అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్‌కుంద్రా సంస్థలో తెరకెక్కిన మూడు సినిమాల్లో నటించిన గహనా వశిష్ఠ్ తాజాగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. శుక్రవారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గహనా.. రాజ్‌కుంద్రాకి మద్దతు తెలుపుతూ మాట్లాడారు.
'అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి కొన్నిరోజుల ముందు నేను కుంద్రా కార్యాలయానికి వెళ్లాను. 'బాలీఫేమ్' పేరుతో కొత్త యాప్‌ని ప్రారంభించాలనే ఆలోచనలో రాజ్ ఉన్నట్లు అక్కడికి వెళ్లాక తెలిసింది. రియాల్టీ షోలు, సెలబ్రిటీ ఛాట్ షోలు, మ్యూజికల్ ప్రోగ్రామ్స్ వంటి నాన్ బోల్డ్ కంటెంట్‌తో ఈ యాప్‌ని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి లీడ్‌గా స్క్రిప్ట్ ఓకే చేశాం. షమితా సైతం నటించడానికి గ్రీన్ సిగ్నలిచ్చింది' అని గహనా వివరించారు.