తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అప్పుడు ఫ్యాన్సే అండగా నిలిచారు: హీరో శింబు - simbu movies

'లూప్​' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో శింబు.. చిత్ర విశేషాలను వెల్లడించారు. సరికొత్తగా ఉంటూ వీక్షకుల్ని సీటు అంచున కూర్చోబెడుతుందని అన్నారు.

simbu loop movie
హీరో శింబు

By

Published : Nov 22, 2021, 6:30 AM IST

'మన్మధ', 'వల్లభ' వంటి ప్రేమకథా చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు. ఇటీవలే 'ఈశ్వరుడు'గా సినీప్రియుల ముందుకొచ్చిన ఆయన.. ఇప్పుడు 'లూప్‌'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన చిత్రమిది. కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయిక. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 25న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు శింబు.

ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకలో కంటతడి పెట్టారు. ఎందుకు?

ఆరోజు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం మూడేళ్లుగా చాలా కష్టపడ్డా. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. చిత్రీకరణ ప్రారంభమయ్యాక అనుకోని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. మళ్లీ ఎలాగోలా కష్టపడి చిత్రాన్ని తిరిగి మొదలుపెట్టాం. ఈలోపు కరోనా అడ్డంకులు. విడుదల అనుకున్నాక రకరకాల ఇబ్బందులెదురయ్యాయి. ఇవన్నీ ఆరోజు కళ్ల ముందు మెదిలాయి.

ఫిట్‌గా మారి, లుక్‌ మార్చుకున్నారు.. ఈ సినిమా కోసమేనా?

అలా ఏం లేదు. ఒకానొక దశలో నా కెరీర్‌ చాలా ఇబ్బందుల్లో పడింది. మానసికంగా ఒత్తిడిలోకి వెళ్లిపోయా. బాగా బరువు పెరిగిపోయా. ఆ సమయంలో నా అభిమానులే నాకు అండగా నిలిచారు. వాళ్లే స్ఫూర్తినిచ్చారు. అప్పుడే మానసికంగా, శారీరకంగా నన్ను నేను కొత్తగా మార్చుకోవాలని బలంగా నిర్ణయించుకున్నా. మాంసాహారం, మద్యం అన్ని మానేశాను. క్రమం తప్పకుండా కఠిన కసరత్తులు చేయడం ప్రారంభించాను. ఈ క్రమంలో దాదాపు 27కిలోల బరువు తగ్గి.. ఇప్పుడున్న ఈ లుక్‌లోకి వచ్చా.

లూప్​ సినిమాలో శింబు-ఎస్​జే సూర్య

ఇంతకీ ఈ 'లూప్‌' కథేంటి?

రాజకీయ నేపథ్యంతో ముడిపడి ఉన్న సైన్స్‌ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. టైటిల్‌కు తగ్గట్లుగానే టైమ్‌ లూప్‌ జానర్‌లో సాగుతుంది. ఓ మామూలు కుర్రాడు టైమ్‌ లూప్‌లో ఎలా చిక్కుకున్నాడు? దాని వల్ల అతనెలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది? ఆఖరికి దాని నుంచి ఎలా బయటపడ్డాడన్నది చిత్ర కథాంశం. ఇదంతా ఓ రాజకీయ సమావేశం కేంద్రంగా జరుగుతుంటుంది. మరి ఆ సమావేశానికి.. ఈ కుర్రాడికి సంబంధం ఏంటనేది? తెరపైనే చూడాలి. టైమ్‌ లూప్‌ జానర్‌లో జరిగిందే మళ్లీ మళ్లీ జరుగుతుంటుంది కదా. అలాగని దీంట్లో వచ్చిన సీనే మళ్లీ రిపీట్‌ అవుతున్నా.. ఎక్కడా బోరింగ్‌ అనిపించదు. ప్రతిసారీ ఓ కొత్త అంశం వెలుగులోకి వస్తుంటుంది.

ఇందులో పాత్రలన్నీ ఎలా ఉంటాయి? చిత్రం ఎలా ఉండనుంది?

నేనిందులో అబ్దుల్‌ ఖాలిక్‌ అనే ముస్లిం కుర్రాడిగా కనిపిస్తా. నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించే ధనుష్‌ అనే డీసీపీ అధికారిగా ఎస్‌.జె. సూర్య కనిపిస్తారు. 'ఈగ' సినిమాలో నాని, సుదీప్‌ల మధ్య సాగే పోరు ఎంత ఆసక్తికరంగా ఉంటుందో.. ఇందులో మా ఇద్దరి మధ్య నడిచే పోరు అలాగే ఉంటుంది. దీంట్లో నాకు.. కల్యాణికి మధ్య నడిచే లవ్‌ ట్రాక్‌ చాలా కొత్తగా, విభిన్నంగా ఉంటుంది. ఇది సైంటిఫిక్‌ అంశాలతో ముడిపడి ఉన్న కథాంశమైనా.. వెంకట్‌ ప్రభు సినిమాను అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్‌గా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఛేజింగ్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలేంటి?

ప్రేక్షకుల్ని ఆకర్షించే మంచి కథ ఉండి.. అందులో నా పాత్ర బాగుంటే ఏ భాషలో నటించడానికైనా సిద్ధమే. తెలుగులోనూ తప్పకుండా చేస్తాను. మంచి కథల కోసం చూస్తున్నా. ప్రస్తుతం తమిళంలో గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో 'వెందు తనిందదు కాడు' చిత్రం చేస్తున్నా. ఇది తెలుగులోనూ విడుదలవుతుంది. గౌతమ్‌ కార్తిక్‌తో 'పత్తు తలా' అనే సినిమా చేస్తున్నా. అలాగే 'కరోనా కుమార్‌' అనే మరో చిత్రంలో నటిస్తున్నా. ఇది పూర్తి వినోదాత్మక చిత్రం. గోకుల్‌ తెరకెక్కిస్తున్నారు. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details