R Ashwin vs Steve Smith: గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బయట పెట్టాడు. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ని ఔట్ చేసేందుకు ఆరు నెలలు రీసెర్చ్ చేశానని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా గత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలిసారిగా టెస్టు సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆ సిరీస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అశ్విన్ ఇటీవల ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
"ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఆరు నెలలుగా స్టీవ్ స్మిత్ పైనే పూర్తిగా దృష్టి సారించా. అంతకుముందు అతడు ఆడిన మ్యాచుల ఫుటేజీలు చూసి.. బ్యాటింగ్ శైలిని గమనించాను. అతడి ఆలోచన విధానాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. స్మిత్ బ్యాటింగ్ ఎక్కువగా హ్యాండ్ మూవ్‌మెంట్‌పైనే ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేయగలిగితే పై చేయి సాధించినట్లే. ఈ ట్రిక్ ఆధారంగానే వైవిధ్యమైన బంతులేసి అతడిని ఔట్ చేయగలిగాను. అలాగే, ఆసీస్‌కు చెందిన మరో ఆటగాడు మార్నస్ లబూషేన్‌ను ఔట్ చేసేందుకు కూడా ప్రత్యేక వ్యూహాలు రచించాను. ఫీల్డ్‌లో వాటిని అమలు చేసి ఫలితం రాబట్టాను."
-రవి అశ్విన్, టీమ్ఇండియా స్పిన్నర్