తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలోనే 'నాలుగో సింహం'గా సాయికుమార్‌ - శశి సినిమా

'చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్‌' ఈ డైలాగ్‌ వినగానే సాయికుమార్‌ మన కళ్లముందు మెదులుతూ ఉంటారు. రజనీకాంత్‌, సుమన్‌, రాజశేఖర్‌ వంటి అగ్రనటులకు తన గొంతును అరువిచ్చి వారి సక్సెస్‌లో భాగమయ్యారు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు, ప్రస్తుతం అద్భుతమైన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ ఉన్నారు. తాజాగా 'శశి' సినిమాతో మంచి టాక్‌ తెచ్చుకున్న తన కుమారుడు, నటుడు ఆదితో కలిసి వచ్చి ఎన్నో విశేషాలు పంచుకున్నారు! అవేంటో చూద్దాం.

saikumar
సాయికుమార్​

By

Published : Mar 21, 2021, 11:12 PM IST

నటుడు డబ్బింగ్​ ఆర్టిస్ట్​ సాయికుమార్​.. 'శశి' సినిమాతో మంచి టాక్‌ తెచ్చుకున్న తన కుమారుడు, నటుడు ఆదితో కలిసి తమకు సంబంధించిన ఎన్నో విశేషాలను పంచుకున్నారు. అవేంటంటే..

సాయికుమార్‌..

'పోలీస్‌ స్టోరీ' విడుదలై 25ఏళ్లు గడిచిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అందరూ అంటున్న పాన్‌ ఇండియా సినిమాను ఆనాడే 'పోలీస్‌ స్టోరీ'తో చేసేశాం. నా కెరీర్‌లో ఆ చిత్రం ఒక మైలురాయి. అంతటి విజయాన్నిచ్చిన కన్నడ చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నా సినీ ప్రస్థానం మొదలై 50 ఏళ్లు దగ్గరపడుతోంది.

సినీ పరిశ్రమకు నాన్న పీజే శర్మ హీరో అవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చారు. ఆయన నాగేశ్వరావుగారికి వీరాభిమాని. కేవలం ఆయన్ను చూసేందుకే జూనియర్‌ ఆర్టిస్టుగా స్టూడియోకు వెళ్లారట. ఆలా తెలుగు సినిమాల్లో మంచి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కాలక్రమేణా బిజీ అయ్యారు. కానీ, ఆయన కోరుకున్నంత బ్రేక్‌ అయితే ఇండస్ట్రీలో లభించలేదు. అందుకే నన్ను కూడా మొదటినుంచీ బాగా చదువుకుని వేరే రంగంలో స్థిరపడమనేవారు. కానీ, అమ్మ ప్రోత్సహిస్తుండేది. చివరికి ఇదిగో ఇలా ఈ స్థాయిలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా.

ఆది కూడా మొదట క్రికెట్‌ను కెరీర్‌ ఎంచుకున్నాడు. ఇందులో నా ప్రోద్బలం కూడా ఉంది. అండర్‌-19 స్థాయిలో ఆంధ్రా తరఫున ఆడాడు. ఆ తర్వాత నటుడు అవ్వాలనుందని చెప్పడంతో కొన్నాళ్లు వైజాగ్‌ వెళ్లి సత్యానంద్‌గారి దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత విజయ్‌భాస్కర్‌.కె డైరెక్షన్‌లో 'ప్రేమ కావాలి' చిత్రం చేశాడు. దాని ప్రారంభోత్సవానికి ఇండస్ట్రీలోని పెద్దలందరూ వచ్చారు. ముఖ్యంగా అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవిగారు ఎంతో ప్రోత్సహించేవారు. అలాగే మా కుటుంబంలో అందరికి నాన్నగారి బేస్‌ వాయిస్‌ వారసత్వంగా రావడం అదృష్టవంతులుగా భావిస్తున్నాం. తమ్ముడు రవిశంకర్‌, అయప్ప కన్నడ చిత్రాల్లో బిజీ నటులు. అలాగే కుమారుడు ఆది తనదైన స్టైల్లో నటిస్తున్నాడు.

అమ్మ గారిది కర్ణాటక- ఆంధ్రా బోర్డర్‌లో ఉన్న బాగేపల్లి. ఆ క్రమంలోనే ఆమె కొన్ని కన్నడ సినిమాల్లో రాజ్‌కుమార్‌ వంటి సూపర్‌స్టార్స్‌ సరసన నటించింది. అలా ఆమె ప్రభావం నాపై ఉండటంతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. కన్నడ ప్రేక్షకులు ఎంతగానో నన్ను ఆదిరిస్తారు. నా మొదటి కన్నడ సినిమాకు డబ్బింగ్‌ వేరేవాళ్లు చెప్పటం విశేషం. ఇప్పుడు నా వాయిస్‌కు ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. కన్నడలో హీరోగా వచ్చినంత బ్రేక్‌ తెలుగులో నాకు దక్కలేదనుకుంటున్నా.

నా కెరీర్‌లో 'పోలీస్‌స్టోరి' తర్వాత ‘ప్రస్థానం’రూపంలో అతిపెద్ద బ్రేక్‌ వచ్చింది. అలాంటి పాత్రలు మరిన్ని చేయాలనుంటుంది. అలాగే కన్నడలో నటించిన 'రంగి తరంగి' సినిమాలో నా పాత్రకు ఎన్నో అవార్డులు వచ్చాయి. అస్కార్‌ నామినేషన్స్‌ వరకు కూడా సినిమా వెళ్లింది. యక్షగాన బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. ఈ సంవత్సరం కన్నడలో నా సినిమాలు 10 విడుదలవుతున్నాయి. తెలుగులో ఇప్పుడు చేసిన 'శ్రీకారం'ఎంతో సంతృప్తినిచ్చింది. త్వరలోనే 'పోలీస్‌ స్టోరీ' సీక్వెల్‌ను 'నాలుగో సింహం' పేరుతో అన్ని భాషల్లో అదే టీమ్‌తో నిర్మించబోతున్నాం.

తెలుగులో వచ్చిన 'పటాస్‌' సినిమా కన్నడ రీమేక్‌ ద్వారా ఆదిని శాండల్‌వుడ్‌కి పరిచయం చేద్దామనుకున్నా. కానీ మొదటి సినిమానే పోలీస్‌ పాత్రలో నటించడం అంత సూట్‌ కాదమోనని ఆదినే వెనక్కి తగ్గాడు. లేకుంటే ఒక మంచి గ్రాండ్‌ ఎంట్రీ అక్కడ దక్కేదేమో అని భావిస్తుంటా.

ఇక నా రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే వెంకయ్యనాయుడి గారి ఆశీస్సులతో భాజపాలో చేరాను. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తరుఫున స్టార్‌ క్యాంపెనర్‌గా తిరిగాను. అమ్మకోరిక మేరకు 2008లో బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కొద్దిలో ఓటమి పాలయ్యా. ఆ తర్వాత పిల్లల కెరీర్‌ దృష్టిలో పడి ఆ నియోజకవర్గానికి దూరమయ్యా. మోదీగారితో అప్పట్లో సన్నిహిత సంబంధాలుండేవి.

ఆది:

మా 'శశి' చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో గాఢతతో కూడిన లవ్‌స్టోరి. 'ఒకే ఒక లోకం నువ్వే..' పాట ప్రేక్షకుల్లోకి బలంగా చొచ్చుకుపోయింది. సినిమాలో ఆ సాంగ్‌ వచ్చే సన్నివేశం కూడా ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

తాత, నాన్న నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచీ ఇంట్లో సినీ వాతావరణం ఉండటంతో సినిమాలపై క్రమంగా ఆసక్తి పెరిగింది. నా మొదటి సినిమా 'ప్రేమ కావాలి' చిత్రం డైరెక్టర్‌ విజయ్‌భాస్కర్‌ గారితో ఎంతో సౌకర్యవంతంగా అనిపించేది. ఆయన అన్ని విషయాలు ఎంతో కూలంకషంగా వివరించేవారు. ఆయనే నా తొలిగురువు. అలాగే కెమెరామెన్‌ ఛోటా కె. నాయుడు ఎంతో సహకరించేవారు.

నేను కొత్తదర్శకులతో చేసేటప్పుడు వాళ్లు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో గమనిస్తాను. వాళ్ల నెరేషన్‌ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది. కథ తెరపై ఎలా వస్తుందో. 'శశి' సినిమాకు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ నాయుడు నాకు కథ చెప్పేనాటికే ఐదు సాంగ్స్‌ రికార్డు చేసుకుని తీసుకొచ్చాడు. అన్ని పాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే నాన్నగారితో కలిసి నటించడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను. ఒక పొలిటికల్‌ డ్రామా ఉన్న సినిమాల్లో నటించాలని ఉంది.

నాన్నగారు నటించిన 'పోలీస్‌ స్టోరి', 'ప్రస్థానం' సినిమాలతో పాటు 'లా అండ్‌ ఆర్డర్‌' 'ఏకే 47' చిత్రాలు నాకెంతో ఇష్టం. ప్రస్తుతం ఓటీటీలో చేసే ఉద్దేశం లేదు. విఘ్నేష్‌, నారాయణ్‌ అనే కొత్త దర్శకులతో ఒక సినిమా చేస్తున్నా. అది నాలుగు పార్ట్స్‌లో ఉండొచ్చు. అలాగే 'బ్లాక్‌' అనే చిత్రంలో నటిస్తున్నా.

ABOUT THE AUTHOR

...view details