు.