తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ కీలక ప్రకటన తర్వాత విష్ణు ఏం చేయనున్నారు?

సిని'మా' బిడ్డలం ప్యానెల్‌ నుంచి గెలిచిన వాళ్లందరూ రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి గెలుపొందిన వారు రాజీనామా చేయడం వల్ల తర్వాత ఏం జరుగుతుంది? అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? అనే విషయాలను తెలుసుకుందాం.

prakash raj panel members resign now which option will manchu vishnu take
ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ కీలక ప్రకటన తర్వాత విష్ణు ఏం చేయనున్నారు?

By

Published : Oct 12, 2021, 10:01 PM IST

భవిష్యత్‌లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)లో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగడానికి తమ ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. చిత్ర పరిశ్రమతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో 'మా' ఎన్నికలు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. 'మా' మాజీ అధ్యక్షుడు నరేశ్‌ వ్యవహారశైలి కారణంగా తాము అసోసియేషన్‌లో కొనసాగలేమని ప్యానెల్‌ సభ్యులు తెలిపారు. ఇక పోలింగ్‌, కౌంటింగ్‌ సందర్భంగా మోహన్‌బాబు వ్యవహరించిన తీరునూ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ తీవ్రంగా ఖండించింది.

మోహన్‌బాబు వాడిన భాష సరిగా లేదని, బెనర్జీ కన్నీటి పర్యంతమవగా, తనీశ్‌ భావోద్వేగానికి గురయ్యారు. భయపడుతూ 'మా'లో కొనసాగలేమని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి గెలుపొందిన వారు రాజీనామా చేయడం వల్ల తర్వాత ఏం జరుగుతుంది? అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు?

విష్ణు ఏం చేయబోతున్నారు!

'మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే మంచు విష్ణు ముందు అనేక సవాళ్లు వచ్చి పడ్డాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నేరవేర్చడం సంగతి పక్కన పెడితే, ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి గెలిచి రాజీనామా చేసిన వారి స్థానాలను భర్తీ చేయడం ముందున్న సవాల్‌. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ముందు రెండు ఆప్షన్స్‌ ఉన్నాయి. 1)11 మంది రాజీనామాలను ఆమోదించటం.. 2)వారి స్థానంలో కొత్త వారిని నియమించటం. ఒకరో ఇద్దరో రాజీనామా చేస్తే బుజ్జగించే బాధ్యతను తీసుకోవచ్చు. వాళ్లను ప్రత్యేకంగా చూడవచ్చు. కానీ, ఇక్కడ మూకుమ్మడి రాజీనామాలు చేయడం వల్ల మంచు విష్ణుకు ఆ ఆప్షన్‌ లేకుండా పోయింది. ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ వెనకడుగు వేయదన్నది సినీ వర్గాల మాట. అలాంటి పరిస్థితుల్లో కొత్త వారిని నియమించటమే విష్ణు ముందున్న ఏకైక మార్గం.

కొత్త వారిని నియమించటం సాధ్యమేనా?

'మా' అసోసియేషన్‌లో ఒక పదవిలో కొనసాగుతున్న వ్యక్తి స్థానం ఖాళీ అయితే, దాన్ని భర్తీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంది. 'మా' బై లా రూల్‌ పొజిషన్‌ 17 ప్రకారం.. 'మా'లో ఎవరైనా సభ్యుడి పోస్ట్‌కు ఖాళీ ఏర్పడితే, అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయం తీసుకుని దాన్ని భర్తీ చేస్తారు. ఆ పదవికి మరొక వ్యక్తిని నామినేట్‌ చేస్తారు. అయితే, ఆ నియామకం తర్వాత జరిగే జనరల్‌ బాడీ మీటింగ్‌లో సభ్యుల అనుమతి కచ్చితంగా తీసుకోవాలి.

అదే విధంగా ఏడాదికొకసారి జరిగే సర్వసభ్య సమావేశంలోనూ ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేసిన శ్రీకాంత్‌ స్థానంలో విష్ణు ప్యానెల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాబూమోహన్‌ను నామినేట్‌ చేయవచ్చు. ఇలా ప్రతి పోస్టు ఒక వ్యక్తిని నామినేట్‌ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంది.

రాజీనామా నిర్ణయం సరైనదేనా?

సాధారణ ఎన్నికలతో పోలిస్తే, 'మా' అసోసియేషన్‌కు జరిగే ఎన్నికలు కాస్త భిన్నమైనవి. అభ్యర్థులు వేర్వేరు ప్యానెల్స్‌ నుంచి పోటీ చేసినా, గెలిచిన వారందరూ కలిసి ఒకే ప్యానెల్‌గా ఏర్పడతారు. గతంలో అన్నీ ఏకగ్రీవాలు కావడం వల్ల సభ్యుల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. శివాజీరాజా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత నరేశ్‌ అధ్యక్షుడైన తర్వాత కూడా అభిప్రాయ భేదాలతో రచ్చకెక్కారు. వివాదాలతో ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. డైరీ విడుదల వేడుక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భవిష్యత్‌లో ఇదే సమస్య ఉత్పన్నమవుతుందని ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి గెలిచిన సభ్యులు ఆరోపిస్తున్నారు. తమను పని చేయనీయకుండా చేశారని నరేశ్‌ ఏవిధంగా చెబుతున్నారో మంచు విష్ణు కూడా అలాగే చెప్పే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. మరి ఓట్లు వేసి గెలిపించిన వారికి ఏం సమాధానం చెబుతారు? 'మా' సభ్యుల సంక్షేమాన్ని పక్కన పెట్టి గొడవలు పడటం కన్నా, బయటకు రావటమే మంచి నిర్ణయమని కొందరు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

సాధారణ ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి గెలిచి, అధికారం కోసం మరో పార్టీలో చేరే వారితో పోలిస్తే, ఇలా రాజీనామా చేయడం ఉత్తమమని అంటున్నారు. వాదోపవాదాలకు తావు లేకుండా అధ్యక్షుడు వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, అది 'మా' సభ్యులకు మంచి జరుగుతుందని చెబుతున్నారు. అయితే, ఏదో చేస్తారని నమ్మి ఓటేసి గెలిపించిన వారి ఆశలను అడియాసలు చేస్తూ రాజీనామా చేయటం కూడా సరైన నిర్ణయం కాదని మరికొందరు భావిస్తున్నారు. బయటకు రావటం కన్నా అసోసియేషన్‌లోనే ఉండి, అధ్యక్షుడిగా మంచు విష్ణు తీసుకునే ఏక పక్ష నిర్ణయాలను ప్రశ్నించి ఉంటే 'మా' కార్యకలాపాల్లో పారదర్శకత ఉండేదని అంటున్నారు. అసలు 'మా' ఎన్నికల్లో పోటీ లేకుండా పదవులన్నీ ఏకగ్రీవమైతే ఇన్ని గొడవలు, వివాదాలు జరిగి ఉండేవి కాదని చిత్ర పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ దిశగా సినీ పెద్దలు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పరిస్థితి చేయిదాటిపోయిందని, చివరకు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు స్థాయికి చేరిందని చెబుతున్నారు.

ఇదీ చూడండి..కొత్త అసోసియేషన్​ 'ఆత్మ' ఏర్పాటుపై ప్రకాశ్​ రాజ్​ స్పష్టత

ABOUT THE AUTHOR

...view details