చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల మేనల్లుడిగా తెలుగు తెరకు పరిచయమైన నటుడు సాయిధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వస్తున్నాడంటే ఎన్నో అంచనాలుంటాయి. అందుకనుగుణంగానే కష్టపడుతున్నాడు తేజ్. ప్రతి సినిమాకు భిన్నత్వం చూపిస్తూ వస్తున్నాడు. ఆ దారిలో కొన్ని పరాజయాలు ఎదురైనా దిగ్విజయంగా ముందుకెళ్తున్న ఈ మెగా మేనల్లుడి పుట్టినరోజు ఈరోజు.
1986 అక్టోబరు 15న హైదరాబాద్‌లో జన్మించాడు. తండ్రి శివప్రసాద్, తల్లి విజయదుర్గ (చిరంజీవి చెల్లెలు). ఈ మెగాహీరో సినీ కెరీర్ ప్రారంభమే విచిత్రంగా మొదలైంది. 'రేయ్'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. రెండవ చిత్రం 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతోనే తొలిసారి వెండితెరపై సందడి చేశాడు. ఇక 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీం' సినిమాలతో ఆ జోరును కొనసాగించాడు.
ఫ్లాప్‌ల బాటలో
అనంతరం వచ్చిన 'తిక్క', 'విన్నర్', 'నక్షత్రం' అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయే తప్ప సాయిధరమ్ తేజ్ కెరీర్‌కు ఏవిధంగా సహాయపడలేకపోయాయి. 2017 చివర్లో వచ్చిన 'జవాన్' ఫర్వాలేదనిపించినా సరైన విజయాన్ని ఇవ్వలేదు. తర్వాత మళ్లీ ఫ్లాప్ బాట పట్టాడు. 'ఇంటెలిజెంట్', 'తేజ్ ఐ లవ్ యూ' సినిమాలూ నిరాశాజనక ఫలితాన్నే ఇచ్చాయి.