బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ తన 54వ పుట్టినరోజు వేడుకలను కళాశాల విద్యార్థులతో జరుపుకొన్నాడు. ముంబయి బాంద్రాలోని సెయింట్ ఆండ్రూస్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. వేదికపై అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపాడు బాద్షా. "మీ వల్లే నా పుట్టినరోజు ఇంత ప్రత్యేకంగా మారింది" అని చెప్పాడు.
ప్రతి ఏడాదిలాగే తన పుట్టిన రోజున షారుఖ్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు.. ముంబయిలోని అతడి గృహం మన్నత్ వద్దకు భారీగా అభిమానులు వచ్చారు. చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరిని ఉద్దేశించి కాసేపు మాట్లాడాడు కింగ్ ఖాన్.
ఖలీఫా వద్ద ప్రత్యేక కాంతులు...
ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను షారుఖ్ బర్త్‌డే సందర్భంగా దీపకాంతులతో అలంకరించారు. షారుఖ్ పేరుతో ప్రత్యేకమైన వెలుగులతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది ఎమ్మార్ సంస్థ. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు బాద్షా.
పాపం సల్మాన్ ఫోన్ చేస్తే ఎత్తలేదట..
బాలీవుడ్ సెలబ్రిటీలు, అంతర్జాతీయంగా పాపులర్ అయిన డీజే స్నేక్, మార్ష్‌మెలో.. బాద్షాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా సహనటులు సల్మాన్‌ఖాన్, సోనాక్షి సిన్హా, జాక్వలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా, సోహైలీ ఖాన్, ఆయుష్ శర్మ, మనీష్ పాల్ , షేరా ఓ వీడియో ద్వాారా విషెస్ చెప్పారు. వీరందరూ కలిసి షారుఖ్ సిగ్నేచర్ ఫోజులో ఉండి శుభాకాంక్షలు తెలిపారు. సల్మాన్ షేర్ చేసిన ఈ వీడియో ఆఖరులో ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. "తన ఫోన్ ఎత్తలేదని అందుకే ఇలా చెప్తున్నా" అని అన్నాడు భాయ్‌జాన్.
సామాజిక మాధ్యమాల వేదికగా ఆయుష్మాన్ ఖురానా, కాజోల్, ఆలియా భట్, విక్కీ కౌశల్, హుమా ఖురేషీ, భూషన్ కుమార్, ప్రీతి జింతా, అజయ్ దేవగణ్ షారుఖ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
2018లో 'జీరో' తర్వాత మళ్లీ ఏ సినిమా చేయలేదు షారుఖ్. ఇటీవలే కోలీవుడ్ దర్శకుడు అట్లీతో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.