తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నువ్వు నర్తిస్తే  దేశమంతా కాలు కదుపుతుంది! - టాలీవుడ్​

చికుబుకురైలే అంటూ చిందేయించాడు.. ఊర్వశీ.. ఊర్వశీ అంటూ కుర్రకారును ఊహల్లోకి తీసుకెళ్లాడు.. ముక్కాలా ముక్కాబులా అంటూ మంత్రముగ్దుల్ని చేశాడు. అతడే ప్రభుదేవా. దక్షిణాదిన కొరియోగ్రాఫర్​గా కెరీర్ మొదలు పెట్టి బాలీవుడ్ అగ్రదర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. నేడు అతడి పుట్టిన రోజు.

నువ్వు నర్తిస్తే  దేశమంతా కాలు కదుపుతుంది!

By

Published : Apr 3, 2019, 6:19 AM IST

తండ్రి ప్రముఖ కొరియోగ్రాఫర్... అయినా సాధారణ డ్యాన్సర్​గా కెరీర్ మొదలుపెట్టాడు... శ్రమించి కొరియోగ్రాఫర్​​ అయ్యాడు... ఉన్నట్టుండి కథానాయకుడయ్యాడు.. అనూహ్యంగా దర్శకుడయ్యాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది అతడు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా అని. నేడు అతడి 47వ పుట్టిన రోజు. డ్యాన్సర్​ నుంచి దర్శకుడి వరకు ప్రభుదేవా ప్రస్థానం ఇప్పుడు చూద్దాం!

  • జననం..

ప్రభుదేవా 1973 ఏప్రిల్‌ 3న మైసూరులో జన్మించారు. ఆయన తండ్రి సుందరం ప్రముఖ నృత్య దర్శకుడు. తండ్రి కొరియోగ్రాఫర్ కావడం వల్ల చిన్నప్పటి నుంచే డ్యాన్స్​పై మక్కువ పెంచుకున్నాడు ప్రభుదేవా. లక్ష్మీనారాయణ, ధర్మరాజు మాస్టర్ల దగ్గర నృత్యంలో మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తండ్రి దగ్గరే సహాయకుడిగా చేరాడు ప్రభుదేవా.

  • కొరియోగ్రాఫర్​గా...

టీనేజిలోనే చిరంజీవి, కమల్​హసన్​, రజినీకాంత్ లాంటి అగ్ర కథానాయకులతో స్టెప్పులేయించాడు ప్రభుదేవా. అలా కొరియోగ్రాఫర్​గా చేస్తూనే ఇందు అనే తమిళ సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. అనంతరం శంకర్ తెరకెక్కించిన ప్రేమికుడు సినిమా ప్రభుదేవాకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. అక్కడి నుంచి నటుడిగా, కొరియోగ్రాఫర్​గా రెండింటిలోనూ రాణించాడు.

  • దర్శకుడిగా..

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో దర్శకుడిగా మారాడు ప్రభు. తొలి చిత్రమే ఘన విజయం సాధించడం వల్ల చాలా అవకాశాలొచ్చాయి. ప్రభాస్‌తో ‘పౌర్ణమి’, చిరంజీవితో ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ చిత్రాలు చేశాడు. బాలీవుడ్‌లోనూ సల్మాన్‌ఖాన్, అజయ్‌ దేవగణ్, అక్షయ్‌కుమార్‌ వంటి అగ్ర నటుల సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సల్మాన్‌తో ‘దబాంగ్‌ 3’ని తెరకెక్కిస్తున్నాడు.

  • వార్తల్లో...

వ్యక్తిగత జీవితం పరంగా కూడా పలుమార్లు వార్తల్లోకెక్కాడు ప్రభుదేవా. రామలతని వివాహం చేసుకున్న ప్రభు.. 2010లో ఆమె నుంచి విడిపోయాడు. కథానాయిక నయనతారతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు... కానీ నాటకీయ పరిణామల మధ్య 2012లో విడిపోయారు. ఆయన తమ్ముళ్లు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్‌ నటులుగా, నృత్య దర్శకులుగా రాణిస్తున్నారు.

రెండుసార్లు జాతీయ పురస్కారాలను అందుకొన్నాడు ప్రభుదేవా. నృత్య కళలో ఆయన చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ABOUT THE AUTHOR

...view details