70ల్లో పుట్టిన ఓ కుర్రాడికి ఏడెనిమిదేళ్లొచ్చాయ్. తొలిసారిగా థియేటర్‌కెళ్లి సినిమా చూశాడు. అది ఎన్టీఆర్ సినిమా. కాసేపటికి పాటొచ్చింది. 'అబ్భా. ఎంత బావుందో! ఎన్టీవోడికి పాటలు పాడటం కూడా వచ్ఛా. భలే పాడుతున్నాడే' అని మనసులోనే అనుకున్నాడు. తర్వాత ఏఎన్నార్ సినిమాకెళ్లాడు. ఆయన కూడా మంచి పాటగాడే అనిపించింది చూస్తుంటే. ఇంకొన్ని రోజులకు చిరంజీవి సినిమా చూశాడు. అందులోనూ పాటలు సూపర్. చిరంజీవి పాటలు పాడటంలో తక్కువోడు కాదనుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్.. ఇలా ఒక్కొక్కరి సినిమాలు చూస్తున్నాడు. అందరి పాటలూ అదిరిపోతున్నాయ్. వాళ్లు భలే పాడతారని నాన్నకు చెబితే.. నవ్వాడు. హీరోలు పాటలు పాడరని.. ఏదో పేరు చెప్పి ఆయన పాడతాడని అన్నాడు. కానీ సినిమాలు చూస్తే మాత్రం ఆ హీరోలు పాడినట్లే ఉన్నాయి. నమ్మబుద్ధి కావట్లా!
ఆ కుర్రాడికి వయసు పెరిగింది. తెలివి వచ్చింది. హీరోలు పాటలు పాడరని అర్థం చేసుకున్నాడు. నాన్న చెప్పిందే కరెక్ట్. ఆ పని చేసేది వేరే వ్యక్తి. అప్పట్నుంచి నాన్న లాగే తనూ ఆ వ్యక్తికి అభిమాని అయిపోయాడు. తర్వాత యథావిధిగా సినిమాలు చూస్తున్నాడు. కానీ అతడిలో మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. ఏ సినిమా చూసినా టైటిల్స్‌లో 'ప్లే బ్యాక్' కార్డు కింద ఒకే పేరు కనిపిస్తోంది. దాని కింద రెండు మూడు పేర్లుంటున్నాయి. ఆ పేర్లు మారుతూ కూడా ఉన్నాయి. అలా ఒకే వ్యక్తి ప్రతి సినిమాకూ పాడటమేంటి.. అందులోనూ అన్ని పాటలూ పాడటమేంటి.. నమ్మబుద్ధి కావట్లా! సినిమాలు బాగా చూసే తన బాబాయిని ఇదే విషయం అడిగితే.. 'అవున్రా అన్ని పాటలూ ఆయనే పాడతాడు. లేడీ సింగర్లు మారతార్రా' అన్నాడు.
ఆ కుర్రాడు ఇంకా పెద్దోడయ్యాడు. పెళ్లయి పిల్లలు కూడా పుట్టారు. తన కూతురికి కొంచెం ఊహ వచ్చాక 'దశావతారం' సినిమాకు తీసుకెళ్తే.. ఇంటికొచ్చాక ఒక మాట అంది. 'హీరో ఒక్కడే పది క్యారెక్టర్లు వేశాడు కదా. పది మందితో డబ్బింగ్ చెప్పించడానికి చాలా కష్టమై ఉంటుంది కదా' అని. 'ఆ పాత్రలన్నింటికీ డబ్బింగ్ చెప్పింది కూడా ఒక్కడేనే' అంటే ఎంతకీ ఒప్పుకోలేదు. తర్వాత ఆయన స్వయంగా ఆ వాయిస్‌లు మార్చి మార్చి వినిపించిన వీడియో చూపిస్తే నోరెళ్లబెట్టి చూసింది. ఇంకో రోజు మేనల్లుడు ఇంటికొచ్చాడు. 'ఆ టీవీలో చూడు మావయ్యా. ఆయనెవరో 40 వేల పాటలు పాడినట్లు చెబుతున్నారు కామెడీగా' అన్నాడు. ఆ కుర్రాడికి ఒక్క రోజులో ఆ గాయకుడు 17 పాటలు పాడి ప్రపంచ రికార్డు నెలకొల్పిన వార్త క్లిప్పింగ్ చూపించి.. వికీపీడియా తీసి ఆయన పాడిన పాటల వివరాలు ఒక పదినిమిషాల పాటు స్క్రోల్ చేసి చూపిస్తే వామ్మో అంటూ కళ్లు తేలేశాడు.
ఒక రోజు అనుకోకుండా ఇంటికొచ్చిన ఎదురింటి కుర్రాడు.. మీరెప్పుడూ ఆయనెవరి గురించో చెబుతుంటారు. 'ఫీల్ అంటే ఇదండీ' అంటూ ఒక కుర్ర సింగర్ పాడిన కొన్ని పాటలు వినిపించాడు. వెంటనే.. మొబైల్లోని మ్యూజిక్ ఫోల్డర్ ఓపెన్ చేసి.. 'ప్రేమ లేదని.. ప్రేమించరాదని' అని వినిపించగానే అతడి నోట మాట రాలేదు. 'ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం' అనే పాట ప్లే చేస్తే అతడి కళ్ల నుంచి నీళ్లు రాలాయి. తర్వాత 'వయ్యారి గోదారమ్మా' పాట వినిపిస్తే.. తేరుకుని పులకింతకు గురయ్యాడు. 'యురేకా సకామికా'.. విని ఆ కుర్రాడిలో ఎక్కడలేని హుషారు పుట్టింది! ఇలాగే ఒక్కో పాట ప్లే చేస్తూ వెళ్తే ఆ గాత్రంలో పలికించిన ఎన్నెన్నో భావోద్వేగాలకు అబ్బురపడిపోయి.. 'నటీనటులు కళ్లతో, హావభావాలతో ఎమోషన్లు చూపించడం తెలుసు కానీ.. ఇలా ఒక గాయకుడు తన గొంతుతో ఇన్ని ఉద్వేగాలు పలికించడమేంటి. మీకో దండం.. బాలుకో దండం' అంటూ చేతులు జోడించేశాడు.
'పాటే ప్రాణంగా.. పాటే జీవంగా... పాటే జీవనవేదంగా బతికే బాలు.. తన పిల్లలకు కూడా పల్లవి, చరణ్ అని పేరుపెట్టుకొన్నారు. 'ఆయనీరోజు మన లోకంలో లేకపోవచ్ఛు. ఆయన పాటలు మనల్ని వేరే ప్రపంచంలోకి విహరింపజేయడానికి నిత్యం వినిపిస్తూనే ఉంటాయి.' అని పిల్లలకు చెప్పిన ఆ తండ్రి... మనసులో బాలుకి నమస్కరించాడు.
గొంతు నిండా అమృతం నింపుకొని పాడితే... ఆ పాట ఎంత మధురంగా చెవికి చేరుతుందో ప్రత్యేకంగా చెప్పాలా? బాలు ప్రతి పాటనీ అలా పాడారేమో. లేకపోతే ఆయన పాటలు అంత మధురంగా ఎందుకుంటాయి? ఒకటా రెండా? తరాలకి సరిపడేలా పాటల నిధిని ఇచ్చి వెళ్లిపోయారు బాలు. ఆయన లేకపోవచ్చు కానీ... అమృత తుల్యమైన ఆయన పాటలు మాత్రం నిత్య నూతనంగా శ్రోతల చెవికి చేరుతూనే ఉంటాయి. బాలుని సజీవంగా కళ్ల ముందు సాక్షాత్కరిస్తూనే ఉంటాయి.
తెలుగులోనే పది వేలకి పైగా పాటలు బాలు ఆలపించారు. తెలుగువారు వేసే ప్రతి అడుగులోనూ, ప్రతి భావోద్వేగంలోనూ ఆయన పాట ఒకటి చెవికి చేరుతూ ఉంటుంది.'తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో... తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం... ఎగిరొచ్చే కెరటం సింధూరం...' అంటూ తెలుగు శ్రోతకి పాటల ఉదయాలు బాలు గళంతోనే మొదలవుతాయి.
'మబ్బే మసకేసిందిలే.. పొగ మంచే తెరగా నిలిచిందిలే' అంటూ ఊరు నిదరోయిన సంగతి చెప్పేది ఆ గానగంధర్వుడే.
'ఊరుకో పాపాయి...' అంటూ బాలునే జోల పాడతారు. 'ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం... నడుమ ఈ నాటకం...' అంటూ శాశ్వతమైన జోలపాట ఆయన నోటి నుంచే వచ్చింది.