Sameera Reddy: సెలబ్రిటీల అఫైర్ల గురించి చాలా వింటుంటాం. ఈ హీరో ఆమెతో రిలేషన్లో ఉన్నాడు.. ఆ భామ ఈ నటుడితో డేటింగ్లో ఉంది.. కలిసి న్యూఇయర్ చేసుకున్నారు, మాల్దీవులకు వెళ్లారు.. అది చేశారు.. ఇది చేశారు.. బ్లాబ్లాబ్లా..! కానీ, ఇలాంటి రూమర్లు వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఎవరూ పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితే నటి సమీరా రెడ్డికి ఎదురైందట. దీంతో తన కెరీర్‌కే గుడ్‌బై చెప్పానని అంటున్నారు సమీర.
2006లో వచ్చిన 'అశోక్' సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటించారు సమీరా రెడ్డి. ఆ సమయంలో వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారంటూ రూమర్లు వచ్చేవి. ఈ వ్యవహారంపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు సమీరా.
"ఎన్టీఆర్‌తో పనిచేయడం చాలా బాగుంటుంది. నాకు చాలా విషయాలు నేర్పించాడు. ఒక తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఏమీ తెలియదు. తారక్ పెద్దగా మాట్లాడేవాడు కాదని అప్పట్లో అంటుండేవారు. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఏదనిపిస్తే అదే మాట్లాడతా. మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. దానిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ వ్యవహారం మా కుటుంబానికి నచ్చలేదు. సినిమాల్లో ఎన్ని బోల్డ్ క్యారెక్టర్లు చేసినా.. మా నాన్నకు వీటన్నింటిపై సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మా బంధువులు కూడా చాలా మంది ఈ విషయమై నాన్నను ప్రశ్నిస్తుండేవారు. తట్టుకోలేకపోయాను. ఈ రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టాలంటే తెలుగు ఇండస్ట్రీని వదిలేయడమే కరెక్ట్ అనిపించింది. అదే పని చేశా. ఆ తర్వాత తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయి."