తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చంటి' ఆ హీరోతో తీద్దామనుకున్నారట.. కానీ!

వెంకటేశ్​, మీనా హీరోహీరోయిన్లుగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'చంటి'. ఇందులో చంటి పాత్రలో నటించిన వెంకటేశ్​.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ పాత్ర వెంకటేశ్​ చేయాల్సింది కాదట. సినిమా ప్రారంభానికి ముందు ఆ కథానాయకుడిని కాదని వెంకటేశ్​తో రూపొందించారట.

Rajendra Prasad has to act as a hero in the movie Chanti!
'చంటి' ఆ హీరోతో తీద్దామనుకున్నారట.. కానీ!

By

Published : Jan 11, 2021, 10:33 AM IST

విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'చంటి'. మీనా, నాజర్‌, సుజాత, మంజుల, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విడుదలై ఇటీవలే 29ఏళ్లు పూర్తి చేసుకుంది. తమిళంలో ఘన విజయం సాధించిన 'చినతంబి'ని తెలుగులో 'చంటి'గా రీమేక్​ చేశారు నిర్మాత కె.ఎస్‌.రామారావు. అమాయకుడైన పల్లెటూరి యువకుడి పాత్రలో వెంకటేశ్‌ నటన అందరినీ మెప్పించింది.

తొలుత ఈ సినిమాలో కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్‌ అనుకున్నారట. అయితే, వెంకటేశ్‌తో సినిమా చేయడానికి గల కారణాన్ని దర్శకుడు రవిరాజా ఓ సందర్భంలో పంచుకున్నారు.

వెంకటేశ్​

"యార్లగడ్డ సురేందర్‌ నిర్మాతగా వెంకటేశ్‌తో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాం. అప్పుడు రామానాయుడు తమిళంలో తెరకెక్కిన 'చినతంబి' చూశారు. వెంకటేశ్‌ ఆ కథకు సరిపోరని అనుకున్నారు. ఆ తర్వాత కె.ఎస్‌.రామారావు కూడా ఆ సినిమా చూశారు. ఆయనకు నచ్చింది. 'చంటి' పాత్రకు రాజేంద్రప్రసాద్‌ సరిపోతారని ఆయన భావించారు. ఇదే విషయాన్ని రాజేంద్రప్రసాద్‌కూ చెప్పారు. నేను దర్శకుడిగా సినిమాను కూడా ప్రకటించారు. రాజేంద్రప్రసాద్‌తో నాకున్న పరిచయాన్ని బట్టి ప్రాజెక్టు బాగానే వస్తుందని అనుకున్నాం. ఇదంతా తమిళ 'చినతంబి' విడుదలకాక ముందు జరిగింది. అక్కడ ఆ సినిమా విడుదలవడం, బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించడం జరిగిపోయింది. సురేశ్‌బాబు, వెంకటేశ్‌ ఇద్దరికీ ఆ సినిమా నచ్చింది. దీంతో కె.ఎస్‌.రామారావు దగ్గరకు వచ్చి, వెంకటేశ్‌తో సినిమా చేయమని అడిగారు. అందుకు నేను అంగీకరించలేదు. అవసరమైతే ప్రాజెక్టు నుంచి తప్పుకొందామని అనుకున్నా. ఎందుకంటే రాజేంద్రప్రసాద్‌కు అప్పటికే మాట ఇచ్చి ఉండటం వల్ల అది నాకు సరైన పద్ధతి కాదనిపించింది. ఆ సమయంలో చిరంజీవి నన్ను ఒప్పించారు. అయితే, తమిళంలో నటించిన ఖుష్బూ ఈసారి తెలుగులో వెంకటేశ్‌తో చేసేందుకు అంగీకరించలేదు. దీంతో మీనాను తీసుకున్నాం."

- రవిరాజా పినిశెట్టి, దర్శకుడు

అసలు కథేంటి

ఒక గ్రామంలోని జమీందారు కుటుంబంలో పుడుతుంది నందిని(మీనా). ఆమెకు ముగ్గురు అన్నయ్యలు (నాజర్‌, ప్రసన్న కుమార్‌, వినోద్‌). చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతుంది. దీంతో ఆమె అన్నయ్యలు ఎంతో గారాబంగా పెంచుతారు. తమ చెల్లెలు కోరుకున్నది ఏదైనా తెచ్చి ఇస్తారు. అయితే, నందిని వివాహం ఆమె అన్నదమ్ములకు నచ్చిన వ్యక్తితో కాకుండా, ఆమెకు నచ్చిన వ్యక్తితో జరుగుతుందని జాతకంలో చెబుతారు. దీంతో నందిని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంచి పెంచుతారు. చుట్టూ అంగరక్షకులను ఏర్పాటు చేస్తారు. అదే ఊళ్లో పుట్టిన చంటి (వెంకటేశ్‌) అమాయకుడు. తల్లే తనకు లోకం. పాటలు బాగా పాడతాడు. ఒకరోజు నందిని అంగరక్షకులతో గొడవ పడతాడు చంటి. వాళ్లను చావగొడతాడు. ఈ విషయం తెలిసి, నందిని అన్నయ్యలు అతన్నే అంగరక్షకుడిగా నియమిస్తారు. అలా జమీందారు ఇంటికి చేరిన చంటిపై నందిని ప్రేమ పెంచుకుంటుంది. మరి చంటి-నందిని ప్రేమ ఏమైంది? పెళ్లికి దారితీసిందా? అసలే కోపిస్టులైన నందిని అన్నయ్యలు చంటిని ఏం చేశారన్నదే కథ.

'చంటి' సినిమాలో వెంకటేశ్​, మీనా

1992 జనవరి 10న విడుదలైన 'చంటి' అన్ని కేంద్రాల్లోనూ విజయ ఢంకా మోగించింది. ఇళయరాజా సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. 'అన్నుల మిన్నల.. అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే', 'జాబిలికి.. వెన్నెలకి', 'ఎన్నెన్నో అందాలు', 'పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఈ పాడు లోకం' వంటి పాటలు అలరించాయి. 40 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని అప్పట్లో రికార్డు సృష్టించింది చంటి. కన్నడలో 'రామాచారి'గా, హిందీలో 'అనారి'గా విడుదలైంది. హిందీలోనూ చంటి పాత్రను వెంకటేశ్‌ చేయడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details