ప్రేమకథలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఇద్దరు ప్రేమించుకోవడం.. ఆ ప్రేమకు అవరోధాలు రావడం.. వాటిని ఎదుర్కొని విజయం సాధించడం. వీటినే కాస్త అటూ ఇటూ చేసి చూపిస్తుంటారు. ఈ కథని ఎవరు ఎంత కొత్తగా చెబితే.. అంతగా విజయం సాధిస్తారు. 'రాజావారు - రాణిగారు' కూడా ప్రేమకథే. ఇదీ పాత కథే. కానీ కొత్తగా చెప్పడానికి ప్రయత్నించలేదు. ప్రేమలో ఉన్న నిజాయతీనీ, స్వచ్ఛతనీ నూటికి నూరు శాతం తెరపై ఆవిష్కరించాలని మాత్రం చూశారు. మరి ఆ ప్రయత్నం నెరవేరిందా? రాజా - రాణీల ప్రేమకథ సుఖాంతమైందా, లేదా.. చూద్దాం.
కథేంటంటే
అది రామాపురం అనే పల్లెటూరు. రాజా (కిరణ్)కు రాణీ (రహస్య గోరక్) అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి తన వెంటే తిరుగుతుంటాడు. కానీ మనసులో మాట చెప్పలేడు. రాణీ పై చదువుల కోసం అమ్మమ్మవాళ్ల ఊరు వెళ్లిపోతుంది. తన కోసం ఎదురుచూస్తూ రామాపూరంలోనే గడిపేస్తుంటాడు రాజా. మూడేళ్ల తర‌్వాత మళ్లీ సొంత ఊరు తిరిగొస్తుంది. వచ్చిన తర్వాతైనా రాజా.. తన మనసులో మాట రాణీకి చెప్పాడా లేదా? అనేదే 'రాజావారు - రాణీగారు' సినిమా.
ఎలా ఉందంటే
కథగా చెప్పుకోవాలంటే చాలా చిన్న లైన్. మనసులోని మాట చెప్పుకోలేని ఓ ప్రేమికుడి కథ. అంతే. కానీ దాన్ని తెరపై వినోదాత్మకంగా, భావోద్వేగభరితంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం, వాటిని నడిపించిన పద్ధతి.. వినోదాన్ని పండిస్తాయి. కథలో పెద్దగా మలుపులు లేకపోయినా.. కథ ఒకచోటే తిరిగినా.. అదేం పెద్ద సమస్యగా మారలేదు. చౌదరి, నాయుడు అనే ఇద్దరు స్నేహితుల్ని ఈ కథలోకి లాక్కొచ్చి దర్శకుడు మంచి పని చేశాడు. వాళ్లతో కావల్సినంత వినోదం పండించాడు. పల్లెటూరులో కనిపించే సంగతులు, వాళ్ల మధ్య సంభాషణలూ అచ్చుగుద్దినట్టు తెరపైకి తీసుకొచ్చేశాడు. ప్రథమార్ధం హాయిగా సాగిపోతుంది. అయితే కథ ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. ద్వితీయార్ధం కూడా అంతే. కాకపోతే తొలి సగంలో పండిన వినోదం మాయం అయ్యింది. కథంతా ఒకే పాయింట్ చుట్టూ తిరగడం ఓ ప్రతికూలాంశంగా కనిపిస్తుంది. సన్నివేశాలు నత్తనడక అందుకుంటాయి. అయితే పతాక సన్నివేశాల్లో మళ్లీ దర్శకుడు కాస్త ట్రాక్‌పైకి వచ్చాడు. ఓ మంచి ఫీల్ గుడ్ ఎమోషన్‌తో సినిమాని ముగించాడు. చిన్న లైన్ అనుకుని, ఆ లైన్‌ని దాటకుండా కథని చెప్పడం, పాత్రల్ని నడిపించడం మామూలు విషయం కాదు. స్టార్లు లేకుండా రెండు గంటల పాటు కూర్చోబెట్టాడంటే దర్శకుడిలో విషయం ఉన్నట్టే.
ఎవరెలా చేశారంటే
కిరణ్, రహస్య గోరక్‌లకు ఇదే తొలి సినిమా. కిరణ్ బాగా నటించాడు. పల్లెటూరి అబ్బాయి పాత్రలో ఇమిడిపోయాడు. తన మనసులోని మాట చెప్పుకోలేక, లోపల దాచుకోలేక మధన పడే పాత్రలో మంచి మార్కులు కొట్టేస్తాడు. రహస్య ఓకే అనిపిస్తుంది. కథానాయికలో గ్లామర్ కంటే, పల్లెటూరి స్వచ్ఛతకే దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చినట్టున్నాడు. కథానాయకుడి స్నేహితులుగా కనిపించినవాళ్లు, డాక్టరు అల్లుడు, హీరో, హీరోయిన్ తండ్రి పాత్రధారులూ.. ఇలా అందరూ బాగా చేశారు. ముఖ్యంగా నాయుడు, చౌదరిలుగా కనిపించిన స్నేహితులిద్దరూ కావల్సినంత టైమ్ పాస్ అందిస్తారు. నేపథ్య సంగీతం, పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సంగీతం సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. దర్శకుడు నేల విడచి సాము చేయలేదు. నేలపైనే ఉండి ఓ కథ చెప్పాడు. ప్రేమలోని స్వచ్ఛత పంచాడు. అక్కడే మార్కులు పడిపోతాయి.