దేన్నైనా మార్చొచ్చు, కానీ ఆకాశం రంగు ఎలా మార్చగలరు అని సందేహం వస్తుంది కదూ! నిజ జీవితంలో అసాధ్యం అయినా.. కెమెరా, గ్రాఫిక్స్‌లతో సినిమాల్లో సుసాధ్యం చేయొచ్చు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. తను తెరకెక్కించిన ఓ సినిమాలోని సన్నివేశం కోసం ఆకాశం రంగు మార్చి అప్పట్లో సాహసమే చేశారు.
చంద్రమోహన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో రాఘవేంద్రరావురూపొందించినచిత్రం 'పదహారేళ్ల వయసు'. ఓ తమిళ సినిమాకు రీమేక్ ఇది. అందులో క్లైమాక్స్‌లో కథానాయిక హీరో కోసం వేచి చూస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేక్షకుడికి అతను ఆమె కోసం వస్తాడా, రాడా? అనే ప్రశ్న వస్తుంది. మాతృకలో సమాధానం ఇవ్వకుండా అయోమయానికి గురిచేశాడు దర్శకుడు భారతీరాజా.
తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆ సందేహం మిగల్చకుండా హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని భావించారట రాఘవేంద్రరావు. ఇందు కోసం క్లైమాక్స్‌ను కొంచెం మార్చారు. శ్రీదేవి, జైలుకెళ్లిన చంద్రమోహన్ కోసం రైల్వే స్టేషన్‌లో ఎదురు చూసి ఎంతకీ రాకపోవడం వల్ల బాధతో తిరిగి వెళ్లిపోతుంటుంది. అదే సమయంలో ఎదురుపడిన చంద్రమోహన్.. తన మెడలో తాళి కడతాడు. ఇలాంటి అద్భుత సన్నివేశాన్ని సాధారణంగా చూపిస్తే బాగుండదని భావించిన రాఘవేంద్రరావు కెమెరామెన్ ప్రకాష్‌కు, చంద్రమోహన్ తాళి కడుతున్నప్పుడు ఆకాశం రంగులు మారినట్టు చూపించమని చెప్పారట.
"ఆకాశం రంగులు మారదు, దాన్ని ఎలా చూపిస్తాం? అని ప్రకాష్ చెప్పినా వినకుండా బలవంతంగా ఆయనతో అలా చేయించాను. అందుకే హీరో హీరోయిన్ మెడలో తాళి కడతున్నప్పుడు ఆకాశం రంగు మారడం, దానికి నేపథ్య సంగీతం తోడైన కారణంగా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు" అని ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు చెప్పారు.
ఇవీ చూడండి.. మండే సూర్యుడిలా వచ్చిన బాలయ్య