"అది కల.. నిద్రలో కనేది!! ఇది కళ.. నిద్రలేపేది!! కళంటే బతుకునిచ్చేది కాదు.. బతుకు నేర్పేది" 'కృష్ణంవందే జగద్గురుమ్'లో కోట శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్ ఇది. జనంలో స్ఫూర్తిని రగలించి, చైతన్యపరచడంలో కళాకారుల పాత్ర మరువలేనిది. పీడిత, బాధిత, అణగారిన వర్గాలను మేలుకొలిపి, వారిని చైతన్యవంతం చేసే క్రమంలో ఎందరో దర్శకనిర్మాతలు అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. టి.కృష్ణ, ఆర్.నారాయణమూర్తి, దాసరి నారాయణరావు, పరుచూరి బ్రదర్స్ వంటి దిగ్గజాలు లాభాపేక్షలేకుండా విప్లవ సినిమాలు రూపొందిస్తే, ఆ తర్వాత వచ్చిన పలువురు దర్శకులు కమర్షియల్ హంగులు జోడిస్తూనే సందేశాలిచ్చారు. త్వరలో కొన్ని సినిమాలు తెరపై విప్లవ శంఖాన్ని పూరించడానికి సిద్ధమవుతున్నాయి.. ఆ చిత్రాలేంటో చూసేయండి.
విప్లవ పోరాటమే 'విరాట పర్వం'
టైటిల్‌లో అజ్ఞాతం కనిపిస్తోంది. సాధారణంగా మారు పేర్లతో అడువుల్లో తిరుగుతూ అవకాశం వచ్చినప్పుడు వాళ్లు కోరుకునే మార్పు కోసం ప్రయత్నిస్తుంటారు నక్సలైట్లు/మావోయిస్టులు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం ప్రభావం 90వ దశకంలో బాగా ఉండేది. ఇప్పుడు దాన్నే చూపించబోతున్నారు దర్శకుడు వేణు ఊడుగుల. రానా, సాయిపల్లవి, నందితాదాస్, ప్రియమణి కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'విరాటపర్వం'. ఇందులో రానా కామ్రేడ్ రవన్న పాత్రలో నటిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సమాజంలో చదువు పేరుతో యువత ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను 'నీది నాది ఒకే కథ' అంటూ చూపించాడు వేణు ఊడుగుల. ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'కోలు కోలు' సాంగ్ ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకుంటోంది.
'ఆచార్య' పాఠాలు
వరుస సినిమాలతో మంచి జోష్ మీదున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. రామ్‌చరణ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దేవాదాయశాఖలో జరుగుతున్న అవినీతిని ఎదిరించే పాత్రలో చిరు 'ఆచార్య'గా పాఠాలతో పాటు, గుణపాఠాలు చెప్పడానికీ సిద్ధమంటున్నారు. ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరిచింది. ఇక ఇందులో కామ్రేడ్ 'సిద్ధ'పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. తండ్రీ-కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలను ఇటీవలే మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరరించారు. చిరు యాక్షన్ సన్నివేశాలతో పాటు, రామ్‌చరణ్‌తో కలిసి నటించిన సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే తళుక్కున మెరవనున్నారు. మణిశర్మ అందిస్తున్న సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళుతుందనడంలో సందేహం లేదు.
రానా 'అరణ్య'
మొదటి నుంచి మాస్, కమర్షియల్ కథల జోలికి పోకుండా విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్న నటుడు రానా. ఆయన కీలక పాత్రలో ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అరణ్య'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అడవులపై అక్రమార్కుల కన్ను పడటం, అందులో నివసించే జంతువులు ముఖ్యంగా ఏనుగుల మనుగడకు నష్టం వాటిల్లటం వంటి విషయాలను సినిమాలో ప్రస్తావిస్తున్నట్లు తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అడవులను కాపాడుకోలేకపోతే మానవ జాతి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందనే అంశాన్ని కూడా ఇందులో స్పృశించినట్లు తెలుస్తోంది. జోయా హుస్సేన్ మావోయిస్టు పాత్రలో నటిస్తుండటం వల్ల ఈ చిత్రంలో కొంత పార్ట్ విప్లవ నేపథ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. స్వార్థ రాజకీయ నాయకుల కుయుక్తులను తిప్పికొట్టే సాయుధ దళాన్ని ఇందులో పరిచయం చేయబోతున్నారు.
ఇలా ఇటీవల కాలంలో వచ్చిన 'దళం', 'జార్జిరెడ్డి', 'స్టోరీ ఆఫ్ భీమాల్' కూడా విప్లవ నేపథ్యంతో ప్రేక్షకులను తమదైన శైలిలో అలరించాయి. త్వరలో రాబోతున్న ఈ సినిమాలు కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంటే మరిన్ని ఈ బ్యాక్‌డ్రాప్‌లో మరిన్ని సినిమాలు ఆకట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.