"ఎప్పుడూ ఒకే తరహా కథలు, పాత్రల్లో నటిస్తుంటే కొన్నాళ్లకు నాకు నేనే బోర్ కొట్టేస్తా. అలా అనిపించకూడదంటే.. కచ్చితంగా భిన్నమైన కథల్నే ఎంచుకోవాలి. ప్రస్తుతం నా లైనప్‌లో ఉన్న కథలన్నీ ఇలాంటివే" అని నటుడు సత్యదేవ్ అన్నారు. వైవిధ్యభరిత కథాంశాలకు చిరునామా ఆయన. ఇప్పుడలాంటి ఓ విభిన్నమైన కథాంశంతోనే 'తిమ్మరుసు'గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శుక్రవారం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సత్యదేవ్.
* సాధారణంగా థ్రిల్లర్ కథలనగానే.. యాక్షన్ డ్రామాలు, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ కథాంశాలు, కాప్ థ్రిల్లర్లు వంటివే కనిపిస్తుంటాయి. ఇది వాటన్నింటికి భిన్నమైన థ్రిల్లర్. ఓ లాయర్ కోణంలో సాగే యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందింది.