తనకోసం ఎవరూ సాహసాలు చేయవద్దని నటి రష్మిక తన అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఇటీవల త్రిపాఠి అనే అభిమాని రష్మికను కలిసేందుకు దాదాపు 900కిలోమీటర్లు ప్రయాణించాడు. తెలంగాణ నుంచి కర్ణాటకలోని రష్మిక స్వస్థలం కొడగుకు చేరుకున్నాడు. గూగుల్ మ్యాప్ ద్వారా ఆమె ఇంటికి వెళ్లి ఆరా తీయగా.. రష్మిక అక్కడ లేదని, ముంబయిలో ఉంటోందని తెలిసింది. దీంతో అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగాడు. కాగా.. ఈ వార్త మీడియాలో వైరల్‌గా మారింది. తిరిగితిరిగి చివరకు రష్మికను చేరింది. ఈ సంఘటనపై స్పందించిన రష్మిక తన అభిమానిని కలుసుకోలేకపోయినందుకు విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి సాహసాలు ఎవరూ చేయవద్దని కోరింది.
"ఒక వీరాభిమాని నన్ను కలిసేందుకు చాలాదూరం ప్రయాణించి కర్ణాటకలోని మా ఇంటికి వెళ్లినట్లు నాకు ఇప్పుడే తెలిసింది. దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చేయకండి. ఆ అభిమానిని కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఏదో ఒకరోజు కచ్చితంగా కలుస్తానన్న నమ్మకం ఉంది. ప్రస్తుతానికి మీ ప్రేమాభిమానాలు నాపై ఉంచండి. అప్పుడే నేను సంతోషంగా ఉంటా" అని రష్మిక ట్వీట్ చేసింది.